ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
posted on Apr 2, 2020 @ 1:56PM
కడప జిల్లా ఒంటిమిట్టలో ప్రసిద్ద శ్రీ కోదండ రామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలల్లో భాగంగా మొదటి రోజు రాత్రి అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు. కరోనా నియంత్రణలో భాగంగా ఏకాంతంగా బుధవారం రాత్రి అంకురార్పణ కార్యక్రమం టీటీడీ అధికారులు నిర్వహించారు.
చంద్రుని వెలుగుల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలను ఇక్కడ నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత. దీని వెనుక ఒక పురాణగాథవుంది. క్షీరసాగర మథనం తరువాత మహాలక్ష్మీదేవి అమ్మవారిని నారాయణుడు తన సతీమణిగా స్వీకరించాడు. పగలు జరిగే స్వామివారి వివాహాన్ని తాను చూడలేకపోతున్నానని ఆమె సోదరుడు చంద్రుడు స్వామివారికి విన్నవించగా ఒంటిమిట్టలో వెన్నెల వెలుగుల్లో తన కల్యాణాన్ని వీక్షించవచ్చని వరమిచ్చాడు. దాని ప్రకారమే రాత్రిళ్లు ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ప్రతి యేటా శ్రీరామనవమి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు.
అంకురార్పణ తో పుట్టమన్ను సేకరణ తో ఈ వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఈ కార్యక్రమంను ఆలయ ప్రాంగణంలో వేదపండితులు, టీటీడీ అధికారులు మంగళ వాయిద్యాల నడుమ వేడుకగా నిర్వహించారు. కాగా గురువారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ధ్వజారోహణం కార్యక్రమం తో బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించనున్నారు.
ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 8.30 గంటల వరకు, సాయంత్రం 6నుంచి 6.30 లోపు ఏకాంతగా పూజలు జరుపనున్నారు. ఏడవ తేదీ సాయంత్రం స్వామి వారి కళ్యాణం వేడుకగా నిర్వహించనున్నారు. ఈ పది రోజుల పాటు ఆలయం లోపల వాహన సేవలు,కల్యాణం భక్తులకు ప్రవేశం లేకుండా కేవలం టీటీడీ అధికారులు, అర్చకులు, మంగళ వాయిద్యాల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.