ఆర్ఎస్ఎస్ లోనూ మంచివాళ్లు.. మమత మాటల వెనుక మర్మమేంటి?
posted on Sep 2, 2022 @ 3:29PM
బీజేపీలో లుకలుకలు పెరుగుతున్నాయా? మోడీ, షా ద్వయం ఆధిపత్య ధోరణి పట్ల వ్యతిరేకత పెరుగుతోందా? ఆ వ్యతిరేకత ఒక్కసారిగా బట్టబయలు అయ్యేందుకు పిల్లి మెడలో గంట కట్టేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సిద్ధమయ్యారా? నితిన్ గడ్కరీ మోడీకి వ్యతిరేకంగా గళమెత్తితే ఆయనకు మద్దతుగా నిలిచేందుకు బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ సై అంటున్నాయా? వెనకుండి ఇంత కాలం బీజేపీకి మెంటార్ గా వ్యవహరించిన ఆర్ఎస్ఎస్ కూడా నితిన్ గడ్కరీకే మద్దతుగా నిలవడానికి సిద్ధంగా ఉందా? ఒక్క వ్యక్తి తెగించి ఒక అడుగు ముందుకు వేయడానికి సిద్ధపడితే.. ఆయనకు అండగా వెనుక నిలవడానికి ఇంత మందీ సిద్ధంగా ఉన్నారా? అన్న ప్రశ్నలకు రాజకీయ పరిశీలకులు ఔననే సమాధానమిస్తున్నారు.
బీజేపీని ఇతర మూస రాజకీయ పార్టీల నుంచి ఇంత కాలం ప్రత్యేకంగా నిలుపుతున్న విధానాలన్నిటికీ మోడీ తిలోదకాలిచ్చేశారనీ, గతంలో కాంగ్రెస్ ను ఏ విధానాలు అవలంబిస్తోందని విమర్శించారో, ఇప్పుడు మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అవే విధానాలను అవలంబిస్తోందన్న అభిప్రాయం ఇప్పుడు కమలం పార్టీలోనే వ్యక్తమౌతున్నది. అధికారం చాలు ఇంకే విలువలూ అక్కర్లేదన్న చందంగా కేంద్రంలోని మోడీ సర్కార్ వ్యవహరిస్తోందన్న భావన పార్టీలో వ్యక్తమౌతున్నది. దానినే గడ్కరీ ఇటీవల ఒక సమావేశంలో ఒకింత ఉద్వేగ పూరితంగా వ్యక్తం చేశారు.
అది మొదలు బీజేపీలో గడ్కరీ నేతృత్వంలో తిరుగుబావుటా ఎగురవేయడానికి రంగం సిద్ధమైందన్న చర్చ ప్రారంభమైంది. రోజు రోజుకూ ఆ చర్చ తీవ్ర తరమౌతున్నది. నాగపూర్ (ఆర్ఎస్ఎస్) తో సన్నిహిత సంబంధాలున్న గడ్కరీకే ఆర్ఎస్ఎస్ మద్దతు ఉంటుందన్న వాదన బలంగా తెరపైకి వచ్చింది. పార్టీలో మోజారిటీ సభ్యులు గడ్కరీకి మద్దతుగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నాయంటూ పలువురు వ్యాఖ్యానాలు చేశారు. గడ్కరీ రాజకీయమంటే అధికార దాహమేనా అంటూ వ్యాఖ్యనించిన అనంతరం ఆయనకు బీజేపీ పార్లమెంటరీ బోర్డులో స్థానం గల్లంతైంది. దీంతో గడ్కరీ పట్ల సర్వత్రా సానుభూతి వ్యక్తమైంది. రాజకీయాలలో విలువల గురించి మాట్లాడితే.. పక్కన పెట్టేస్తారా అన్న చర్చా మొదలైంది. బీజేపీలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా పార్లమెంటరీ బోర్డులో గడ్కరీ స్థానం కోల్పోవడంపై బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
మోడీ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదని పార్టీ వర్గాలే అంటున్నాయి. మోడీ, షా ద్వయం పార్టీలో ఎవరినీ సొంతంగా ఆలోచించడానికి కానీ, స్వతంత్రంగా పని చేయడానికి కానీ అవకాశం ఇవ్వడం లేదన్న అసంతృప్తి, అసమ్మతి పార్టీలో గూడు కట్టుకుని ఉన్నాయనీ, అయితే గడ్కరీకి పార్లమెంటరీ బోర్డులో స్థానం కల్పించకపోవడంతో కేబినెట్ లో స్వతంత్రంగా పని చేసే ఏకైక మంత్రిగా, మోడీ విధానాలలోని లోపలను ఎత్తి చూపగలిగే ధైర్యం ఉన్న నాయకుడిగా పేరొందిన ఒకే ఒక్కడినీ కూడా పొమ్మనకుండా పొగపెట్టేందుకు రంగం సిద్ధమైందని పార్టీ శ్రేణులకు సైతం అవగతమైంది.
