విజయసాయి మళ్లీ మెదలెట్టేశారు!
posted on May 24, 2024 @ 2:52PM
విజయసాయి.. సామాజిక మాధ్యమంలో ప్రత్యర్థులపై విషం కక్కుతూ, అనుచిత భాషలో పోస్టులు పెట్టడంలో సిద్ధహస్తుడు. విజయసాయి తాజా ఎన్నికలలో తొలి సారిగా పోటీ చేశారు. ఆయన మూడేళ్లకు పైగా విశాఖ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పని చేశారు. అక్కడ నుంచి పోటీ చేయాలని ఆశించారు. అయితే తానోటి తలిస్తే.. పార్టీ అధినేత మరోటి తలిచి చివరి క్షణంలో ఆయనను నెల్లూరు లోక్ సభ సరిధిలో దింపారు. అయిష్టంగానే అక్కడ నుంచి పోటీకి దిగిన విజయసాయి ఎన్నికలు ముగిసిన మరుక్షణం నుంచీ ఎవరికీ కనిపించకుండా, వినిపించకుండా అజ్ణాతంలోకి వెళ్లిపోయారు.
వాస్తవానికి నెల్లూరు విజయసాయి స్వస్థలమే అయినా అక్కడ ఆయనకు ఎటువంటి ఆదరణా లభించలేదు. ప్రచారం సందర్భంగానే ఫలితమేమిటో స్వయంగా విజయసాయికే అర్ధమైపోయింది. అందుకు తగ్గట్టుగానే ఏ సర్వే కూడా అక్కడ విజయసాయి విజయం సాధిస్తారని పేర్కొనలేదు. ఆయన ఓటమిని ప్రచార సమయంలోనే సర్వేలు, పార్టీ శ్రేణుల స్పందనే ఖరారు చేసేసింది. స్వయంగా విజయసాయి కూడా అందుకు మానసికంగా సిద్ధమైపోయారు. అందుకే మే 13న పోలింగ్ జరిగితే.. నాటి నుంచి ఇప్పటి వరకూ ఆయన ఎక్కడా పెదవి విప్పిన దాఖలాలు లేవు. అయితే ఆ మౌనం నుంచి తాజాగా విజయసాయి బయటకు వచ్చారు. సోషల్ మీడియా వేదికగా తనకు మాత్రమే సాధ్యమైన లాజిక్ తో చంద్రబాబుపై సెటైర్లు వేస్తూ ఓ పోస్టు పెట్టారు.
తాను చెప్పిందే వేదం, తానకు తెలిసిందే తర్కం అన్నట్లుగా ఉన్నాయి విజయసాయి తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు. ఇంతకీ ఆ పోస్టులో విజయసాయి ఏమన్నారంటే.. గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి కేవలం 23 అసెంబ్లీ స్థానాలు వచ్చాయనీ, అందుకు కారణం ఆయన తమ పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను లాక్కోవడమేనని వివరణ ఇచ్చారు. ఈ సారి నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరారు కనుక ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కేవలం నాలుగు అసెంబ్లీ స్థానాలలోనే విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చారు.
ఇదేం లాజిక్కో ఆయనకే అర్ధం కావాలి. పోనీ ఆయన లాజిక్ ప్రకారమే చూసుకున్నా.. వైసీపీ ముగ్గురు తెలుగుదేశం ఎమ్మెల్యేలను లాక్కొన్నది. కనుక ఈ సారి ఎన్నికలలో ఆ పార్టీ కేవలం మూడు అసెంబ్లీ స్థానాలకే పరిమితం అవుతుంది. ఇదీ లాజిక్కే కదా? మరి ఆ విషయం విజయసాయికి ఎందుకు తట్టలేదో? విషయమేమిటంటే లాజిక్కైనా, న్యాయసూత్రాలైనా తమకు అనుకూలంగానే ఉంటాయనీ, ఉండాలని విజయసాయి భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అలా ఉండవని తెలిసే రోజు దగ్గర్లోనే ఉందని చెప్పడానికి జూన్ 4వ తేదీ ఎంతో దూరంలో లేదు.