కేసేఆర్ ఢిల్లీ పర్యటన అసలు రహస్యం ఇదేనా?
posted on Oct 13, 2022 @ 10:34AM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. అయితే, ముందుగా అనుకుని ఆయన ఢిల్లీ వెళ్ళలేదు.ఇటీవల మరణించిన ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల్లో పాల్గొని అక్కడి నుంచి ముఖ్యమంత్రి ఢిల్లీ చేరుకున్నారు.
మంగళవారం (అక్టోబర్ 11) ఢిల్లీ చేరుకున్న వెంటనే భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాలయం కోసం దేశ రాజధాని ఢిల్లీలో అద్దెకు తీసుకున్న బంగళాను సీఎం కేసీఆర్ సందర్శించారు. సర్దార్ పటేల్ మార్గ్‌లోని 5వ నెంబరు బంగళాను బీఆర్‌ఎస్ కార్యాలయం కోసం తీసుకున్న విషయం తెలిసిందే. బుధవారం (అక్టోబర్ 12) వసంత విహార్ లో నిర్మాణంలో ఉన్న తెరాస భవన్ నిర్మాణ పనులను పరిశీలించారు. అయితే ముఖ్యమంత్రి ఢిల్లీలో ఆగింది ఇందుకేనా ఢిల్లీలో ఎన్నిరోజులు ఉంటారు అనేదానిపై ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారిక సమాచారం ఏదీ లేదని అంటున్నారు.
అయితే నాలుగైదు రోజులు ఢిల్లీలోనే ఉంటారని బీఆర్ఎస్ వర్గాల సమాచారం. అవసరం అయితే, ఇంకొన్ని రోజులు అక్కడే ఉన్నా ఉండవచ్చని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. అయితే, ముఖ్యమంత్రి ఢిల్లీలో ఏమి చేస్తున్నారు? అనుకోకుండా వెళ్లి అక్కడే ఎందుకు ఉండి పోతున్నారు అంటే పార్టీ వర్గాలు ఇది పూర్తిగా రాజకీయ పర్యటన అనే చెపుతున్నాయి. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన తరువాత తొలిసారి జాతీయ పార్టీ నేతగా ఢిల్లీలో ముఖ్యమంత్రి కాలు పెట్ట్టారు. జాతీయ పార్టీకి సంబందించిన వ్యహారాలపైనే దృష్టి పెడతారని అంటున్నారు. పలువురు రాజకీయ ప్రముఖులు,
మాజీ సివిల్ సర్వీస్ అధికారులు, జర్నలిస్టులు, వివిధ సంఘాల నేతలను కేసీఆర్ కలిసే అవకాశం ఉందని, అలాగే బీఆర్ఎస్ భవిష్యత్ వ్యూహరచన చేస్తారని అంటున్నారు. అయితే అది నిజమా అంటే నిజమే. కానీ, సంపూర్ణ సత్యం అయితే కాదు. అది అర్థ సత్యం మాత్రమే అనేది ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో అదే విధంగా హైదరాబాద్ తెలంగాణ భవన్ లో వినిపిస్తున్న మరో ముచ్చట. ముఖ్యమంత్రి వెంట ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ తో పాటుగా మరికొందరు ముఖ్య నేతలు కూడా ఉన్నారు. నిజానికి, గత కొంత కాలంగా కవిత, సంతోష్ ఇద్దరూ కూడా కేసీఆర్ గుడ్ లుక్స్ లో లేరు. ఆ ఇద్దరినీ ముఖ్యమంత్రి దూరంగా ఉంచుతున్నారని పార్టీ వర్గాల్లోనే కాదు బయట కూడా విపిస్తోంది.
తెరాస పేరును బీఆర్ఎస్ గా మార్చేందుకు దసరా పండగ పూట నిర్వహించిన పార్టీ పండగ కార్యక్రమంలో కవిత కనిపించలేదు. అలాగే మునుగోడు ఉప ఎన్నికల ప్రచార బృందంలో ముఖ్యమంత్రి మొదలు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరికీ బాధ్యతలు అప్పగించారు, కానీ, కవిత, సంతోష్ లకు మాత్రం ఏ బాధ్యతలు ఇవ్వలేదు. అలాంటిది ఇప్పుడు ఆ ఇద్దరినే, ప్రత్యేకంగా వెంట పెట్టుకుని ముఖ్యమంత్రి ఢిల్లీలో మకాం చేయడం సహజంగానే అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు.
అయితే దీని వెనక ఉన్న రహస్యం ఏమిటీ, అనే ప్రశ్నకు సమాధానం అయితే చిక్కడం లేదు. మరో వైపు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ, ఈడీ సంస్థలు దూకుడు పెంచాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో, ఎమీల్సీ కవిత వద్ద కొంత కాలం వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన, ఆమె వ్యాపార భాగస్వామి, బినామీగా అనుమానిస్తున్న అభిషేక్ రావు సిబిఐ అరెస్ట్ చసిన తరువాత, ముఖ్యమంత్రి ఢిల్లీలో మకాం చేయడం, అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. నిజానికి, ఢిల్లీ లిక్కర్ స్కాం లో అభిషేక్ రావు, వెన్నమనేని శ్రీనివాసరావు పేర్లతో పాటుగా కవిత పేరు కూడా ప్రముఖంగా విపిస్తున్న విషయం తెలిసిందే. లిక్కర్ పాలసీ కేసులో ఆమె ప్రమేయం ఉన్నట్లు బీజేపీ నేతలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయినా
ఈడీ అధికారులు అభిషేక్ రావు, వెన్నమనేని శ్రీనివాసరావును నివాసాలు, కార్యాలయాలలో సోదాలు చేశారు. ఆ ఇద్దరిని విచారించారు. అయినా ఇంతవరకు కవిత జోలికి మాత్రం రాలేదు, కానీ, ఇక ఆ ఇదరి అరెస్ట్ తర్వాత, వారి నుంచి సేకరించిన ఆధారాలతో కవితను విచారించే అవకాశం, ఉందని అందుకే కేసీఆర్ బిడ్డను కాపాడుకునేందుకు ‘పెద్ద’లను కలిసే పనిలో ఢిల్లీలో మకాం చేశారని అంటున్నారు. ప్రస్తుతం అభిషేక్ రావు సీబీఐ కస్టడీలో ఉన్నారు. మరో వంక మరికొన్ని రోజుల్లో తెలంగాణలో కీలక వ్యక్తుల్ని అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటన అనేక రకాల చర్చలకు దారి తీస్తోంది.