ఎవరి చిత్తశుద్ధి ఎంతో తేలిపోయింది..
posted on Feb 18, 2021 @ 11:48AM
తెలిసిపోయింది. తేలిపోయింది. విశాఖ ఉక్కు పరిశ్రమపై సీఎం జగన్ కు ఉన్న చిత్తశుద్ధి ఎంతో తెలిసిపోయింది. ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో ముఖ్యమంత్రికి ఉన్న ఆసక్తి ఎంతో తేలిపోయింది. విశాఖ విమానాశ్రయంలో కార్మిక సంఘ నేతలతో జగన్ చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వ విధానంలో మరింత క్లారిటీ వచ్చింది.
విశాఖ ఉక్కుపై ఏపీకి అధికారం లేదు. అది కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఖాళీ భూములను లేఅవుట్లు వేసి అమ్మితే బాగా డబ్బులు వస్తాయి. వాటితో కర్మాగారం కష్టాలు తీరిపోతాయి. ఇవీ జగన్ నోటి నుంచి వచ్చిన మాటలు. ఈ స్టేట్స్ మెంట్స్ పరిశీలిస్తే జగన్ దేనికి అనుకూలమో ఇట్టే తెలిసిపోతుంది. సీఎం చేసిన ఈ వ్యాఖ్యలతో కార్మికుల్లో తీవ్ర నిరుత్సాహం ఆవహించిందని చెబుతున్నారు. విశాఖ ఉక్కుపై మనకు అధికారం లేదని చేతులెత్తేసినట్టు మాట్లాడారని అంటున్నారు. భూములు అమ్మితే డబ్బులొస్తాయనడాన్నీ కార్మికులు తప్పుబడుతున్నారు.
అయితే.. అదే సమావేశంలో జగన్ కొన్ని నష్ట నివారణ వ్యాఖ్యలు సైతం చేశారు. ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు సాధ్యమైనంత వరకు సహకరిస్తాం. అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తాం. అఖిలపక్షం నాయకులతో పాటు వైసీపీ ఎంపీలు కూడా ఢిల్లీ వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తెస్తారు. ఇప్పటికే మోదీకి లేఖ రాశా. సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నా. ఇదీ కార్మికులకు జగన్ ఇచ్చిన భరోసా. ఇప్పటికే ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేయాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు గట్టిగా డిమాండ్ చేశారు. జగన్ సైతం ఇప్పుడు అందుకు అంగీకరించారు. ఇది మినహా మిగతా చర్యలేమీ స్ట్రాంగ్ గా లేవని విపక్షాలు అంటున్నాయి.
గతంలో పోస్కో ప్రతినిధులతో భేటీపైనా జగన్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. పోస్కో బృందం తనను కలిసిన మాట వాస్తవమేనని అంగీకరించారు. కడపలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుచేయాలని కోరితే.. కృష్ణపట్నం, భావనపాడులను పరిశీలిస్తున్నారని చెప్పారు.
ఒక రోజు వ్యవధిలో అటు ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఇటు ముఖ్యమంత్రి జగన్ లు చేసిన పర్యటనలను పోల్చి చూస్తున్నారు. వారాల తరబడి ఉద్యమంతో విశాఖ ఉడికిపోతోంది. కార్మికులు, స్థానికుల పోరాటానికి మద్దతుగా చంద్రబాబు విశాఖ తరలివచ్చారు. సీఎం జగన్ మాత్రం విశాఖలో ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నా వారి కోసం రాలేదు. శారదా పీఠం కార్యక్రమం కోసం వచ్చారు. ఎలాగూ వచ్చారు కాబట్టి కార్మికులతో మాట్లాడారు. అది కూడా విమానాశ్రయంలో...
ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థలో కేంద్రాన్ని దిగొచ్చేలా చేయాలంటే రాజీనామాలే బ్రహ్మాస్త్రం. అందుకే, విశాఖ ఉక్కు కోసం తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలంతా రాజీనామాలకు రెడీ అని చంద్రబాబు ప్రకటించారు. వైసీపీ ఎంపీలనూ రాజీనామా చేయాలన్నారు. అయితే, జగన్ నోట రాజీనామాల అంశమే రాలేదు. కేంద్రంపై ఒత్తిడి పెంచాటానికి రాజీనామాలను మించిన అస్త్రం ఇంకేముంటుంది? మరి జగన్ ఆ ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఉక్కు ఉద్యమానికి జగన్ నే నాయకత్వ వహించాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. భేషజాలు లేకుండా ఆయనకు మద్దతుగా నిలుస్తామని సంచలన స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. విశాఖ పర్యటనలో చంద్రబాబు చేసిన ఈ కామెంట్ తో వైసీపీ ఖంగుతింది. బాబు ఇచ్చిన ఈ ఆఫర్ పై జగన్ నుంచి నో రియాక్షన్. ఉక్కు ఉద్యమాన్ని ముందుండి నడిపించడానికి ముఖ్యమంత్రి పెద్దగా ఆసక్తి చూపిస్తున్నట్టు లేదంటున్నారు విపక్ష నేతలు. ఒక్క అఖిలపక్షం వరకూ ఓకే అన్నట్టు సిగ్నల్ ఇచ్చారు జగన్.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటంలో టీడీపీ దూసుకుపోతుంటే వైసీపీలో ఆందోళన మొదలైంది. సీఎం జగన్ పర్యటన తర్వాత మరింత డ్యామేజ్ జరిగింది. అదే సమయంలో ఉక్కు కోసమంటూ ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్రకు సిద్ధమై నష్ట నివారణ చర్యలు చేపడుతున్నారు. ఆయన చేసే పాదయాత్ర ఉక్కు కోసమో.. గ్రేటర్ ఎలక్షన్ల కోసమో అందరికీ తెలిసిందేనని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. చంద్రబాబు, జగన్ పర్యటనల్లో బాబుకే అధిక మైలేజ్ రావడంతో అధికార పార్టీ మరింత ఇబ్బందుల్లో పడింది. ఉక్కు ఉద్యమ సెగ.. జీవీఎంసీ ఎలక్షన్లలో వైసీపీకి దిమ్మ తిరిగేలా చేస్తుందని అంటున్నారు.