విత్త మంత్రిగారూ.. బొమ్మల కొలువుపై మోడీని అడిగారా?
posted on Sep 6, 2022 @ 2:28PM
కేంద్ర పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రాలు కచ్చితంగా మోడీ ఫొటోను పెట్టాల్సిందే అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు రాజకీయ హీట్ ను పెంచేశాయి. గతంలో యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఫోటోలను రేషన్ షాపుల్లో ఉంచాయా అని తెలంగాణ మంత్రులు నిలదీస్తున్నారు.
ఒకరి తరువాత ఒకరుగా నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలను ఖండిస్తూ ముప్పేట దాడి చేస్తున్నారు. విమర్శలు చేసేయడం ఆ తరువాత నాలుక కరుచుకుని మౌనం దాల్చడం కేంద్రానికి ఒక అలవాటుగా మారిపోయిందని విమర్శలు గుప్పిస్తున్నారు. వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి, రైతుల ఆగ్రహ జ్వాలలకు తలవంచి ఉపసంహరించుకున్న సమయంలో మోడీ రైతులకు క్షమాపణ చెప్పిన విషయాన్ని వారీసందర్బంగా గుర్తు చేస్తున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తెలంగాణ పర్యటన సందర్భంగా రేషన్ షాపుల్లో ప్రధాని మోడీ ఫొటోపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని లేపుతున్నాయి.
తెలంగాణ మంత్రులందరూ కేంద్ర విత్త మంత్రి అసంబద్ధ వ్యాఖ్యలు చేశారని మండిపడుతూ ఆమెపై విమర్శల దాడి చేస్తున్నారు. తెలంగాణ మంత్రి హరీశ్‌రావు అయితే నిర్మలా సీతారామన్ కు మోడీ బొమ్మల కొలువు కావాలంటే ముందు ప్రధాని మోడీ గుజరాత్ సీఎంగా ఏం చేశారో తెలుసుకోవాలని హితవు పలికారు. నరేంద్రమోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో ఆ రాష్ట్రంలోని రేషన్ షాపుల్లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఫొటో పెట్టారా? తెలుసుకుని ఆ తరువాత తెలంగాణలోని రేషన్ దుకాణాల్లో మోడీ ఫొటో గురించి అడగాలని సూచించారు. కేంద్రం సమాఖ్య సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందంటూ దుయ్యబట్టారు. రాష్ట్రానికి వచ్చి మూడు ఆరోపణలు, ఆరు అబద్ధాలతో రాజకీయం చేద్దామంటే నడవదని హెచ్చరించారు. ప్రజలు టీఆర్‌ఎస్‌పై, సీఎం కేసీఆర్ పాలనపై, ప్రభుత్వ పథకాలపై పూర్తి స్పష్టతతో ఉన్నారన్నారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతున్నదని, ఈ విషయంలో తెలంగాణ సమాజానికి పూర్తిగా తెలుసుననీ, కేంద్ర విత్తమంత్రి పచ్చి అబద్ధాలు చెబుతున్నారనీ విమర్శించారు. విభజన హామీలు అమలు చేయకపోవడం, తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన రూ.7,103 కోట్లు ఇవ్వకపోవడం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు విడుదల చేయకపోవడం, ఐటీఐఆర్, నిమ్స్ రద్దు, మెడికల్ కాలేజీలు, నవోదయ విద్యాలయాలు మంజూరు చేయకపోవడం వంటివి వివక్ష కాదా? అని ప్రశ్నించారు.
వీధి రౌడీల్లా రేషన్ షాపుల వద్ద గలాటా చేయడం కాదనీ, దమ్ముంటూ అంశాల వారీగా చర్చకు రావాలనీ సవాల్ చేశారు. పథకాల్లో కేంద్ర నిధులను వినియోగిస్తే మోదీ ఫొటో పెట్టాల్సిందేనని నిర్మలా సీతారామన్ మాట్లాడటం చెప్పేటందుకే బీజేపీకి నీతులు గుర్తుకువస్తాయన్నట్లుగా ఉందన్నారు. యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని రేషన్ షాపుల్లో ఆయన ఫొటో పెట్టారా? అని నిలదీశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వాలున్న రాష్ట్రాలపై ఇలాంటి ఒత్తిడి తేవడం కేంద్రం ఆధిపత్య ధోరణికి నిదర్శనమన్నారు. మోదీ హయాంలో అనేక కేంద్ర ప్రాయోజిత పథకాలను రద్దు చేశారు. ఉన్న పథకాల్లో కేంద్రం నిధుల వాటా తగ్గించి, రాష్ట్రాల వాటా పెంచారు. ఇందులో కొన్ని పథకాల లక్ష్యాలు ఆయా రాష్ట్రాల ప్రయోజనాలకు తగినట్టు లేనేలేవు. అనవసరమైన పథకాలు అమలు చేస్తూ, రాష్ట్రాల వాటా పెంచి భారం మోపడం వినా కేంద్రం రాష్ట్రాలకు చేసిన మేలు ఏమీ లేదని హరీష్ రావు అన్నారు.
పనికి ఆహార పథకం వంటి మంచి పథకాలకూ కొర్రీలు పెట్టి, నిధులు తగ్గించి కొత్త నిబంధనలు పెడుతూ నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ఎఫ్‌ఆర్బీఎం చట్టాన్ని పునఃసమీక్షించాలన్న 15వ ఆర్థిక సంఘం సిఫారసు గురించి మీడియా ప్రశ్నిస్తే కేంద్ర మంత్రి నిర్మల సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారం రుణాలను నియంత్రించే హకు కేంద్రానికి ఉన్నదని మీరు అంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం పరిధి దాటి ఎలా అప్పులు చేస్తున్నదని ప్రశ్నించారు. కేంద్రానికి రాజ్యాంగం ఏమైనా ప్రత్యేకమైన అధికారాలు ఇచ్చిందా? అని నిలదీశారు. కార్పొరేట్లకు చెందిన లక్షల కోట్ల రుణాలను ఎవరి ఆమోదంతో రద్దు చేశారో దేశ ప్రజలకు కేంద్రం, మోడీ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇక కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నిర్మలా సీతారామన్ చెప్పినవన్నీ అబద్ధాలేనని హరీష్ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ తయారు చేయలేదని చెప్పడాన్ని తప్పుపట్టిన హరీష్ రావు డీపీఆర్ సమర్పించకుండానే కేంద్ర జల సంఘం అనుమతులు ఇచ్చిందా? అని ప్రశ్నించారు.