Read more!

టెన్త్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం.. వర్సిటీలో ర్యాగింగ్ పేర చిత్ర హింసలు..

సమాజంలో హింసా ప్రవృత్తి పెరిగిపోతోంది. చిన్నపిల్లలు విద్యార్థులు సైతం  దారుణ నేరాలకు పాల్పడుతున్న సంఘటనలు పెచ్చరిల్లుతున్నాయి. అందుబాటులోకి సెల్ ఫోన్ లు.. విచ్చలవిడిగా లభ్యమౌతున్న మాదరద్రవ్యాలు.. బిజీ లైఫ్ స్టైల్ కారణంగా తల్లిదండ్రులలో కరవైన చైల్డ్ కేరింగ్ ఇవన్నీ ఇందుకు కారణాలుగా నిపుణులు చెబుతున్నారు.  

సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారీతిగా వ్యవహరించడానికి పిల్లలు అలవాటు పడుతున్నారు. పాఠశాలలు, కాలేజీల్లో చదివే విద్యార్థులు సైతం దారుణమైన హింసాకాండకు పాల్పడుతున్నారు. సమాజంలో పెరిగిపోతున్న వికృత వైపరీత్య పోకడలకు ఉదాహరణలుగా దేశంలో ఒకే రోజు వెలుగులోనికి వచ్చిన రెండు ఉదంతాలను చెప్పుకోవచ్చు. హైదరాబాద్ హాయత్ నగర్ లో టెన్త్ విద్యార్థులు తోటి విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

అలాగే అసోంలో దిబ్రూగఢ్ వర్సిటీలో సీనియర్ విద్యార్థుల వికృత ర్యాగింగ్ కు బయపడి ఓ విద్యార్థి హాస్టల్ రెండో అంతస్థు పై నుంచి దూకి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ రెండు ఘటనలూ సమాజంలోని వికృత పోకడలు విద్యార్థులపై చూపుతున్న దుష్ట ప్రభావానికి ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. 

హైదరాబాద్ ఘటన విషయానికి వస్తే గడ్డి అన్నారంలో నివసిస్తూ టెన్త్ చదువుకుంటున్న ఓ విద్యార్థిని నివాసానికి ఆమె సహ విద్యార్థులు వెళ్లారు. వాళ్లు వెళ్లిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆమెను బెదరించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఇదంతా వారి సెల్ ఫోన్ లో చిత్రీకరించి, ఎవరికీ చెప్పొద్దని బెదరించారు.  తరువాత మరో సారి కూడా ఈ వీడియో చూపి బెదరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

అంతటితో ఆగకుండా తాము చేసిన దారుణాన్ని వీడియో తీసి తోటి విద్యార్థులకు పంపారు. విషయం విద్యార్థిని తల్లిదండ్రులకు తెలియడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచారానికి పాల్పడిన విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇక అసోంలో అయితే సీనియర్లు దారుణంగా ర్యాగింగ్ చేస్తుండటంతో భరించ లేని విద్యార్థి తాను ఉండే హాస్టల్ రెండో అంతస్థుపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సీనియర్లు తప్ప తాగి..తన చేతా తాగించి అసభ్యంగా ఫొటోలు తీసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేస్తామని బెదరించే వారనీ, తన వద్ద డబ్బులు గుంజుకునే వారనీ ఆ విద్యార్థి చెప్పాడు. నాలుగు నెలలుగా శారీరక, మానసిక వేదనను అనుభవించి ఇక తన వల్ల కాదన్న నిర్ణయానికి వచ్చిన ఆ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యలు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.