ఉద్యమిస్తున్న రైతాంగానికి వినూత్న స్వాగతం
posted on Sep 14, 2022 @ 1:32PM
అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ రెండో రోజు రైతు పాదయాత్ర మంగళగిరి నుంచి దుగ్గిరాల వరకు కొనసాగింది. రైతులు, వృద్దులు అందరూ పాదయాత్రకు ఘనస్వాగతం పలి కారు. రాజధాని అభివృద్ధి జరగకుండా నిర్వీర్యం కావడానికి కారణమైన సీఎం జగన్ ఆలోచనలవల్లే ఇవాళ మహా పాదయాత్ర చేయాల్సి వచ్చిందని అన్నారు. దుగ్గిరాలమండలం రేవేంద్రపాడులో రైతుల కు వినూత్నంగా స్వాగతం పలికారు. కృష్ణా కెనాల్‌లో బోట్ల ద్వారా ఆహ్వానం పలికారు. వారికి స్వాగతం పలికేందుకు బోట్లపై ఫ్లెక్సీలు, బెలూన్లు ప్రదర్శించారు
ముందుగా మంగళగిరి లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన రైతులు.. మూడు రాజ ధా నుల విషయంలో ప్రభుత్వం మనసు మార్చుకోవాలని వేడుకున్నారు. రాష్ట్రంలో నియంత పాలన నడుస్తోందని విమర్శించారు. న్యాయమూర్తులే ఏపీ రాష్ట్రానికి దేవుళ్లా కనబడుతున్నారని జేఏసీ నేతలు పేర్కొన్నారు. ఆ తర్వాత మంగళగిరి ప్రధాన రహదారి గుండా ఆత్మకూరు వరకు వెళ్లి పెదవడ్లపూడి వరకు సాగింది. పెదవడ్లపూడి గ్రామం దాటిన తర్వాత రైతులు భోజన విరామం తీసుకుని మధ్యాహ్నం అక్కడి నుంచి పాదయాత్ర కొనసాగించారు..
పాదయాత్ర చేస్తున్న రైతులకు గ్రామస్తులు పండ్లు, మజ్జిగ అందజేశారు. ఆటపాటలు, డప్పులు, నృత్యా ల నడుమ రేవేంద్రపాడు తుమ్మలపూడి, చిలువూరు, మంచికలపూడి మీదుగా దుగ్గిరకు చేరుకుంది. పాదయాత్ర చేస్తున్న రైతులకు ఆయా గ్రామాల్లో రైతులు సంఘీభావం తెలిపారు. అమరావతి నుంచి ప్రారంభమైన ఈ మహాపాదయాత్ర అరసవెల్లి వరకు కొనసాగనుంది. మరోవైపు ఈ పాదయాత్రపై వైసీపీ నేతలు, మంత్రులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది ఉత్తరాంధ్రపై దండయాత్రగా అభివర్ణించారు.