‘బూమ్‌బూమ్’ వాసుదేవరెడ్డి జంప్!
posted on Jul 25, 2024 @ 12:37PM
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌బీసీఎల్) మాజీ మేనేజింగ్ డైరెక్టర్, ఐఆర్‌టీఎస్ ఆఫీసర్ డి.వాసుదేవరెడ్డి గత నెలన్నర రోజులుగా పరారీలో వున్నారు. విజయవాడలోని ఏపీఎస్‌బీసీఎల్ కార్యాలయం నుంచి ఫైళ్ళు, కంప్యూటర్ హార్డ్ డిస్కులు, ఇతర కీలక పత్రాలను మాయం చేశారన్న ఫిర్యాదు మీద ఆధారాల ధ్వంసం, చోరీ, నేరపూరిత కుట్ర అభియోగాలతో జూన్ 6వ తేదీన వాసుదేవరెడ్డి మీద సీఐడీ కేసు నమోదు చేసింది. ఆ వెంటనే వాసుదేవరెడ్డి పరారయ్యారు. సీఐడీ హైదరాబాద్‌లోని వాసుదేవరెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించింది. కీలక ఆధారాలు స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి వాసుదేవరెడ్డి కోసం సీఐడీ గాలిస్తోంది. ఆయన దేశం వదిలి పారిపోకుండా వుండటం కోసం లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసింది. వాసుదేవరెడ్డి అజ్ఞాతంలో వుంటూనే, తన లాయర్ల ద్వారా హైకోర్టును ఆశ్రయించి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దాదాపు నెలన్నర రోజులుగా వాసుదేవరెడ్డి ఎవరికీ కనిపించకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. ఆయన్ని త్వరగా అరెస్టు చేసి మద్యం కుంభకోణంలో దర్యాప్తును ముందుకు తీసుకెళ్ళాలని సీఐడీ భావిస్తోంది.