ఏపీలో బీఆర్ఎస్ ఉన్నట్లా.. లేనట్లా?
posted on Jan 3, 2024 9:27AM
ఆంధ్రప్రదేశ్ లో భారత రాష్ట్ర సమితి ఏం చేస్తోంది? అసలు ఆ పార్టీ రాష్ట్ర శాఖ ఉన్నట్లా? లేనట్లా? గతంలో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేసి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి జాతీయ రాజకీయాలలోకి దూకేశారు. ఆ సమయంలో ఆయన బాగా దృష్టి పెట్టిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ముందు పీఠిన ఉంది. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ అధినేత జగన్ సహకారంతో రాష్ట్రంలో కొన్ని పార్లమెంటు స్థానాలను బీఆర్ఎస్ ఖాతాలో వేసుకోవచ్చన్న భావన గట్టిగా వ్యక్తమయ్యేది. అలాగే బీఆర్ఎస్ సహకారంతో మరోసారి ఏపీలో జగన్ ను అధికారంలోకి వచ్చేలా చేయొచ్చన్నదీ ఆయన వ్యూహంగా పరిశీలకులు అప్పట్లో పలు విశ్లేషణలు చేశారు.
అయితే అదంతా గతం.. కేసీఆర్ జాతీయ రాజకీయ ఆకాంక్షలకు పురిట్లోనే సంధి కొట్టినట్లుగా తెలంగాణలో పరాజయం ఎదురైంది. అయినా ఆయన దేశమంతా కాళ్లకు బలపాలు కట్టుకుని తిరిగినా దరి చేరిన వారు కానీ దగ్గరకు రానిచ్చిన వారు కానీ కనిపించలేదు. తెలంగాణలో పరాజయం పాలైన బీఆర్ఎస్ ఇప్పుడు జాతీయ స్థాయిలో తన సత్తా చాటడానికి ముందుకు వస్తుందా..? ఒక వేళ వచ్చినా ఎక్కడైనా కనీసం ఉనికి చాటుకోగలుగుతుందా అంటే అదీ అనుమానమే. ముఖ్యంగా ఏపీ రాజకీయాలలో బీఆర్ఎస్ పరిస్థితి పబ్బలో పుట్టి మఖలో మాడిపోయిన చందమేనని అంటున్నారు.
2019 ఏపీ ఎన్నికలలో పరోక్షంగా పాల్గొని జగన్ విజయానికి తన వంతు పాత్ర పోషించి టీడీపీ పార్టీకి, బాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు తమ పార్టీకి రేవంత్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ షాక్ లో ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో కేసీఆర్ తిరిగి ఏపీ రాజకీయాల వైపు దృష్టి పెడతారా అంటే అనుమానమే అంటున్నారు పరిశీలకులు. ఏపీలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసి తోట చంద్రశేఖర్ ను ఏపీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించిన కేసీఆర్ ఏపీ ఎన్నికల బరిలో దిగుతారా..? లేక గతం మాదిరే తమ తస్మదీయులకు పరోక్ష మద్దతు ఇస్తారా..? లేక తెలంగాణలో పార్టీ కోల్పోయిన పట్టును తిరిగి నిలబెట్టు కోవడానికి పక్క రాష్ట్రాల వైపు తమ కారు స్టీరింగ్ ను తిప్పకుండా గమ్మునుంటారో..? వేచి చూడాలి.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జాతీయ పార్టీ భారత రాష్ట్ర సమితి ఏపీలో అసలు ఉందా? ఆ పార్టీ రాష్ట్ర శాఖను ఘనంగా ఏర్పాటు చేసిన తరువాత ఏం జరిగింది? ఏం జరుగుతోంది? అంటే ఎవరి నుంచీ సరైన సమాధానం రావడం లేదు. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతానంటూ ఘనంగా బీఆర్ఎస్ పార్టీని ప్రారంభించిన కేసీఆర్ తెలంగాణలో కంటే ముందుగా ఏపీలోనే బీఆర్ఎస్ రాష్ట్ర శాఖను ప్రారంభించారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ హోర్డింగులతో హడావుడి చేశారు. ఇక ఆ పార్టీలో చేరికలకు ఏపీకి హైదరాబాద్ నుంచి వాహనాలు పంపి మరీ నాయకులను రప్పించుకున్నారు. దారి పొడవునా బీఆర్ఎస్ లోకి స్వాగతం అంటూ హోర్డింగులు, ఫ్లెక్సీలూ ఏర్పాటు చేశారు. ఏపీలో బీఆర్ఎస్ బహిరంగ సభలు నిర్వహిస్తుందనీ, కేసీఆర్ ఆ సభలలో పాల్గొంటారనీ పెద్ద ఎత్తున ప్రచారంతో ఊదరగొట్టేశారు. అంతే ఆ తరువాత ఏపీలో బీఆర్ఎస్ ను పట్టించుకున్న నాథుడే లేడు. ప్రచారార్భాటం వినా ఆ పార్టీ ఏపీ శాఖ చేసిందీ, పీకిందీ ఏమీ లేదు. ఇప్పుడు ఏపీలో బీఆర్ఎస్ ప్రతినిథి ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక్క ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ మాత్రమే. ఆయన కూడా ఉండేది హైదరాబాద్ లోనే. ఆయన వ్యాపారాలూ, భూములూ అక్కడే ఉండటంతో బీఆర్ఎస్ ముచ్చటగా మూడో సారి అధికారంలోకి వస్తుందన్న ఉద్దేశంతో మాత్రమే ఆయన బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
ఇప్పుడు తెలంగాణలోనే బీఆర్ఎస్ పరాజయం పాలు కావడంతో ఇక ఆయన పార్టీలో కొనసాగుతారని కానీ, కొనసాగినా క్రియాశీలంగా ఉంటారని కానీ ఎవరూ భావించడం లేదు. మొత్తంమీద బీఆర్ఎస్ పేరుకే జాతీయ పార్టీ కానీ ఉనికి మాత్రం తెలంగాణకే పరిమితమని , ఇప్పుడు ఆ తెలంగాణలోనే ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో ఉందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.