మన్యంలో మైనింగ్ మాఫియా.. మంత్రి మేనల్లుడి కనుసన్నల్లో!!
posted on Jun 10, 2020 @ 3:46PM
విశాఖ మన్యంలో మైనింగ్ మాఫియా అలజడి మళ్లీ మొదలైంది. ఖనిజ సంపద తరలింపునకు రంగం సిద్ధమవుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మన్యంలో లేటరైట్, బాక్సైట్ వంటి ఖనిజాలు దాగున్నాయి. అయితే, వాటి కోసం పచ్చటి అడవిని గుల్ల చేయొద్దని గిరిజనులు ఎప్పటికప్పుడు ఉద్యమిస్తూనే ఉన్నారు. గతంలో వారి విన్నపాల మేరకు ఆగిన తవ్వకాల అలజడి.. ఇప్పుడు మళ్లీ మొదలైంది. దీనికి ఒక ప్రముఖ మంత్రి మేనల్లుడు చక్రం తిప్పుతున్నారని తెలుస్తోంది. ప్రభుత్వ అండదండలు పుష్కలంగా ఉన్న ఆయన కనుసన్నల్లోనే ఖనిజం తవ్వకాలకు ఒప్పందాలు కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది. ఆదివాసీల వ్యతిరేకతతో గత ప్రభుత్వ హయాంలో మూతబడిన చాపరాతిపాలెం, సిరిపురం క్వారీలను తిరిగి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. లాక్‌డౌన్‌కు ముందే ఈ క్వారీల్లో నమూనాల కోసం తవ్వకాలు కూడా నిర్వహించారు.
విశాఖ ఏజెన్సీలోని గూడెంకొత్తవీధి, చింతపల్లి మండలాల్లో విలువైన ఖనిజ సంపద ఉంది. 1990-92 ప్రాంతంలో జర్రెల అటవీ ప్రాంతంలోని కోండ్రుపల్లితో పాటు అరకులోయ, తూర్పుగోదావరి సరిహద్దుల్లో కేంద్ర భూగర్భ గనుల శాఖ అధికారులు మట్టి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించారు. ఇక్కడ 615.27 టన్నుల విలువైన బాక్సైట్ గనులు ఉన్నాయని గుర్తించారు. అదే సమయంలో అల్యూమినియం శాతం అధికంగా ఉన్న బాక్సైట్ తరహా గనులను లేటరైట్ పరిధిలోకి తీసుకొచ్చి తవ్వకాలు సాగించేందుకు ఓ మాఫియా తీవ్రంగా ప్రయత్నించింది. 1997-99 ప్రాంతంలో సిరిపురం, చాపరాతిపాలెంలో బాక్సైట్ తరహా లేటరైట్ గనుల తవ్వకాలకు అనుమతులు పొందేందుకు పావులు కదపడం ప్రారంభించారు. ప్రభుత్వం స్థానిక ఆదివాసీలకు పంపిణీ చేసిన డీ-ఫాం పట్టాభూములను లేటరైట్ తవ్వకాల కోసం చినరాజుపాకలు గ్రామానికి చెందిన గిరిజనుడు దోనె పోతురాజు పేరిట హైదరాబాద్‌కు చెందిన ఓ మైనింగ్ వ్యాపారి అనుమతులు పొందారు. దోనె పోతురాజు పేరు మీద 2001 అక్టోబరు 14నుంచి 2021 అక్టోబరు 13వరకు 4.270 హెక్టార్ల డీ-ఫాం పట్టాభూముల్లో లేటరైట్ గనుల తవ్వకాలు నిర్వహించుకునేందుకు భూగర్భ గనుల శాఖ అనుమతులు మంజూరు చేసింది. అలాగే వలసంపేట గ్రామానికి చెందిన గిరిజనుడు పొత్తూరు దేముడు పేరిట చాపరాతిపాలెంలో గల 11.610 హెక్టార్ల భూమిలో లేటరైట్ గనుల తవ్వకాలకు విజయవాడ ప్రాంతానికి చెందిన బినామీ మైనింగ్ వ్యాపారి లైసెన్స్ తీసుకున్నారు. ఆయనకు 2004 జనవరి 13నుంచి 2024 జనవరి 12వరకు భూగర్భ, గనులశాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ క్వారీల్లో మైనింగ్ వ్యాపారులు విడతల వారీగా 60 శాతంకి పైగా తవ్వకాలు నిర్వహించి అల్యూమినియం కంపెనీలకు విక్రయించుకుని రూ.కోట్లు సంపాదించారు. 2016-17లో ఈ క్వారీల్లో తవ్వకాలు నిర్వహించొద్దని డిమాండ్ చేస్తూ గిరిజనులు ఆందోళనలు ఉధృతం చేశారు. వారితో పాటు స్థానిక ప్రజాప్రతినిధుల అభ్యర్థన మేరకు అప్పటి సీఎం చంద్రబాబు తవ్వకాలను నిలిపివేయించారు.
అయితే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన ప్రాంతంలో ఉన్న బాక్సైట్‌ను పోలిన లేటరైట్‌ను వెలికితీసేందుకు మరో ముఠా ప్రయత్నాలు మొదలెట్టింది. మూతబడిన చాపరాతిపాలెం, సిరిపురం క్వారీల్లో తవ్వకాలు పునఃప్రారంభించేందుకు సిద్ధమైంది. క్వారీల లీజుదారులైన దోనె పోతురాజు, పొత్తూరు దేముడు వెనుకున్న బినామీ వ్యాపారులను ఒప్పించి ప్రభుత్వ అండతో తాజాగా తవ్వకాలకు ఓ ముఠా ఏర్పాట్లు చేసుకుందని తెలుస్తోంది. రాష్ర్టానికి చెందిన ఒక ప్రముఖ మంత్రి మేనల్లుడి కనుసన్నల్లో లేటరైట్ తవ్వకాలకు ఒప్పందాలు కుదిరినట్టు సమాచారం. ఈ రెండు క్వారీల్లో తవ్వకాలు సాగించి వెలికితీసిన లేటరైట్‌ను ఒకచోటకు చేర్చి మిక్సింగ్ చేసి మంత్రి మేనల్లుడికి అప్పగించనున్నారని.. దాన్ని ఆయన ప్రభుత్వ అండదండలతో పొరుగు రాష్ట్రాల్లోని సిమెంట్, అల్యూమినియం కంపెనీలకు విక్రయించేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారని ప్రచారం జరుగుతోంది.