థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి జనసేన అవకాశం ఇస్తుందా?
posted on Oct 14, 2022 @ 10:27AM
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వి.. ఎంత వేగంగా రాజకీయాలలో ఒక వెలుగు వెలిగారో.. అంతే వేగంగా మసకబారిపోయారు. వైసీపీ తరఫున గొంతు చించుకుని మరీ ప్రత్యర్థుల్ని చీల్చి చెండాడి... ఆ పార్టీ అధికారంలోకి రాగానే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్(ఎస్వీబీసీ) చైర్మన్ పదవి సంపాదించిన పృధ్వికి ఆ పదవి మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది.
నోటి దురుసు కారణంగా వచ్చిన పదవి మళ్లీ అదే నోటి దురుసు కారణంగా పోయిందని అప్పట్లో వైసీపీ వర్గాల్లోనే సెటైర్లు పేలాయి. ఏది ఏమైతేనేం అత్యంత అవమానకరమైన రీతిలో ఆయన పదవినే కాదు పార్టీలో స్థానాన్నీ కోల్పోయారు. సరిగ్గా థర్టీ ఇయర్స్ పృధ్వి ఏ ఆరోపణలతోనైతే పదవీ చ్యుతుడయ్యాడో.. సరిగ్గా అవే ఆరోపణలను ప్రస్తుత మంత్రి అంబటి, మాజీ మంత్రి అవంతి కూడా ఎదుర్కొన్నారు. అయితే వారిపై ఈగ కూడా వాలనీయని జగన్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫృధ్విపై మాత్రం కఠిన చర్యలు తీసుకున్నారు. అంతే కాదు.. మళ్లీ పార్టీలో ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. పూర్తిగా పక్కన పెట్టేశారు.
దీంతో పృథ్వి పృధ్వీ.. తాను వైసీపీలో చేరి తప్పు చేశానని ఇటీవల మీడియా ముఖంగా పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేశారు. అవకాశం ఇస్తే జనసేన తరఫున పని చేయడానికి సిద్ధమనీ, జగన్ పార్టీలోని అక్రమార్కుల గుట్టు బయటపెడతాననీ కూడా సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ఆయన జనసేనాని పవన్ కల్యాణ్ చెంతకు చరేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
ఒక చిన్న ఐడియా జీవితాన్నే మార్చేసినట్లు.. వైసీపీలో చేరడమనే పొరపాటు తన జీవితాన్నే తల్లకిందులు చేసేసిందని పృధ్వి భావిస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు ఆ పొరపాటు సరిదిద్దుకోవాలంటే జనసేనే సరైన వేదిక అని భావిస్తున్నట్లు చెబుతున్నారు. జనసేన గూటికి చేరి అవకాశం లభిస్తే తాడేపల్లి గూడెం నుంచి పోటీ చేయాలని పృధ్వి భావిస్తున్నారని ఆయన మాటలను బట్టే అవగతమౌతుంది. తాడేపల్లి గూడెంలో అయితే తన సామాజిక వర్గానికి చెందిన ఓట్లు గణనీయంగా ఉండటం కలిసి వస్తుందన్నది ఆయన భావనగా పరిశీలకులు చెబుతున్నారు. మరి జనసేన ఫృధ్విని దరి చేర్చుకుంటుందా? పోటీకి అవకాశం ఇస్తుందా? అంటే దానికి సమాధానం కాలమే చెప్పాలి.