కరోనాతో సీఎం సోదరుడు మృతి
posted on May 15, 2021 @ 3:28PM
దేశంలో ప్రస్తుతం కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. పల్లె, పట్నం తేడా లేకుండా అంతా వైరస్ భారీన పడుతున్నారు. పేదలు, దనవంతులు అన్న తేడా లేకుండా కరోనా కాటుకు బలవుతున్నారు. సామాన్యులతో పాటు వీవీఐపీ కుటుంబాలకు మహమ్మారి సోకుతోంది. తాజాగా కరోనాతో ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరుడు కన్నుమూశారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తమ్ముడు అషిమ్ బెనర్జీ కరోనా కారణంగా మృతి చెందారు. కరోనా సోకడంతో కొన్ని రోజులుగా అషిమ్ బెనర్జీ కోల్ కతా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమించి శనివారం ఉదయం చనిపోయారు.
పశ్చిమ బెంగాల్ లో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. కేసులు పెరిగిపోతుండటంతో మమతా సర్కార్ కఠిన అంక్షలు విధించింది. అయినా పరిస్థితి దారిలోకి రాకపోవడంతో సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించింది మమతా బెనర్జీ సర్కార్. బెంగాల్ లో మే16 ఆదివారం నుంచి మే 31వరకు రెండు వారాలపాటు లాక్‌డౌన్ ప్రకటించింది. ఈ కాలంలో అన్ని కార్యాలయాలు, విద్యాసంస్థలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. కోల్‌కతా మెట్రో సహా రవాణా వ్యవస్థను కూడా మూసివేసింది. అత్యవసర సేవలకు మాత్రం అనుమతి ఇచ్చింది.
కిరాణా దుకాణాలతోపాటు అత్యవసర వినియోగ వస్తువులు విక్రయించే దుకాణాలు ఉదయం ఏడు గంటల నుంచి 10 గంటల వరకు తెరిచిపెట్టుకోవచ్చని బెంగాల్ ముఖ్య కార్యదర్శి అలపన్ బందోపాధ్యాయ్ తెలిపారు. ఆశ్చర్యకరంగా మిఠాయి దుకాణాలకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనుమతి ఇచ్చింది. పెట్రోలు పంపులు, బ్యాంకులు కూడా తెరిచే ఉంటాయి. ఇవి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే.
పరిశ్రమలకు అనుమతి ఇవ్వని ప్రభుత్వం తేయాకు తోటల్లో 50 శాతం సిబ్బందితో పనిచేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. సాంస్కృతిక, రాజకీయ, విద్యాపరమైన, మతపరమైన కార్యక్రమాలకు అనుమతి నిరాకరించింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడడాన్ని నిషేధించింది. వివాహ కార్యక్రమాలకు 50 మందికి మించి అనుమతి లేదని బందోపాధ్యాయ్ తెలిపారు.