గోషామహల్ ఓటెవరికి ?
posted on Jun 17, 2023 @ 12:37PM
తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 హైదరాబాద్ ,సికింద్రాబాద్ పరిధిలో 15 అసెంబ్లీ నియోజక వర్గాలున్నాయి. అయితే సిటీలో ఉన్న అన్ని నియోజక వర్గాలలో హైదరాబాద్ నడి బొడ్డున ఉన్న గోషామహల్ నియోజక వర్గానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. మినీ ఇండియా గా పేరొందిన గోషామహల్ నియోజక వర్గంలో అన్ని వర్గాలు, అన్నీ రాష్ట్రాల ప్రజలు ఉంటారు. వ్యాపార కేంద్రంగా గుర్తింపు పొందిన ఈ నియోజక వర్గంలో గెలుపు ఎవరికీ అంత ఈజీ వ్యవహారం కాదు. అయితే, కాశీ నుంచి కన్యాకుమారి వరకు అన్ని ప్రాంతాలు అన్ని రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా ఉండే ఈ నియోజక వర్గంలో ప్రాంతీయ భావాలకంటే జాతీయ భావాల వైపే కొంచెం ఎక్కువ మొగ్గు కనిపిస్తుంది.
అదలా ఉంటే 2018 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి రాజా సింగ్ వరసగా రెండవ సారి ఈ నియోజక వర్గం నుంచి విజయం సాధించారు. అంతే కాదు ఆ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన ఏకైక నియోజకవర్గం గోషామహల్. బీజేపీ టికెట్ పై గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజ్ సింగ్. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో దుబ్బాక నుంచి రఘునందన్, హుజురాబాద్ నుంచి ఈటల రాజేందర్ గెలిచినా, 2018 ఎన్నికల్లో గెలిచిన ఏకైక బీజేపీ ఏమ్మేల్యేగా రాజా సింగ్ చరిత్ర సృష్టించారు. ఆవిధంగానూ గోషామహల్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అయితే రాజాసింగ్ రెండవసారి గెలిచినప్పటి నుంచీ, ఆయన్ని వివాదాలు చుట్టూ ముడుతూనే ఉన్నాయి. హైదరాబాద్ లో వివాదాస్పద స్టాండప్ కమెడీయన్ మునావర్ ఫరూఖీ నిర్వహించిన షోకు వ్యతిరేకంగా అయన చేసిన వ్యాఖ్యలు, విడుదల చేసిన వీడియో వివాదాస్పదం కావడంతో బీజీపీ అధినాయకత్వం ఆయన్ని గత ఆగష్టు లో పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇప్పటికీ సస్పెన్షన్ కొనసాగుతోంది. అదే కేసులో ఆయన అరెస్టయ్యారు ..మూడు నెలలకు పైగా జైలు జీవితం అనుభవించి, బెయిల్ పై విడుదలయ్యారు. కేసు ఇంకా నడుస్తూనే వుంది. ఈ నేపధ్యంలో బీజేపీ ఎన్నికలలోగా సస్పెన్షన్ ఎత్తి వేస్తుందా? ఆయనకు మళ్ళీ బీజేపీ టికెట్ ఇస్తుందా? అనే అనుమానాలు అయితే ఉన్నాయి. అయితే ఆయన మాత్రం పోటీకి సిద్దమవుతున్నారు. వరసగా మూడవసారి గెలిచి, హ్యాట్రిక్ సాధిస్తానని ధీమా వ్యక్త పరుస్తున్నారు.
అదలా ఉంటే ఈసారి ఎలాగైనా గోషామహల్ పై గెలుపు జెండా ఎగరేయాలని.. అటు బీఆర్ఎస్, ఇటు ఎంఐఎం పార్టీలు తహతహలాడుతున్నాయి. ఈ మేరకు రెండు పార్టీలు ఎవరికి వారు యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నాయి.మరో వంక పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ తహతహలాడుతోంది. అయితే గో సంరక్షణ, హిందూ ధర్మ పరిరక్షణకు పెట్టింది పేరుగా నిలిచిన రాజాసింగ్ ను ఓడించడం ఇటు బీఆర్ఎస్, ఎంఐఎం జోడీకి, అటు దేశ వ్యాప్తంగా హిందూ వ్యతిరేక లౌకిక వాద అజెండాతో పోతున్న కాంగ్రెస్ పార్టీకి అంత ఈజీ కాదని అంటున్నారు. అయినా గోషామహల్‌లో గెలుపు కోసం అన్ని పార్టీలు చాలా చురుగ్గా పావులు కదుపుతున్నాయి. దాంతో.. రాజాసింగ్ ఇలాకాలో తడాఖా చూపే పార్టీ ఏదన్నది ఆసక్తిగా మారింది.
2009లో గోషామహల్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఈ నియోజక వర్గంలో కాంగ్రెస్, బీజేపీలదే హవా. 2009లో జరిగిన తొలి ఎన్నికల్లో.. కాంగ్రెస్ అభ్యర్థి ముఖేష్ గౌడ్ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో.. వరుసగా బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ గెలుస్తూ వస్తున్నారు. అలాగే ఇప్పటివరకు ఎంఐఎం నేరుగా ఇక్కడి నుంచి పోటీ చేయలేదు. గోషామహల్ అంటే.. రాజాసింగ్ అడ్డా అనే పేరుంది. మరి రేపటి ఎన్నికల్లో గోషామహల్ ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడవలసి వుందని అంటున్నారు.
కాగా గోషామహల్ బీజేపీ టికెట్ రేసులో.. ఇద్దరు, ముగ్గురు కీలక నేతలున్నారు. వారిలో.. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్, భాగ్యనగర్ ఉత్సవ సమితి అధ్యక్షుడు భగవంత్ రావు, జీహెచ్ఎంసీలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న శంకర్ యాదవ్ కమలం పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఈ ముగ్గురిలో అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుందన్నది ఆసక్తిగా మారింది. వచ్చే ఎన్నికల్లో పార్టీ రాజాసింగ్‌ను ఎంపీగా పోటీ చేయిస్తుందని, దాంతో.. తమకే పోటీ చేసే అవకాశం వస్తుందని.. ఆశావహులు లెక్కలు వేస్తున్నారు.
అలాగే రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ గత రెండు ఎన్నికల్లో గోషామహల్ బరిలో నిలిచినా గెలవలేకపోయింది. దాంతో ఈసారి ఎలాగైనా గెలవాలనే కసితో ఉంది కేసీఆర్ పార్టీ. అయితే బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో నందకిశోర్ వ్యాస్, ఆశిష్ కుమార్ యాదవ్ , ముఖేష్ సింగ్, ఆనంద్ కుమార్ గౌడ్ ఉన్నారు. కాంగ్రెస్ విషయానికొస్తే.. గోషామహల్ నుంచి మెట్టు సాయికుమార్ పోటీ చేసే అవకాశం ఉంది. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఫ్యామిలీ బీజేపీలో చేరడం మెట్టు సాయికి కలిసొస్తుందనే టాక్ నియోజకవర్గంలో వినిపిస్తోంది. గోషామహల్‌లో గెలుపు జెండా ఎగరేసేందుకు.. ఏ పార్టీకి ఆ పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది.మరి ఓటరు దేవుడు ..ఎవరిని కరుణినిస్తారో చూడవలసిందే..అంటున్నారు.