వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యేకు గట్టి షాక్ ఇచ్చిన జనం...
posted on Feb 18, 2021 @ 1:51PM
ఎన్నికల ప్రచారం అంటే ఎవరైనా ఓటర్లను బతిమాలో.. బామాలో గెలిచే ప్రయత్నం చేస్తారు. ఇక పంచాయతీ ఎలక్షన్లలో అయితే ప్రతి ఓటు కీలకం కాబట్టి నాయకులూ మరింత జాగ్రత్తగా వొళ్ళు దగ్గరబెట్టుకుని మరీ ఓటర్లను ఓటు వేడుకుంటారు. కానీ ఏపీలో వైసిపి నేతలు మాత్రం ఓటర్లను భయపెట్టి మరీ గెలవాలనే స్ట్రేటజీ ఫాలో అయిపోతున్నారు..అంతేకాకుండా తమ పార్టీకి ఓటు వేయకపోతే సంక్షేమ పధకాలు కట్ చేస్తామంటూ జనాన్ని భయపెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ఇది ఇలా ఉండగా పెడన వైసిపి ఎమ్మెల్యే జోగి రమేష్ మరో అడుగు ముందుకేసి కృత్తివెన్ను మండలానికి చెందిన నీలిపూడి గ్రామంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓటర్లకు, ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులకు తీవ్ర హెచ్చరికలు జరీ చేసారు. తమ పార్టీ బలపరిచే అభ్యర్థులకు వ్యతిరేకంగా వార్డ్ మెంబర్ పదవికి, పంచాయతీ ప్రెసిడెంట్ పదవికి పోటీ పడే అభ్యర్థుల కుటుంబాలకు సంక్షేమ పథకాలు కట్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడిన వీడియో బయటకు రావడంతో ఎస్ఈసీ ఆయనపై ఆంక్షలు విధించారు.
అయితే జోగి రమేష్ హైకోర్టుకెళ్ళి స్టే తెచ్చుకున్నారు. మూడో విడత ఎన్నికలలో ఆయనకు ప్రజాకోర్టులో షాక్ తప్పలేదు. జోగి రమేష్ ప్రజలను హెచ్చరించిన నీలిపూడి గ్రామంలో అయన బెదిరింపులు ఏమాత్రం పనిచేయలేదు. ఆ గ్రామంలోని 10కి 10 వార్డులు జనసేన మద్దతుదారులు గెలుచుకున్నారు. అంతేకాకుండా సర్పంచ్ స్థానాన్ని కూడా ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థే కైవసం చేసుకున్నారు. ఎమ్మెల్యే చేసిన తీవ్ర వ్యాఖ్యల కారణంగా అయన ప్రచారం చేసిన గ్రామంలోనే ఇలా జరగడంతో స్థానిక వైసీపీ నేతలకు షాక్ తగిలినట్లైంది. నీలిపూడి గ్రామంలో మొత్తం 1,408 ఓట్లు ఉండగా.. అందులో వెయ్యికి పైగా ఓట్లు జనసేన బలపరిచిన అభ్యర్థి పాశం కృష్ణకు పోల్ కాగా.. . కేవలం 270 ఓట్ల వైసీపీ మద్దతుదారులకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
మరోపక్క పెడన నియోజకవర్గంలో జనసేన మద్దతదారులు ఇప్పటివరకు 11 పంచాయతీలను గెలుచుకున్నారు. జనసేన ఖాతాలో పడిన వాటిలో కంకటావ, ములపర్రు, కాకర్లమూడి, చోడవరం, బల్లిపర్రు, నీలిపూడి, ఉరిమి, నేలకొండపల్లి, కోమలపూడి, ఆకులమన్నాడు, ముల్లపర గ్రామాలున్నాయి.