పాతబస్తీలో ఆంక్షల సడలింపు
posted on Nov 17, 2012 @ 1:36PM
హైదరాబాద్ పాతబస్తీలో సాధారణ పరిస్థితులను నెలకొల్పడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చార్మినార్ దగ్గర తాత్కాలికంగా ఆంక్షల్ని సడలించారు. వాహనాల రాకపోకల్ని అనుమతిస్తున్నారు. శాలిబండ, చార్మినార్ దగ్గర బ్యారికేడ్లను తొలగించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని చెబుతూనే భారీగా అదనపు బలగాలను మోహరించారు. బస్తీల్లో నిఘా కెమెరాలు, పికెట్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
శుక్రవారంనాటి అల్లర్లకు బాధ్యులైన 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో శనివారం వ్యాపార సంస్థలు తెరిచే విషయంపై పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ చెప్పారు. భాగ్యలక్ష్మీ ఆలయంలో పూజలు యథావిధిగా జరుగుతున్నాయి. భక్తుల్ని అనుమతిస్తున్నారు.
శుక్రవారంనాడు మక్కా మసీదు వద్ద ప్రార్థనల అనంతరం అల్లరి మూకలు చెలరేగిపోయాయి. ప్రార్థనల అనంతరం పలువురు ఆందోళనకారులు పోలీసులమీద, మీడియా ప్రతినిధులమీద రాళ్లు రువ్వారు. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. అల్లరిమూకలు ఎంతకూ తగ్గక పోవడంతో పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. ఆందోళకారులు మీడియాకు, పోలీసులకు చెందిన వాహనాల్ని ధ్వంసం చేశారు.
పాతబస్తీ అల్లర్లకు సంబంధించి వదంతుల్ని నమ్మొద్దని సమాచార శాఖ కమిషనర్ చంద్రవదన్ విజ్ఞప్తి చేశారు. పాతబస్తీ ప్రశాంతంగానే ఉందని చెప్పారు. ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని, పరిస్థితి అదుపులోనే ఉందని విజ్ఞప్తి చేశారు. పాతబస్తీలో శాంతి భద్రతల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని సిపి అనురాగ్ శర్మ తెలిపారు. 144వ సెక్షన్ మాత్రం కొనసాగుతోంది.