వారం రోజుల నుండి భారత్ లోనే అత్యధిక రోజువారీ కరోనా కేసులు.. డబ్ల్యుహెచ్ఓ
posted on Aug 11, 2020 @ 9:45AM
కరోనా విషయంలో కొంత ఆందోళన.. కొంత ఊరట..
ప్రపంచంలో కరోనా కలకలం మొదలైనప్పటి నుండి ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తూ వస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా వైరస్‌ని తరిమికొట్టగలమనే ఆశలు కొత్తగా చిగురిస్తున్నాయని తన తాజా బ్రీఫింగ్ లో తెలిపింది. ఐతే ఇదే సమయంలో కరోనా ప్రపంచాన్ని వణికించే మహమ్మారిగా మారేందుకు ఎక్కువ సమయం పట్టలేదన్న విషయాన్ని అన్ని దేశాలూ గుర్తుంచుకోవాలని డబ్ల్యు హెచ్ ఓ తెలిపింది. మరీ ముఖ్యంగా భారత్ లో కరోనా కేసులు బాగా పెరిగిపోతుండటంపై WHO తాజాగా ఆందోళన వ్యక్తం చేసింది. గత వారం రోజులుగా అమెరికా, బ్రెజిల్‌లో కంటే ఇండియాలోనే రోజువారీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపింది. ఇక్కడ మరో సమస్యేంటంటే ఆ రెండు దేశాల్లో కరోనా ఇంకా తగ్గట్లేదు. ఇపుడు వాటికి తోడు ఇండియా కూడా వచ్చి చేరింది. దీని ఫలితంగా ప్రపంచంలో 2 కోట్లకు పైగా పాజిటివ్ కేసులు ఉంటే, కోటికి పైగా పాజిటివ్ కేసులు ఈ మూడు దేశాల్లోనే నమోదయ్యాయన్న సంగతి మనకు తెలిసిందే.
ఇదే సందర్భంలో కరోనాను అంతం చేయడానికి రాకెట్ సైన్స్ తరహా విధానంలో సాధ్యం కాదని డబ్ల్యుహెచ్ఓ తెలిపింది. ప్రజలు కంగారు పడటం ద్వారా కరోనా పోదనీ.. ఈ వైరస్ పూర్తిగా పోవడానికి ప్రజలు, ప్రపంచం లోని దేశాలూ క్రమశిక్షణతో మెలిగితే కచ్చితంగా కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలమని తెలిపింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న మందులు, పద్ధతుల ద్వారా కరోనా వైరస్‌కి ఊహించిన దాని కంటే బాగానే బ్రేక్ వేశామని వివరించింది.
మన దగ్గర కచ్చితమైన పవర్‌ఫుల్ వ్యాక్సిన్లు ఉన్న పోలియో, మీజిల్స్ (తట్టు) ను ఇప్పటికీ పూర్తిగా పోగొట్టేందుకు కష్టపడాల్సి వస్తోందని అయితే కరోనాకి సరైన వ్యాక్సిన్ రావడం ద్వారా పూర్తిగా వైరస్ పోతుందని అనుకోలేమని డబ్ల్యుహెచ్ఓ తెలిపింది.
కరోనాకు కనుక వ్యాక్సిన్ వస్తే దాని ద్వారా ఇతర కరోనా తరహా వైరస్‌లకూ చెక్ పెట్టగలమా అనే ప్రశ్నకు ప్రస్తుతానికి సరైన సమాధానం లేదని డబ్ల్యుహెచ్ఓ తెలిపింది. ఈ దిశగా పరిశోధనలు మాత్రం సాగుతున్నాయని వివరించింది. అంతే కాకుండా వాతావరణంలోని మార్పుల ద్వారా కరోనా వైరస్ పోదనీ, అది ఎండ, వాన, చలి ఇలా ఏ వాతావరణంలోనైనా ఈ వైరస్ బతుకుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.