Read more!

నీటిబొట్టుకు కొత్త గొంతు!!


ప్రయాణాలు చేస్తూ ఉంటాం. అంతా హైవే రహదారి, ఎక్కడా హోటళ్లు ఉండవు, చిన్న బడ్డీ కొట్టు కూడా కనిపించదు. ఒకవైపు దాహం పట్టిపీడుస్తూ ఉంటుంది. వెంట తెచ్చుకున్న బాటల్ లో నీళ్లు కూడా అయిపోయి ఉంటాయి. నోరంతా పిడచకట్టుకుని పోతూ ఉంటుంది. శరీరం క్రమంగా తేమను కోల్పోయి స్వాధీనం తప్పేంత డైలమాలో పడిపోతుంది. ఏదో చెయ్యాలని అనుకుంటాం. ఎవరైనా మనకు ఎదురైతే బాగుండు, కాసిన్ని నీళ్లిచ్చి దాహం తీరిస్తే బాగుండు అనుకుంటాం. కానీ అలా జరగదు, ఒక్కసారిగా దుఃఖం పొంగుకొస్తుంది. ఇంట్లో ఉంటే గనుక ఇలాంటి నరకం ఉండేది కాదు కదా అనిపిస్తుంది. 


చాలామందికి పైన అనుభవం జీవితంలో ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సందర్భంలో(ప్రయాణాలు అనే కాదు వేరే ఏదైనా సందర్భం కావచ్చు) ఎదురయ్యి తీరుతుంది. కొందరు పైన చెప్పుకున్నవరకే తమ ఆలోచనలు సాగిస్తారు. మరికొందరు దాంతోపాటు ఇంకొంచెం ముందుకు సాగుతారు.


బాత్రూమ్లోనూ, బట్టలు ఉతకడం లోనూ, ఇంటి పనులలోనూ, బయటకు వెళ్లినప్పుడూ, అతిశుభ్రత పేరుతోనూ ఎన్నెన్ని నీళ్లను కాలువలపాలు చేసామా అని కొందరు పశ్చాత్తాపపడతారు. బాత్రూమ్లో దూకే కుళాయి నీళ్లు కూడా అత్యంత విలువైనవిగా అనిపిస్తాయి అప్పుడు. 


ఇది ఒకమనిషి ఆవేదన అయితే గ్రామాలు, మండలాలు, జిల్లాలు అందులో నివసించే వేలు, లక్షల ప్రజానీకం ఏళ్లకేళ్ళుగా నీటి తళతళలు తమ నేలల మీద కనబడక ఎంతెంత ఆవేదన చెందుతూ ఉండి ఉండాలి. మినరల్ వాటర్ సృష్టించి వాటర్ వార్ లకు కారణమైన వ్యాపార సామ్రాజ్యాలు కూడా ఉన్న నేటి అభివృద్ధి ప్రపంచంలో  కనీస అవసరాల కోసం నీటి సరఫరా లేని జనావాస ప్రాంతాలు ఉన్నాయంటే ఆశ్చర్యం వేస్తుంది. గంధపుచెక్కల చెట్లు సమృద్ధిగా ఉన్నవాడికి ఆ గందపుచెట్టు పెద్ద విలువైనదిగా ఎట్లా అనిపించదో, అలాగే అన్ని సౌకర్యాల మధ్యా కుళాయి తిప్పి నీటిని వాడేసేవాళ్లకు దాహం గొంతుల ఆవేదన అర్థం కాదని అనిపిస్తుంది.


కానీ…..


ప్రపంచంలో, ముఖ్యంగా భారతదేశంలో నీటి ఆవరణా ప్రాంతాల శాతం, అడవుల విస్తరణ శాతం తగ్గిపోతూ ప్రజల అవాస ప్రాంతాలు అభివృద్ధిలో భాగంగా పెరిగిపోతుంటే కరువు ప్రాంతాల శాతం పెరుగుతూ వస్తోంది. చెట్ల నరికివేత విచ్చలవిడిగా జరుగుతూ ఉండటం వల్ల ప్రతి నీటి బొట్టూ ప్రశ్నార్థకంగానే మారుతోంది. మనుషులను మినహాయిస్తే మూగజీవుల ఆవేదన వర్ణించని విధంగా మారిపోతోంది.


వృక్షో రక్షతి రక్షితః!!


చెట్టును మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది అన్నట్టు, భూగర్భజలాలు పెరగాలి అంటే చెట్లు నాటడమే సరైన మార్గమని అందరికీ తెలుసు. కానీ నష్టం మనవరకు రాలేదులే అనే దారుణమైన నిర్లక్ష్యపు ఆలోచనల వల్ల ఎంతో స్వార్థం వల్ల మనుషులు తగిన మూల్యం చెల్లించుకునే దిశగా నడుస్తున్నారు. వాటి ఫలితాలే అసందర్బపు ప్రళయాలు. 


మరోవైపు!!


శరీర ఆరోగ్యానికి నీరు ఎంత అవసరమో అందరికీ తెలిసినదే. కానీ చాలామంది నీటిని సరిపడినంత తాగకపోవడం వల్ల శరీరంలో తేమశాతం తక్కువై కిడ్నీ సమస్యలు మొదలుకుని శరీరాన్ని ఇబ్బంది పెట్టే ఎన్నో అనారోగ్యాలు చుట్టుముడతాయి. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కారణం బయటకు వెళ్లే మహిళలు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, దారి మధ్యలోనూ, పనుల మధ్యలోనూ మూత్రవిసర్జనకు దారిదొరక్క మగవాళ్ళలాగా రోడ్డుపక్కన కానిచ్చేయలేక మూత్రాన్ని బిగించడం లేదా, నీళ్లు సరిగ్గా తాగకపోవడం వల్ల చాలా తొందరగా కిడ్నీలు పాడైపోతూ ఉంటాయి. 


శరీరానికి ఇంధనమైన నీటిని మనం తగుతున్నంత బాద్యతగానే నీటి సంరక్షణ చర్యలు కూడా చేపట్టాలి. భూగర్భజలాలు పెరగడానికి ఉత్తమమార్గం అయిన చెట్ల పెంపకాన్ని కూడా బాధ్యతగా చేపట్టాలి. ఇంటి అవసరాలలో నీటిని ఎంతో పొదుపుగా వాడుకోవాలి. సామాన్లు కడిగిన, బట్టలు ఉతికిన నీటిని సింకుల్లో, కాలువల్లో తోసేయకుండా వాటిని మొక్కలకు, చెట్లకు మళ్లించాలి. అన్నిటికీ మించి పిల్లలకు నీటి విలువ తెలియజెప్పాలి.  శరీరానికి నీరు ఎంత అవసరమో చెబుతూనే, నీటిని వృధా చేయడం ఎంత తప్పో చెప్పాలి. మనం చేతయాల్సింది అంత చేస్తే, ప్రకృతి నీటి గొంతును వినిపిస్తుంది.
                                                                                   

◆వెంకటేష్ పువ్వాడ.