వల్లభనేని వంశీ రాజకీయ సన్యాసం
posted on Sep 27, 2022 @ 9:59PM
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారా? గన్నవరం నియోజకవర్గంలో విపరీతంగా జరుగుతున్న చర్చలను గమనిస్తే ఔననే అనిపించక మానదు. వంశీ రాజకీయవైరాగ్యానికి దారి తీసిన పరిస్థితులపై కూడా ఈ సందర్భంగా గన్నవరం నియోజవర్గంలో ఓ చర్చ యెడతెగకుండా సాగుతోంది.
జగన్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైయస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చారు. ఆ నిర్ణయం సరికాదంటూ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వెంటనే ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ నిర్ణయంపై ఓ సారి పునరాలోచించాలంటూ సీఎం జగన్‌కు ఎమ్మెల్యే వంశీ సూచించారు. అయితే దీనిపై జగన్ నుంచి స్పందన లేదు సరికదా.. పలువురు వైసీపీ నాయకులు మంత్రులు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు సహేతుకమైనదేనంటూ పోటీలు పడి మరీ ప్రకటనలు గుప్పించారు. చివరాఖరుకు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతీ కూడా తన భర్త పేరుపై ఉన్న హెల్త్ వర్సిటీ మార్పును స్వాగతించారు. మరోవైపు జగన్ తీసుకున్న నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు నిరసన వ్యక్తం చేశారు.
ఇప్పటికే జగన్ అధికారాన్ని చేపట్టిన నాటి నుంచి ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్‌గా చేసుకుని పాలన సాగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ క్రమంలోనే హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి.. వైయస్ఆర్ పేరు పెట్టారని అంటున్నారు. దీంతో అసలు పంచాయతీ అంతా జగన్ వర్సెస్ ఆ సామాజికి వర్గం అన్నట్లుగా తయారైందనే అభిప్రాయం రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తమౌతోంది.
ఇంకోవైపు.. 2019 ఎన్నికల్లో జగన్ హావా తట్టుకొని వల్లభనేని వంశీ.. గన్నవరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆ తర్వాత కారణాలేమైనా.. వైసీపీ గూటికి చేరారు... అక్కడితో ఆగకుండా టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు ఆయన ఫ్యామిలీపై వంశీ విమర్శలు గుప్పించారు.. దీంతో ఎన్టీఆర్ ఫ్యామిలీలోని వారంతా మీడియా ముందుకు రావడం ఆ విమర్శలను ఖండించారు.. ఆ తరువాత వల్లభనేని వంశీ ఓ టీవీ చర్చా కార్యక్రమంలో చంద్రబాబు ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పారు. అయితే అప్పటికే వల్లభనేని వంశీకి పూడ్చలేని నష్టం జరిగింది. ఇటు నమ్ముకున్న వైసీపీలో కూడా వర్గ రాజకీయాల కారణంగా ఆయనకు ఉక్కపోత ఆరంభమైంది.
గన్నవరం నియోజకవర్గంలో అధికార ఫ్యాన్ పార్టీలో గ్రూప్‌ల రాజకీయం.. వంశీ కి పొమ్మనకుండా పొగపెట్టేసింది. వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ కోసం.. అటు యార్లగడ్డ వెంకట్రావు వర్గం.. ఇటు దుట్టా రామచంద్రరావు వర్గం.. హోరా హోరీగా పోటాపోటీ పడుతున్నాయి. ఒకానొక దశలో ఈ నియోజకవర్గ పంచాయతీ కాస్తా సీఎం జగన్ సతీమణి వైయస్ భారతి వరకూ వెళ్లింది. ఆ క్రమంలో వైయస్ భారతి శివగామి తరహాలో సెటిల్‌మెంట్ చేసి... ఇరు వర్గాల వారిని టండా టండా కూల్ కూల్ చేశారనే ఓ టాక్ సైతం వైరల్ అయింది. దీంతో గన్నవరం పంచాయతీ సద్దుమణిగింది.
ఇక వల్లభనేని వంశీని ఈ సారి ఎలాగైనా ఎన్నికల్లో ఓడించాలన్న కృత నిశ్చయంతో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. వంశీపై గెలిచే అభ్యర్థి కోసం వేట మొదలు పెట్టారు. ఆ క్రమంలో పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో ప్రస్తుత విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఉన్నారు. కానీ ఆయన ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదని సమాచారం.
మరోవైపై టీడీపీ నుంచి ఫ్యాన్ పార్టీలోకి జంప్ చేసిన వంశీకి వ్యతిరేకంగా ఎంత చేయాలో అంతా దుట్టా, యార్లగడ్డ వర్గాలు చేసేస్తున్నాయని సమాచారం. ఆ క్రమంలో ఇన్ని తలనొప్పుల మధ్య ఎన్నికల్లో పోటీ చేసే కంటే.. రాజకీయాలకు పుల్ స్టాప్ పెట్టేస్తే... బెటర్ అని వంశీ ఓ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. మరి వల్లభనేని వంశీ.. రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తారా? లేదా అనేది మరి కొద్ది రోజుల్లో తెలిపోతోంది. కానీ ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పడమే మంచిదన్న నిర్ణయానికి దాదాపు వచ్చేసినట్లేనని ఆయన సన్నిహితులు బాహాటంగానే చెప్పడం కొసమెరుపు.