తెలంగాణకు కొత్త గవర్నర్ ప్రచారానికి ఇక ఫుల్ స్టాప్?
posted on Feb 13, 2023 @ 12:54PM
తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు చేపట్టి మూడున్నరేళ్లు పూర్తి కావస్తోంది. 2019 సెప్టెంబర్ లో ఆమె తెలంగాణ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఆ లెక్కన ఆమె పదవీ కాలం ముగిసేందుకు ఇంకా ఏడాదిన్నరకు పైగానే సమయముంది. అయితే, త్వరలోనే, ఆమె స్థానంలో తెలంగాణకు కొత్త గవర్నర్ వస్తున్నారని రాజకీయవర్గాలలో నిన్న మొన్నటి వరకూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
ప్రస్తుతం తమిళి సై తెలంగాణ గవర్నర్ బాధ్యతలతో పాటుగా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. ఈ నేపధ్యంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్’ బాధ్యతలు పూర్తి స్థాయిలో ఆమెకు అప్పగించి, తెలంగాణకు కొత్త వారిని గవర్నర్ గా నియమించే ప్రతిపాదనకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారనీ, ఇహనో ఇప్పుడో ఉత్తర్వులు వెలువడటమే తరువాయి అన్న స్థాయిలో ఈ ప్రచారం సాగింది. ఇటీవల కాలంలో గవర్నర్ కు ముఖ్యమంత్రికి, రాజ్ భవన్ , ప్రగతి భవన్ కు మధ్య దూరం పెరిగిపోవడం, రాజ్యాంగ వ్యవస్థల మధ్య వివాదాలు తలెత్తడం వంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోవడం ఒక కారణం అయితే , రాష్ట్ర ప్రభుత్వంతో తలెత్తిన వివాదాలకు సంబంధించి గవర్నర్ తమిళి సై పలు మార్లు కేంద్ర హోం మంత్రికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను, రాష్ట్ర ప్రభుత్వంలో బాధ్యతగల మంత్రులు, ఇతర అధికారులు మీడియా ముఖంగా లేవనెత్తిన అంశాలను పరిశీలించిన మీదట, కేంద్ర హోం శాఖ అధికారులు, తెలంగాణకు రాజకీయ నాయకుల కంటే, రిటైర్డ్ సివిల్ సర్వెంట్స్ గవర్నర్’గా నియమించడం అవసరమని నిర్ణయానికి వచ్చారని, అందుకే తమిళి సై స్థానంలో రిటైర్డ్ సివిల్ సర్వెంట్’ ను నియమించేందుకు వీలుగా ఆమెను పుదుచ్చేరికి పరిమితం చేయనున్నారనీ కూడా అప్పట్లో విస్తృతంగా వార్తలు వివనవచ్చాయి.
గతంలో తెలంగాణ ఆందోళన ఉదృతంగా ఉన్న రోజుల్లో (2010)లో ఉమ్మడి రాష్త్రం గవర్నర్’గా వచ్చిన మాజీ ఐపీఎస్ ఈఎస్ఎల్ నరసింహన్, రాష్ట్ర విభజన తర్వాత ఉభయ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ గా వరసగా 9 ఏళ్ళు కొనసాగడమే కాకుండా విభజన వ్యవహారాలను సమర్ధవంతంగా నిర్వహించిన విషయాన్ని గుర్తు చేస్తూ తమిళిసై మార్పుతధ్యమన్న ఊహాగానాలు షికార్లుచ చేశాయి. నరసింహన్ గవర్నర్ గా ఉన్న రోజుల్లో,గవర్నర్, ముఖ్యమత్రి మధ్య సత్సంబంధాలు ఉండేవి, ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ తో అన్ని విషయాలు చర్చంచి, సలహాలు తీసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. వ్యక్తిగత స్థాయిలోనూ ఇద్దరి మధ్య గౌరవప్రదమైన సంబంధాలే చివరి వరకు కొనసాగాయి. ముఖ్యమంత్రి, గవర్నర్ దంపతులకు సాష్టాంగ నమస్కారం చేసి, ఆశీస్సులు అందుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. పండగలు పబ్బాలకు శుభాకాంక్షలు ఇచ్చి పుచ్చుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.
ఈ అంశాలు అన్నింటినీ పరిగణలోకి తీసుకుని, ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన రిటైర్డ్ సివిల్ సర్వెంట్ ను తెలంగాణ కొత్త గవర్నర్ గా నియమించే అలోచనలో కేంద్ర హోం శాఖ ఉందని, . అయితే, ఇప్పటికే గవర్నర్ గా పనిచేసిన అనుభవం ఉన్న మాజీ సివిల్ సర్వెంట్’ను నియమిస్తారా? లేక కొత్తవారికి అవకాశం ఇస్తారా,అనేది తేలాల్సి ఉందని కూడా జోరుగా వార్తలు వినవచ్చాయి. అయితే కేంద్రం తాజాగా కొన్నిరాష్ట్రాలకు గవర్నర్ లను నియమించింది. కొందరిని బదిలీ చేసింది.
సాటి తెలుగురాష్ట్రం అయిన ఏపీ గవర్నర్ ను సైతం ఛత్తీస్ గఢ్ కు బదలీ చేసింది. అయినా తెలంగాణ గవర్నర్ తమిళిసైని మాత్రం కదపలేదు. దీంతో ఇంత కాలంగా జరుగుతున్న ప్రచారం అంతా ఊహాగానాలేనని తేలిపోయింది. కేంద్రం తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ తమిళిసై మధ్య ఉన్న విభేదాలను పెద్ద సీరియస్ గా తీసుకోలేదని తేలిపోయింది. తమిళిసైను తెలంగాణ గవర్నర్ గా ఆమె పదవీ కాలం ముగిసే వరకూ కొనసాగించే అవకాశాలే ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.