అన్న క్యాంటిన్ అంటే వైసీపీకి ఇంత వణుకెందుకు?
posted on Sep 7, 2022 @ 3:43PM
నిరుపేద అన్నార్తులకు అతి తక్కువ ధరకే పట్టెడన్నం పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ లో అన్న క్యాంటీన్లు ఏర్పాటయ్యాయి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత మాజీ సీఎం.. అన్న అని అందరూ పిలుచుకునే ఎన్టీ రామారావు పేరు మీద టీడీపీ ప్రభుత్వం ఈ క్యాంటీన్లను ఏపీ వ్యాప్తంగా ఏర్పాటు చేసింది. అన్నా క్యాంటీన్ల కోసం అక్షయపాత్ర అనే స్వచ్ఛంద సంస్థతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో అన్న క్యాంటీన్లు సక్రమంగా నడిచాయి. వేలాది మందికి ప్రతిరోజూ ఇంత అన్నం ముద్ద దొరికేది. అయితే.. అన్నా క్యాంటీన్లు అంటేనే వైసీపీ నేతల్లో వణుకు వచ్చేస్తోంది. టీడీపీ నేతలు ఎక్కడ అన్నా క్యాంటీన్ ప్రారంభించేందుకు సిద్ధమైనా వైసీపీ శ్రేణులు దాడులు, విధ్వంసాలకు దిగుతున్నారు.
అయితే.. 2019 ఎన్నికల తర్వాత ఏపీలో ఏర్పడ్డ వైసీపీ సర్కార్ అన్న క్యాంటీన్లను పట్టించుకోలేదు. దాంతో అన్నా క్యాంటీన్లను కొనసాగించాలనే డిమాండ్ అన్నార్తుల నుంచి గట్టిగా వినిపించింది. కానీ.. ప్రతిపక్షంలోకి వచ్చిన టీడీపీ ముద్ర ఈ క్యాంటీన్లపై ఉండడంతో జగన్ రెడ్డి సర్కార్ ఏ మాత్రం సహించలేకపోయింది. నిరుపేదల డిమాండ్ ఎక్కువైన క్రమంలో అన్నా క్యాంటీన్ల పేరు రాజన్న క్యాంటీన్లుగా మార్చేసి నడిపించాలని భావించింది. ఆ వెంటనే అన్న క్యాంటీన్ భవనాల రంగులు కూడా మార్చి, కొన్నాళ్ల తర్వాత వాటిని నిర్వహిస్తామని కాలయాపన చేసింది. ఆ తర్వాత క్యాంటీన్ల ఊసే లేకుండా వైసీపీ సర్కార్ చేసింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజన్న క్యాంటీన్ పేరుతో కొన్నాళ్లు అన్నదానం నిర్వహించారు. పేదల కడుపు నింపే ఆ క్యాంటీన్ అతీ గతీ ఏమైందో ఎవ్వరికీ తెలియదు.
ఏపీలోని నిరుపేదల ఆకలి తీర్చేందుకు వైసీపీ సర్కార్ కు ఏమాత్రం ఇష్టం లేదని గ్రహించిన ప్రతిపక్ష టీడీపీ నేతలే స్వయంగా రంగంలోకి దిగారు. పలు చోట్ల సొంత నిధులతో అన్న క్యాంటీన్లను ప్రారంభించేందుకు యత్నించారు. ఈ క్రమంలో మంగళగిరిలో అన్నా క్యాంటీన్ ప్రారంభించేందుకు టీడీపీ నేతలు రెడీ అయితే.. వైసీపీ శ్రేణులు, పోలీసులు ఆ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ఆ తదుపరి చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గం కుప్పంలో అన్న క్యాంటీన్ ప్రారంభించే సమయానికి వైసీపీ నేతలు, శ్రేణులు విధ్వంసం సృష్టించాయి. అక్కడితో ఆగకుండా అన్న క్యాంటీన్ ను ప్రారంభించేందుకు వెళ్లిన చంద్రబాబుపై దాడికి యత్నించే దాకా పరిస్థితి వెళ్లింది.
తాజాగా గుంటూరు జిల్లా తెనాలిలో మాజీ మంత్రి, టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ వద్దకు ఆకలితో వచ్చిన నిరుపేదలపై ఆడా మగా తేడా లేకుండా పోలీసులు లాఠీలు ఝళిపించడం విమర్శలకు దారితీసింది. పేదలకు అన్నదానం చేసేందుకు వచ్చే టీడీపీ నేతలు, కార్యకర్తలను ఇనుప ముళ్ల కంచెల, బారికేడ్లతో అడ్డుకున్నారు. ట్రాఫిక్ సాకు చూపించి దొరికిన వారిని దొరికినట్లు చితకబాదేశారు. ఆహార పదార్థాలను బూటు కాళ్లతో ఇష్టం వచ్చినట్లు తొక్కేశారు. తెనాలి మార్కెట్ సెంటర్ ను పోలీసులు రణరంగంలా మార్చేశారు.
ఏపీలో ఎక్కడ అన్న క్యాంటీన్ ప్రారంభం అవుతున్నా.. లేక ఇప్పటికే నడుస్తున్న చోట్ల వైసీపీ నేతలు, పోలీసులు దౌర్జన్యకాండ జరిగిపోతూనే ఉంది. టీడీపీ నేతలను అరెస్టులు చేయించడం, కేసులు పెట్టించడం లాంటివి జనంలో పెద్ద ఎత్తున చర్చకు వస్తున్నాయి. పేదల పక్షాన టీడీపీ నేతలు నిలబడుతుంటే.. వైసీపీలో రోజు రోజుకూ ఆందోళన పెరిగిపోతోందంటున్నారు. అన్న క్యాంటీన్ల కోసం వేసిన పందిళ్లను, ఫ్లెక్సీలను తొలగిస్తోంది. అన్న క్యాంటీన్లు నడిస్తే.. టీడీపీ పట్ల ప్రజల్లో సింపతీ పెరిగిపోతుందనే వణుకు వైసీపీలో వచ్చేస్తోంది. అన్నా క్యాంటీన్లకు క్యూలు కట్టి మరీ నిరుపేదలు అన్నం కోసం పోటెత్తి వస్తుంటే.. చూసి తట్టుకోలేక వైసీపీ నేతలు ఇలా దారుణాలు, దౌర్జన్యకాండకు దిగుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అన్న క్యాంటీన్లు ఒక విధంగా టీడీపీకి ప్లస్ పాయింట్ గా మారితే.. వైసీపీకి పెద్ద మైనస్ పాయింట్ అవుతున్నాయనే వాస్తవం అధికార పార్టీ అస్సలు సహించలేకపోతోందంటున్నారు. అన్న క్యాంటీన్లు విజయవంతంగా నడవడం ఇష్టం లేకే ఇలా ఎక్కడికక్కడ వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే.. నందమూరి నటసింహం, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తన సొంత నిధులతో హిందూపురం నియోజకవర్గంలో 2 రూపాయలకే నిరుపేదలకు చికెన్, గుడ్డుతో కూడిన ప్రత్యే మాంసాహార భోజనాన్ని కడుపు నిండా పెడుతున్న అన్న క్యాంటీన్ 100 రోజులగా నిరాటంకంగా సాగుతుండటం పూర్తిచేసుకోవడం కొసమెరుపు.