ప్రయాణాల్లో చాలా ఇబ్బంది పెట్టే మలబద్దకం సమస్యకు చెక్ పెట్టండి ఇలా..!
కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, ఇరుగు పొరుగు, కొలీగ్స్.. ఇట్లా ఎవరితో అయినా ఎక్కడికైనా ప్రయాణాలు చేయాల్సి వస్తూనే ఉంటుంది. చాలా వరకు ఆఫీసు పనులు, వ్యక్తిగత పనుల మీద ఒంటరిగానే ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. నిజానికి ప్రయాణాలు అంటే అదొక స్పెషల్ మూమెంట్ అనిపిస్తుంది. కానీ చాలా మంది మాత్రం ప్రయాణంలో చెప్పుకోలేని అసౌకర్యం అనుభవిస్తుంటారు. అదే మలబద్దకం. ప్రయాణం కోసం అలా ఇంటి నుండి బయటపడగానే.. ఇటు మలబద్ధకం, ఉబ్బరం, తిమ్మిర్లు, అసౌకర్యం మొత్తం ప్రయాణాన్ని నాశనం చేస్తాయి. మరీ ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఈ సమస్య నరకాన్ని పరిచయం చేస్తుంది. అసలు ప్రయాణాలలో మలబద్దకం ఎందుకు వస్తుంది. ఈ సమస్యకు చెక్ పెట్టే చిట్కాలేంటి తెలుసుకుంటే..
ప్రయాణాల సమయంలో మలబద్దకం ఎందుకు వస్తుంది?
ప్రయాణాలు చేసేటప్పుడు దినచర్య మారడం, ఆహారపు అలవాట్లలో మార్పులు, నీరు తక్కువ తీసుకోవడం, ఎక్కువ సేపు కూర్చోవడం, నిద్రలేకపోవడం, టాయిలెట్ కు వెళ్లడానికి తగిన వెసులుబాటు లేకపోవడం మొదలైనవి మలబద్దకం రావడానికి కారణం అవుతాయని వైద్యులు చెబుతున్నారు. అందుకే ప్రయాణాల సమయంలో మలబద్దకం, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను చాలా మంది ఎదుర్కుంటారు. ముఖ్యంగా వృద్దులు, స్త్రీలు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు, ఏదైనా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వ్యక్తులకు ప్రయాణ సమయంలో మలబద్దకం సమస్య ఎక్కువగా ఉంటుంది.
ప్రయాణాలలో మలబద్దకానికి చెక్ పెట్టే చిట్కాలు..
ప్రయాణాలలో మలబద్దకానికి చెక్ పెట్టాలంటే ప్రయాణాలలో ఫైబర్ మెరుగ్గా ఉన్న ఆహారం తీసుకోవాలి. మరీ ముఖ్యంగా ప్రయాణాలలో హోటల్ ఆహారాన్ని నిషేధించాలి. ప్రయాణాలలో ఆహారం వల్ల ఏదైనా ఇబ్బంది అనిపిస్తే పండ్లను తినడం మంచిది. పండ్లలో ఫైబర్ ఉంటుంది, నీటి శాతం కూడా ఉంటుంది. ఇది జీర్ణాశయానికి సహాయపడుతుంది.
ప్రయాణాలలో ఆకలి వేయకపోయినా స్నాక్స్ తినే అలవాటు కొందరికి ఉంటుంది. బిస్కెట్లు, సమోసాలు వంటివి తినడం వల్ల మలబద్దకం వస్తుంది. అందుకే వీటిని నివారించాలి. ఆకలిగా అనిపిస్తే బాదం, కాజు వంటి శక్తిని ఇచ్చే నట్స్ తీసుకోవాలి.
ప్రయాణాలలో చాలామంది నీరు తక్కువగా తాగుతారు. కానీ ప్రయాణాలలో తప్పనిసరిగా 8గ్లాసుల నీరు తాగేలా చూసుకోవాలి.
దూర ప్రయాణాలు చేసేవారు ఎక్కువసేపు అలాగే కూర్చోకుండా అటు ఇటు తిరగడం, ఏవైనా స్టాప్ లు వచ్చినప్పుడు కిందకు దిగి మళ్లీ ఎక్కడం వంటివి చేయవచ్చు.
ప్రయాణాలలో తప్పనిసరిగా బయటి ఆహారం తినాల్సి వస్తే ప్రోబయోటిక్స్ మెరుగ్గా ఉన్న ఆహారం తీసుకోవాలి. దోశ, ఇడ్లీ, మజ్జిగ, పెరుగన్నం వంటివి మలబద్దకం రాకుండా చేస్తాయి. అలాగే ప్రయాణంలో పాలు పోక ఊరికే కాఫీలు, టీలు తాగడం మానేయాలి.
ప్రయాణాలలో మలబద్దకం సమస్యను ఎదుర్కునేవారు దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మరీ ముఖ్యంగా ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఇలా సమస్య ఎదుర్కునేవారు వైద్యుడిని సంప్రదించి వారి సలహా మేరకు మందులు వాడటం మంచిది.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...