గడ్కరీ పార్టీలో బలమైన నేతగా, అత్యధికులకు ఇష్టమైన నాయకుడిగా ఎదిగారు. 2019 ఎన్నికలకు ముందు ఎన్డీయే భాగస్వామ్య పార్టీలలో మోడీ నాయకత్వం పట్ల, ఆయన వ్యవహార శైలి పట్ల అసంతృప్తి బాగా వ్యక్తమైన సమయంలో మోడీకి ప్రత్యామ్నాయంగా ప్రధానిగా గడ్కరీ పేరు పరిశీలనలోకి వచ్చినట్లు కూడా చెబుతారు. పైగా నితిన్ గడ్కరీ నాగపూర్ తో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి. ఆర్ఎస్ఎస్ నుంచి ఎదిగిన నేత. నేటికీ స్వయం సేవక్ సంఘ్ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే వ్యక్తి. అటువంటి గడ్కరీకి పార్టీలో ప్రాధాన్యత తగ్గించేయడమంటే.. పార్టీకి సిద్ధాంత పునాదిని వేసిన ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని తిరస్కరించడమేగా పార్టీలోని పలువురు భావిస్తున్నారు.
పార్టీ, ప్రభుత్వం రెండూ మోడీ, షా ద్వయమే అన్నట్లగా పరిస్థితి మారిపోయింది. గతంలో కాంగ్రెస్ ను వ్యక్తిపూజ అంటే విమర్శలు గుప్పించిన బీజేపీలో ఇప్పుడు అదే పరిస్థితి ఉందని బీజేపీలోని ఒక వర్గం గట్టిగా చెబుతోంది. ఈ పరిస్థితుల్లో గడ్కరీకి పార్లమెంటరీ బోర్డు నుంచి ఉద్వాసన పలకడంతో పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగసి పడుతున్నాయి.
గడ్కరీ తన అసమ్మతిని, అసంతృప్తిని వ్యక్తం చేస్తే ఆయనతో గొంతు కలిపేందుకు పార్టీలో చాలా మంది సిద్ధంగా ఉన్నారని పరిశీలకులు అంటున్నారు. అంతే కాకుండా ఇప్పటికే ఖాళీ అయిపోయిన ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు కూడా గడ్కరీ నాయకత్వం కింద పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిస్తున్నాయని అంటున్నారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల తీరు పట్ల మోడీ షా ద్వయం వ్యవహార తీరును గతంలో పలుమార్లు గడ్కరీ తప్పుపట్టిన సంగతిని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా శివసేన విషయంలో మోడీ షా ద్వయం వ్యవహరించిన తీరును గడ్కరీ వ్యతిరేకించారని అంటున్నారు. రాజకీయాలంటే కేవలం అధికారం కోసం వెంపర్లాట మాత్రమే కాదని ఒకింత నిర్వేదంగా వ్యాఖ్యానించిన సంగతి కూడా తెలిసిందే.
ఎవరు ఔనన్నా కాదన్నా బీజేపీలో గడ్కరీ కీలక నేత. నంబర్ గేమ్ లో ఉండరు కానీ, ఆయనను కాదనే వారు కానీ కాదని అనగలిగే వారు కానీ ఎవరూ ఉండరు. ఎందుకంటే ఆయన ఆర్ఎస్ఎస్ కు అత్యంత ఆప్తుడు. నాగపూర్ ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ఆయనకు బోలెడంత పలుకుబడి కూడా ఉంది. గతంలో ఆర్ఎస్ఎస్ మోడీకి ప్రత్యామ్నాయం ఎవరు అన్న ప్రశ్నకు గడ్కరీ పేరే చెప్పింది.
