తాకట్టులో విశాఖ నగరం!
posted on Jul 26, 2024 @ 3:17PM
మాజీ ముఖ్యమంత్రి చెప్పేదొకటి చేసేదొకటి అనడానికి విశాఖ నగరమే ఒక ఉదాహరణ. రాజధాని రాజధాని అంటూ జగన్ విశాఖపట్నాన్ని తాకట్టు పెట్టేసి కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఔను మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా పేర్కొంటూ ఐదేళ్లు గడిపేశారు. మూడు రాజధానులు అంటూ అమరావతిని నిర్వీర్యం చేయడం వినా ఆయన చేసిందేమీ లేదు. అయినా విశాఖ రాజధాని అంటూ ఉత్తరాంధ్రప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపడానికి శతథా ప్రయత్నించారు.అయినా ఐదేళ్లలో ఆ దిశగా ఒక్కటంటే ఒక్క ఇటుక కూడా పేర్చిన పాపాన పోలేదు.
విశాఖ రాజధాని అంటూ రుషికొండకు గుండు కొట్టేసి.. వందల కోట్ల రూపాయలతో విలాసవంతమైన భవనాలను ప్రభుత్వ సొమ్ముతో సొంతానికి నిర్మించుకున్నారు. సరే ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత విశాఖ రాజధాని పేరిట జగన్ పాల్పడిన ఆర్థిక అరాచకత్వం వెలుగులోకి వస్తోంది.
అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం (జులై 26) విడుదల చేసిన శ్వేత పత్రంలో రాజధాని అంటూ కబుర్లు చెబుతూ నగరంలోని ఆస్తులను తాకట్టు పెట్టేసి 1,941 కోట్ల రూపాయలు రుణాలను దండుకొన్నట్లు వెలుగులోకి వచ్చింది. గతంలో ఎప్పుడు తరిమెల నాగిరెడ్డి తాకట్టులో భారత దేశం అనే పుస్తకం రాశారు. ఇప్పుడు జగన్ విశాఖ నగరాన్నే తాకట్టు పెట్టేశారు.
విశాఖ నగరంలో పలు ప్రభుత్వ ఆస్తులను జగన్ అప్పుల కోసం తాకట్టు పెట్టేశారు. అలా తాకట్టు పెట్టిన వాటిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజి, పోలీసు క్వార్టర్లు, ట్రెయినింగ్ అండ్ ప్రొడక్షన్ సెంటర్ ఫర్ డిసెబుల్ వెల్ఫేర్, ఈఈ బంగ్లా, ఆర్ అండ్ బీ క్వార్టర్లు, రైతు బజార్, సర్క్యూట్ హౌస్, పీడ్బ్ల్యూడీ కార్యాలయం సీతమ్మధార తహసిల్దార్ కా ర్యాలయంవంటివి ఉన్నాయి. ఇవన్నీ నగరం నడిబొడ్డులో ఉన్నాయి. చివరాఖరికి రైతు బజారును కూడా జగన్ సర్కార్ తాకట్టు పెట్టేసింది.
రాజధాని విశాఖ అని జగన్ ఎంతగా నమ్మబలికినా విశాఖ జనం విశ్వసించలేదు. అందుకే ఇటీవలి ఎన్నికలలో విశాఖలో జగన్ పార్టీ ఒక్కటంటే ఒక్కస్థానం కూడా గెలుచుకోలేకపోయింది. విశాఖ నగర పరిధిలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ ఆ పార్టీ అభ్యర్థులు ఘోర పరాజయం పాలయ్యారు. విశాఖ పార్లమెంటు స్థానాన్ని కూడా వైసీపీ భారీ తేడాతో చేజార్చుకుంది.