వైసీపీదీ ఓ గెలుపేనా? జగన్ విర్రవీగాల్సినంత ఉందా?
posted on Sep 20, 2021 @ 8:44PM
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం. ఈ ప్రాంతం ఆ ప్రాంతం.. ఈ జిల్లా ఆ జిల్లా అనే తేడా లేకుండా ఏపీ వ్యాప్తంగా అధికారపార్టీ అభ్యర్థులే గెలిచారంటూ ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. కింది స్థాయి కేడర్ అలా ఆనందించారంటే కాస్త అర్థముంది గానీ.. సీఎం జగన్మోహన్‌రెడ్డి సైతం పరిషత్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిందంటూ అటు ట్విట్టర్‌లో, ఇటు మీడియా ముందు తెగ ఖుషీ అవుతూ విర్రవీగడం మాత్రం కామెడీగా ఉందంటున్నారు చూసినవారంతా.
ఎప్పటిలానే దేవుడి దయ, ప్రజల చల్లని ఆశీస్సులతో తాము జెడ్పీటీసీ, ఎమ్పీటీసీ ఎన్నికల్లో భారీ విజయం సాధించామంటూ మహా ఆనందం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. ఉబ్బు ఆపుకోలేనట్టు.. ఆదివారమే ట్విట్టర్‌లో ట్వీట్ చేయగా.. సోమవారం మీడియా ముందుకొచ్చి ప్రజల మన్ననలు పొందామంటూ.. ఈ విజయాన్ని కొందరు ఓర్వట్లేదంటూ రొటీన్‌గా కొన్ని పత్రికలు, ఛానెళ్లపై ఆడిపోసుకున్నారు. ఇంతకీ జగనన్నకి అంతటి హ్యాపీనెస్ ఎందుకో ఎవరికీ అర్థం కావట్లేదు.
అసలు జెడ్పీటీసీ, ఎమ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు జరిగాయో కూడా చాలా మందికి గుర్తుకే లేదు. అప్పుడెప్పుడో ఐదారు నెల్ల క్రితం జరిగాయి. ప్రతిపక్షాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఓడించాలని.. హడావుడిగా వారం రోజుల్లో ఎన్నికల తంతు ముగిసేలా ఈసీతో కలిసి ప్రభుత్వం కుట్రలు చేసిందనే ఆరోపణ ఉంది. ఇక అంతకుముందు పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ ఆగడాలు, బెదిరింపులు, కుట్రలు గుర్తెరిగి.. ఈసీ తీరును తప్పుబడుతూ.. జగన్ సర్కారు విధానాలకు నిరసనగా.. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నుంచి తప్పుకుంది. ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబే స్వయంగా మీడియా ముందు ప్రకటించి.. తాము ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు బహిరంగంగానే ప్రకటించారు. ఈ విషయం రాష్ట్రప్రజలందరికీ తెలిసిందే. మరి, టీడీపీ పోటీ చేయని పరిషత్ ఎన్నికల్లో వైసీపీ ఎవరి మీద గెలిచినట్టు? అసలు పోటీయే లేనిచోట గెలుపు ఎలా ఉంటుంది? టీడీపీ ఎలక్షన్‌ను బహిష్కరిస్తే.. అది ఓటమి అవుతుందా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు జగన్‌రెడ్డి గారు.. అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.
జగన్‌రెడ్డి ఇంతలా ఆనందాన్ని వ్యక్తం చేయడానికి కారణం లేకపోలేదంటున్నారు. ఇటీవల జగన్ పాలనపై ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ధరల పెరుగుదల, పన్నుల బాదుడు, పథకాల్లో కోత, మహిళలపై దాడులు.. ఇలా అడ్డగోలు పాలనపై అన్నివర్గాల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతోంది. అందుకే, ఓటమి భయంతోనే ఎన్నికలకు రెండున్నరేళ్ల ముందే ప్రశాంత్ కిశోర్ టీమ్‌ను మళ్లీ రంగంలోకి దింపుతున్నారని అంటున్నారు. ఆ ప్రజా వ్యతిరేకతను కవర్ చేసుకోడానికే.. ఇలా మీడియా ముందుకొచ్చి.. ప్రజల్లో తమ ప్రభుత్వానికి విపరీతమైన ఆదరణ ఉందని.. అందుకు జెడ్పీటీసీ, ఎమ్పీటీసీ ఎన్నికల ఫలితాలే నిదర్శణమని కవరింగ్ ఇచ్చుకోడానికే.. దేవుడు దయ, ప్రజల చల్లని ఆశీస్సులతో ఘన విజయం సాధించామని గొప్పలు చెప్పుకున్నారని అంటున్నారు. టీడీపీ పోటీయే చేయని ఎన్నికల్లో గెలిచామని వైసీపీ అంతలా విర్రవీగటం తగునా? అదీ ఓ గెలుపేనా? జగన్‌కు ఆమాత్రం తెలీదా?