బీఆర్ఎస్ లో వుంటే భవిష్యత్ ఏంటి? ఆ పార్టీలో మిగిలేదెవరు?
posted on May 31, 2024 @ 5:09PM
ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆవిర్భవించింది టీఆర్ఎస్, 14ఏళ్ల పోరాటం అనంతరం ప్రత్యేక రాష్ట్రం సాధించింది. ఆ తర్వాత పదేళ్లపాటు కేసీఆర్‌కు ప్రజలు పట్టం కట్టారు. ఉద్యమకాలంలో దూకుడు, ఆ తర్వాత అధికారం దక్కడంతో అన్నీ అనుకున్నట్టు జరిగిపోయాయి. తెలంగాణను దున్నేశాం.. ఇక దేశాన్ని ఏలాల్సిన సమయం ఆసన్నమైంది అని కేసీఆర్ పార్టీ పేరును కూడా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్చేశారు. కానీ ఇప్పుడు పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. అయినా కేసీఆర్‌కు ఇంకా తత్త్వం బోధపడినట్లు లేదు. అధికారాన్ని కోల్పోయిన ఆరు మాసాల్లోపే ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు కారు దిగి ఇటు కాంగ్రెస్, అటు బీజేపీలో చేరిపోతున్నారు. 4వ తేదీ తరువాత ఎవరు ఉంటారో.. ఎవరు పోతారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. లోక్ సభ ఎన్నికల్లో ప్రజల స్పందన, తాజా పరిస్థితులు కేసీఆర్‌కు మింగుడుపడటం లేదు. ఏదో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ క్యాడర్‌ను కాపాడుకోవాలనుకుంటున్నారు.
పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ ను నమ్ముకొని ఉన్న వారిలో న్యాయం జరిగింది అతికొద్ది మందికే. అది కూడా కేసీఆర్, కేటీఆర్ కొటరీలో ఉన్న వారికే తప్ప, గ్రామీణ ప్రాంతాల నుంచి జిల్లా స్థాయి నేతలుగా ఎదిగిన వారెవరికీ కూడా బీఆర్ఎస్ అధినాయకత్వం తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసింది. 2001 నుంచి 2014 వరకు ఉద్యమ పార్టీగా కార్యకర్తలు కూడా రాష్ట్ర సాధనలో భాగస్వాములై పదవులను ఆశించకుండా పార్టీ కోసం, ఉద్యమం కోసం పని చేస్తూ వచ్చారు. చాలా మంది తమ ఆస్తులను కోల్పోయిన సందర్భాలూ ఉన్నాయి.
పార్టీ అధికారంలోకి రావడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారిపోయింది. అప్పటి వరకు తెరచాటున ఉన్న పెత్తందారులు, భూస్వాములు, అగ్రవర్ణాలకు చెందిన నేతలందరూ తెరపైకి వచ్చి జిల్లాల వారీగా చక్రం తిప్పడం మొదలుపెట్టారు. కేసీఆర్ బంధువులుగా చెప్పుకునే అనేక మంది కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, జగిత్యాల తదితర జిల్లాల్లో ఆడింది ఆటా.. పాడింది పాటగా సాగించుకున్నారు. పార్టీ కోసం ప్రాణాలు త్యాగం చేసే వరకు జీవితాలను ధారపోసిన నేతలెవరూ కూడా అధిష్టానం దృష్టికే పోలేదు. అందుకే వారంతా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడించారు. రోజురోజుకు బలహీన పడుతుండటంతో ఫలితాల వెల్లడి తర్వాత బీఆర్ఎస్ మరింత పట్టుకోల్పోవడం ఖాయం.
అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో ఇప్పుడా పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాభవం చవిచూసింది. ఇప్పడు పార్లమెంట్ ఎన్నికల్లోనూ కనీసం ఒక్క సీటునైనా గెలిచే హోప్స్ అయితే లేవు. దారుణమైన విషయం ఏమిటంటే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ ఎస్ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా ముందుకు రాని పరిస్థితి. ఎలాగోలా ఎన్నికలు ఎదుర్కొన్నా ఇప్పుడు ఆ పార్టీని ఓటమి భయమే ఎక్కువగా వెంటాడుతోంది. 4వ తేదీ ఫలితాల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాకపోతే ఆ పార్టీ భవిష్యత్ ఏంటనేది ఆ పార్టీ నేతలను వేధిస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత పలువురు నేతలు ఆ పార్టీకి దూరమయ్యారు. ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నట్టు సమాచారం. లోక్ సభ ఎన్నికలు ముగిసే దాకా పార్టీ ఫిరాయింపుల జోలికి వెళ్లకూడదని కాంగ్రెస్ భావించడంతో దానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇప్పుడు ఎన్నికలు ముగియడంతో బీఆర్ ఎస్ ఎమ్మెల్యేల్ని చేర్చుకోవడమే మిగిలింది. బీఆర్ఎస్‌కు, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయడమే ఇప్పుడు రేవంత్ ముందున్న లక్ష్యం.
బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు వెళ్లిపోతే, తామకుకూడా అదే బాట పట్టాలని సీనియర్ నేతలు భావిస్తున్నారు. అయితే ఇందులో కొందరు కాంగ్రెస్ లోకి, మరికొందరు బీజేపీలోకి వెళ్తారని టాక్ నడుస్తోంది. ఫలితాల తరువాత బీఆర్ఎస్ ఘోరా సంక్షోభాన్నే ఎందుర్కోబోతోంది.
- ఎం.కె. ఫజల్