ఈ రోజుకూ మోడీకి రీప్లేస్ మెంట్ ఎవరంటే ఎవరైనా గడ్కరీ పేరే చెబుతారు. అటువంటి గడ్కరీకీ పార్టీలో ప్రాధాన్యత లేకుండా చేయచడానికి మోడీ షా ద్వయం ప్రయత్నించడంపై పార్టీలోనే అసమ్మతి, అసంతృప్తి వ్యక్తమౌతున్నాయి. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న బీజేపీయేతర పార్టీలు కూడా గడ్కరీకి సానుభూతి వ్యక్తం చేస్తున్నాయి. మోడీ షాలకు వ్యతిరేకంగా ఆయన నిలబడితే మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు పంపుతున్నాయి. ఆర్ఎస్ఎస్ లో కూడా ఉత్తములు ఉన్నారనీ, అందరినీ రాక్షసులంటూ ఒకే గాటల కట్టేయడం సరి కాదనీ మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలే ఇందుకు సంకేతం. ఆమె పరోక్షంగా గడ్కరీకి మద్దతుగా మోడీషాకు వ్యతిరేకంగా బీజేపీలో తిరుగుబాటు అంటూ జరిగితే తాను గడ్కరీకి మద్దతుగా నిలుస్తానని చెప్పకనే చెప్పారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మమత వంటి కరుడుగట్టిన మోడీ వ్యతిరేకులకు గడ్కరీ నమ్మదగిన నేతగా కనిపిస్తున్నారు. నేడు మోడీ నాయకత్వంలో బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారం చేపట్టగలిగిందంటే అందుకు వాజ్ పేయి, అద్వానీ, దీనదయాళ్ ఉపాధ్యాయ వంటి మహనీయులు వేసిన పునాదులే కారణమని గడ్కరీ నిర్ద్వంద్వంగా చెప్పారు. అంతే కాదు ఆ సందర్బంగా గతంలో వాజ్ పేయి చేసిన చీకటి ఏదో ఒక రోజున తొలగిపోతుంది, సూర్యుడు బయటకు వస్తాడు, కమలం వికసిస్తుందన్న ప్రసంగాన్ని ఉటంకించారు. గడ్కరీ వ్యాఖ్యల వెనుక ప్రస్తుత పరిస్థితులు మారుతాయనీ త్వరలోనే మార్పు తప్పదనీ, ఆ మార్పు తన నాయకత్వంలోనే మొదలౌతుందన్న సంకేతం కూడా గడ్కరీ మాటల వెనుక ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు
రాత్రికి రాత్రి మహారాష్ట్రలో ప్రభుత్వం మారిపోవడం, నిన్నటి దాకా బీజేపీపై విమర్శలతో నిప్పులు చెరిగిన శివసేనలోని ఒక వర్గం బీజేపీతో జట్టు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని గడ్కరీ తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో రాష్ట్రాలలో ఆ ప్రభుత్వాలను కూలదోసైనా సరే అధికారం చేజిక్కించుకోవడానికి మోడీ, షా ద్వయం వేస్తున్నఎత్తులను, పన్నుతున్నవ్యూహాలను గడ్కరీ వ్యతిరేకిస్తున్నారనీ, మోడీ, షా ద్వయం తీరు పట్ల అసంతృప్తితో ఉన్నారని గడ్కరీ సన్నిహితులు అంటున్నారు. గడ్కరీ రాజకీయ వైరాగ్యం ప్రకటిస్తూ చేసిన వ్యాఖ్యల టార్గెట్ నిస్సందేహంగా మోడీ, షాలేనని అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో కూడా ఒక సారి గడ్కరీ.. నాయకుడనే వాడు విజయాలకే కాదు పరాజయాలకు కూడా బాధ్యత వహించాలని మోడీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు గడ్కరీ ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన వెంట నడవడానికి బీజేపీలోని ఒక బలమైన వర్గమే కాదు. గడ్కరీ మద్దతుగా నిలవడానికి పలు బీజేపీ యేతర పార్టీలూ సిద్ధంగా ఉన్నాయి. ఇందుకు మమతా బెనర్జీ వ్యాఖ్యలే ప్రబల నిదర్శనంగా చెప్పొచ్చు.
ఎన్డీయే భాగస్వామ్య పక్షాలన్నీ గడ్కరీ నాయకత్వాన్ని గట్టిగా కోరుకుంటున్నాయి. అలాగే ఇప్పటికే ఎన్డీయేను వీడి వెళ్లిన పార్టీలు కూడా గడ్కరీ నాయకత్వంలో పని చేయడానికి సుముఖంగా ఉన్నాయని అంటున్నారు. అలాగే మోడీని గట్టిగా వ్యతిరేకించే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా గడ్కరీకి మద్దతుగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు పంపారు. బీహార్ సీఎం నితీష్ కుమార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్.. ఇంకా చెప్పాలంటే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఇలా చాలా మంది ముఖ్యమంత్రులు గడ్కరీ నాయకత్వంలో బీజేపీలో కనుక చీలిక వస్తే గడ్కరీకి మద్దతుగా నిలిచేందుకు సదా సిద్ధమన్న సంకేతాలు పంపుతున్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే గడ్కరీ తన అసమ్మతి గళాన్ని మరింత గట్టిగా వినిపించే అవకాశాలున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తాజాగా మమతా బెనర్జీ ఆర్ఎస్ఎస్ లోనూ మించి వారున్నారంటూ చేసిన వ్యాఖ్యలు కచ్చితంగా గడ్కరీని ఉద్దేశించి చేసినవేనని పరిశీలకులు అంటున్నారు. ఇక గడ్కరీ అడుగు ముందుకు వేయడమే తరువాయి.. జాతీయ స్థాయిలో ఒక సరి కొత్త రాజకీయ సమీకరణకు తేరలేస్తుందని వారు గట్టిగా చెబుతున్నారు.