చంద్రబాబు బిగ్ స్కెచ్.. కదులుతున్న తాడేపల్లి ప్యాలెస్ పునాదులు!?
posted on Mar 7, 2024 @ 11:45AM
ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఐదేళ్లుగా కక్షపూరిత రాజకీయాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ మోహన్ రెడ్డిని గద్దెదింపేందుకు అన్నివర్గాలు ఏకమవుతున్నాయి. జగన్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతోపాటు, తెలుగుదేశం, జనసేన కూటమిగా ఏర్పడటంతో వైసీపీ ఇప్పటికే గెలుపు ఆశలను వదిలేసుకుంది. అయితే రాష్ట్రంలో రోజు రోజుకూ వైసీపీ గ్రాఫ్ దిగజారిపోతున్నదన్న సంకేతాలు బలంగా వస్తుండటంతో ఓటమి ఎంత ఘోరంగా ఉండబోతోందో అన్న ఆందోళనకు వైసీపీ నేతలు గురౌతున్నారు.
తాజాగా మాజీ మంత్రి, జగన్ కు సొంత బాబాయ్ అయిన దివంగత వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులు కూడా వైసీపీకి వ్యతిరేకంగా ప్రత్యక్ష రాజకీయాలలోకి రావడానికి నిర్ణయం తీసుకోవడంతో వైసీపీ నేతలు , ముఖ్యంగా జగన్ కు కాళ్ల కింద భూమి కదిలిపోతున్నట్లు బెంబేలెత్తిపోతున్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి ఎదురు గాలి వీస్తుండటంతో ఆ పార్టీని వీడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జగన్ కక్షపూరిత రాజకీయాల కారణంగా అన్నివైపుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న క్రమంలో.. ఆయన సొంత జిల్లా అయిన ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీ కోటకు కూడా బీటలు వారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. జగన్ కక్షపూరిత రాజకీయాలకు చరమగీతంపాడేందుకు ఆయన కుటుంబ సభ్యులు సైతం రంగంలోకి దిగబోతున్నారు.
గత ఎన్నికల సమయంలో మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బాబాయ్ హత్యను చంద్రబాబుపై నెట్టేసిన జగన్.. గత ఎన్నికల్లో సానుభూతితో విజయం సాధించారు. అయితే అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఆ కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా తన అధికారాన్నంతా వినియోగించి మరీ అడ్డుకున్నారు. అయితే వివేకా హత్యకు కారకులు జగన్ కు దగ్గరి వ్యక్తులేనని ఇంత వరకూ జరిగిన దర్యాప్తులో సందేహాలకు అతీతంగా తేలడంతో వైసీపీ శ్రేణులు సైతం షాక్ కు గురయ్యారు. ఎంపీ సీటుకోసమే అవినాశ్ రెడ్డి తన తండ్రిని హత్యచేశారని, ఆయనకు సీఎం జగన్ మోహన్ రెడ్డి అండదండలు పుష్కలంగా ఉన్నాయని వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేస్తూన్నారు. వివేకా హత్య లో దోషులకు శిక్షపడేలా కోర్టుల్లో తన వాదనలు వినిపిస్తూనే.. మరోవైపు జగన్ ప్రభుత్వంపైనా సునీతారెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ బలం, అధికార బలంతో ఈ కేసు ముందుకుసాగకుండా, దోషులకు శిక్షపడకుండా అడ్డుకుంటూ వస్తున్నారు. రాజకీయంగా బలం లేకపోవటం వల్లనే తన తండ్రి హత్యకేసులో నిందితులకు శిక్షపడేలా చేయలేక పోతున్నానని సునీతా, ఆమె కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల బరిలో నిలిచేందుకు వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులు సన్నద్ధమవుతున్నారు.
వివేకా హత్య కేసులో నిందితులకు శిక్షపడేలా చేయాలంటే రాజకీయ అండదండలుకూడా అవసరమని భావిస్తున్న వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యులు.. కడప లోక్ సభ స్థానం నుంచి వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. వివేకానంద కుమార్తె సునీతారెడ్డి లేదా ఆయన భార్య సౌభాగ్యమ్మ బరిలో నిలుస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ ఎన్నికల బరిలోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నారని సమాచారం. తొలుత ఇండిపెండెంట్ గా పోటీచేయాలని వారు భావించినా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల సూచనల మేరకు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే ఏపీలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమె తెలుగుదేశం అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీకి దిగబోతున్నారని సమాచారం. ఈ మేరకు ఇప్పటికే చంద్రబాబు, పవన్ కల్యాణ్ ను సౌభాగ్యమ్మకు ఈ విషయంలో పూర్తి సహకారం అందించేందుకు సిద్ధమని స్పష్టత ఇచ్చారని కూడా అంటున్నారు. అయితే సౌభాగ్యమ్య కడప లోక్ సభ అభ్యర్థిగా బరిలోకి దిగుతారన్న సమాచరంతో వైసీపీ పెద్దలు వణికిపోతున్నారని వైసీపీ వర్గాల్లోనే విస్తృత చర్చ జరుగుతోంది.
జగన్ సొంత జిల్లా అయిన ఉమ్మడి కడప జిల్లాలోనూ వైసీపీకి ఎదురుగాలి వీస్తోంది. ముఖ్యంగా వివేకానంద హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి జగన్ అండ ఉందని జనం నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో వివేకా కుటుంబ సభ్యులు కడప పార్లమెంట్ నుంచి బరిలో నిలిస్తే వారి విజయం నల్లేరు మీద బండినడకే అవుతుందని పరిశీలకుల విశ్లేషిస్తున్నారు. దీంతో వివేకానందరెడ్డి భార్య కడప ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఆమె ఇండిపెండెంట్ గా లేదా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేయాలని తొలుత భావించారు. కానీ, జగన్ అధికార బలంతో, బెదిరింపులకు పాల్పడి ఓటర్లను తమవైపు తిప్పుకుంటారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జగన్ అధికార బలాన్ని సమర్ధవంతంగా తిప్పికొట్టాలంటే ఒక్క తెలుగుదేశంతోనే సాధ్యమవుతుందని వివేకా కుటుంబ సభ్యులు భావిస్తున్నారట. ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కూటమిగా పనిచేస్తున్నాయి. నేడో రేపో బీజేపీకూడా ఈ కూటమితో కలిసే అవకాశం ఉంది. ఈ మూడు పార్టీల మద్దతుతో కడప లోక్ సభ స్థానం నుంచి వివేకానందరెడ్డి భార్య పోటీచేస్తే విజయం నల్లేరుపై నడకే అవుతుందని వైసీపీ వర్గాలు కూడా చెబుతున్నాయి. చంద్రబాబు, పవన్ కల్యాణ్ సైతం అందుకు సముఖంగా ఉండటంతో వచ్చే ఎన్నికల్లో వివేకానంద సతీమణి కడప పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగడం దాదాపు ఖాయమైందన్నచర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. వివేకా కుటుంబం తాజా నిర్ణయంతో తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదిలిపోవడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.