జనసేన అభ్యర్థిగా వంగవీటి రాధా.. నియోజకవర్గం ఏదంటే?
posted on Mar 20, 2024 @ 11:19AM
వంగవీటి రాధా కృష్ణ ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. దివంగత వంగవీటి రంగా కుమారుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకు ఒక ప్రత్యేక ముద్ర, గుర్తింపు ఉంది. తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో వంగవీటి ఇంటి పేరుకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వంగవీటి రంగా హత్య తరువాత ఆ కుటుంబ ప్రాధాన్యత రాజకీయాలలో కీలకంగా మారింది. ఇక విషయానికి వస్తే వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా పాతికేళ్ల పిన్న వయస్సులోనే (2004 ) ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికైయ్యారు. విజయవాడ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. ఆయనకు అభిమానుల సంఖ్య కూడా చాలా చాలా ఎక్కువే. వంగవీటి రంగా రాజకీయ వారసుడిగా ఆయన నిత్యం తన అనుచరులకు, అభిమానులకు అందుబాటులో ఉంటారన్న గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇటీవలి కాలంలో ఆయన ఉద్దేశపూర్వకంగా రాజకీయాలకు కొంత దూరంగా ఉంటున్నారు. తెలుగుదేశం అధిష్ఠానం ఆయనను ఎన్నికలలో పోటీ చేయాలని కోరినప్పటికీ పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో ఆయన వైసీపీ గూటికి చేరుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కూడా. ప్రజలిచ్చిన ఒక్క చాన్స్ ని పూర్తిగా దుర్వినియోగం చేసుకున్న వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్.. ఎలాగైనా మరో సారి అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో ఉన్న జగన్ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గాన్ని పెద్ద ఎత్తున ప్రభావితం చేయగల వంగవీటి రాధాను వైసీపీలోకి రావాల్సిందిగా కోరారు.
ఇందు కోసం ఆయన వంగవీటి రాధాకు సన్నిహితంగా మెలిగే చనువు ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీలను ఆయన వద్దకు పంపారు. వంగవీటి రాధాను వైసీపీ గూటికి చేర్చగలిగితే కాపు సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకోవడం, అదే సమయంలో జనసేనాని పవన్ కల్యాణ్ కు దూరం చేయడం చిటికెలో పని అని భావించారు. కాపు ఉద్యమ నుత ముద్రగడ పద్మనాభం పార్టీలో చేరినా ఆయన ప్రవేశం పార్టీకి ఏమాత్రం మైలేజీ ఇవ్వలేదని అర్ధం కావడంతో ఆయన చూపు వంగవీటి రాధాపైకి మళ్లింది. వాస్తవానికి గత రెండేళ్లు జగన్ వంగవీటి రాధాను పార్టీలో చేర్చుకునేందుకు చేయని ప్రయత్నాలు లేవు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ రాధా ఎలాంటి పదవులూ ఆశించలేదు. అయితే వంగవీటి రాధా తెలుగుదేశంలో అసంతృప్తితోనే కొనసాగుతున్నరని భావించిన జగన్ రాధా వైసీపీలోకి వస్తే ఆయనకు విజయవాడ సెంట్రల్ స్థానాన్ని కేటాయిస్తామని ఆఫర్ ఇచ్చారు. కొడాలి నాని, వల్లభనేని వంశి, మిథున్ రెడ్డి, పేర్ని నాని వంటి వారు జగన్ దూతలుగా రాధాను కలిశారు. ఆయనను వైసీపీలోకి ఆహ్వానించారు.
రాధాతో వైసీపీ నేతలు ఎంతగా అంటకాగి తిరిగారంటే.. తాము రాధాకు దగ్గరగా మెసిలితే.. ఆయన వైసీపీ గూటికి చేరుతున్నారన్న సంకేతం ఆయన అనుచరులకు వెడుతుందనీ, అదే విధంగా తెలుగుదేశం ఆయనను దూరం పెడుతుందన్న దూరాలోచనతో రాధా తన తండ్రి రంగా వర్ధంతిని పురస్కరించుకుని పిండ ప్రదానం చేసేందుకు కాశీ వెడితే ఆయన వెంట కొడాలి నాని వెళ్లారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వంగవీటి రాధా జగన్ పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదని కుండబద్దలు కొట్టేశారు. అంతే కాకుండా విజయవాడ వైసీపీ ఇన్ చార్జ్ బొప్పన భవకుమార్ ను తెలుగుదేశంలోకి రావాల్సిందిగా ఆహ్వానించి వంగవీటి రాథా జగన్ కు భారీ షాక్ ఇచ్చారు. తద్వారా తాను పార్టీ మారే ప్రశక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు. దీంతో జగన్ కాపు సామాజికవర్గ మద్దతు కోసం వేసిన ఎత్తులు, పన్నిన వ్యూహాలు పూర్తిగా బెడిసికొట్టాయి.
అయితే వంగవీటి రాధా తెలుగుదేశం కార్యక్రమాలలో పెద్దగా చురుగ్గా పాల్గొనడం లేదన్నది వాస్తవం. అలాగే ఆయన తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయాలని హైకమాండ్ స్వయంగా కోరినా సున్నితంగా తిరస్కరించారని చెబుతారు. అటువంటి వంగవీటి రాథా ఇప్పుడు జనసేన నేతలతో వరుస భేటీలతో యాక్టివ్ గా మారడంతో తెలుగుదేశం, జనసేనల పొత్తుతో ఆయన ఎన్నికల బరిలోకి దిగాలన్న నిర్ణయానికి వచ్చారని పరిశీలకులు చెబుతున్నారు.
తెనాలిలో జనసేన సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్ తో, ఆ తరువాత బాలశౌరితో భేటీ అయ్యారు. ఈ భేటీల వెనుక కారణం ఏమిటన్నది తెలియరాలేదు. అయితే ఆయన జనసేన తరఫున ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఏదో ఒక స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పొత్తులో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేనకు కేటాయించిన స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా వంగవీటి రాధా అనుచరులు కూడా చెబుతున్నారు. వంగవీటి రాధ ఎన్నికల బరిలో దిగడం, దిగకపోవడం అటుంచితే ఆయన మాత్రం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరఫున యాక్టివ్ గా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం మాత్రం గ్యారంటీ అని ఆయన అనుచరులు చెబుతున్నారు. గత ఎన్నికలకు ముందు తెలుగుదేశంలో చేరిన రాథా ఆ ఎన్నికలలో పోటీ చేయలేదనీ, అయితే తెలుగుదేశం తరఫున విస్తృతంగా ప్రచారం చేశారనీ వారీ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.