మీడియాతో యోగి డివైడ్ పాలిటిక్స్!.. విభజించి ప్రకటనలిచ్చి..!
posted on Dec 13, 2021 @ 2:46PM
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. వారణాసిలో కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. యూపీలో నరేంద్ర మోడీ పర్యటన రెండ్రోజుల పాటు కొనసాగనుంది. వారణాసి విమానాశ్రయం వద్ద ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయనకు సాదర స్వాగతం పలికారు. అక్కడి నుంచి కారులో బయలుదేరిన మోడీపై వారణాసి ప్రజలు గులాబీ పూలు జల్లుతూ, ''మోదీ మోదీ, హర్ హర్ మహదేవ్' నినాదాలు హోరెత్తించారు.
ఇక మోడీ పర్యటనకు యోగీ ఆధిత్యనాథ్ సర్కార్ ఘనంగా ఏర్పాట్లు చేసింది. త్వరలోనే యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ప్రధాని పర్యటన సీఎం యోగీకి అత్యంత కీలకంగా మారింది. అందుకే గతంలో ఎప్పుడు లేనంత స్థాయిలో ప్రధాని మోడీ పర్యటనకు ఏర్పాట్లు చేసింది. అంతేకాదు ప్రధాని పర్యటనకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. వారణాసి మొత్తం మోడీ ఫోటోలతో నింపేసింది. ప్రధాని పర్యటనపై మీడియాలో జోరుగా ప్రచారం చేసింది. ఉత్తరాధికి సంబంధించిన అన్ని పత్రికలకు ఫుల్ పేజీ యాడ్ ఇచ్చింది యోగీ సర్కార్.
ఉత్తరాదిలో ప్రచురితమయ్యే పెద్ద, చిన్నా చితకా అన్ని పేపర్లలో యూపీ సర్కార్ యాడ్ వచ్చింది. కానీ దక్షిణాది మీడియా విషయంలో పక్షపాత వైఖరి అవలంభించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దక్షిణాదిలోని ఏ రీజనల్ లాంగ్వేజ్ పేపర్‌కు గానీ, టీవీ ఛానెల్‌కు గానీ యూపీ సర్కార్ తరఫున యాడ్ ఇవ్వలేదు. తెలుగు పేపర్లలో ఆ ఊసే లేదు. కానీ... సౌత్ ఇండియా సెంటర్‌గా ప్రచురితమయ్యే ఇంగ్లీష్ పేపర్లతో మాత్రం యూపీ సర్కారు డబుల్ గేమ్ అడిందంటున్నారు. మోదీకి స్వాగతం పలుకుతు హైదరాబాద్ కేంద్రంగా వచ్చే ఓ ఇంగ్లీష్ పేపర్లో యోగి సర్కారు ఇచ్చిన ప్రకటన ప్రచురితమైంది. అదే, మరో ప్రముఖ ఇంగ్లీష్ పేపర్ లో మాత్రం యోగి యాడ్ లేదు. ఆ పత్రికకు ప్రకటన ఇవ్వలేదు. ఇదే ఇప్పుడు విమర్శల పాలవుతోంది. ఇస్తే.. అన్ని పేపర్లకు యాడ్ ఇవ్వాలి కానీ.. ఒక పేపర్‌కు ఇచ్చి ఇంకో పేపర్‌కు ఇవ్వకపోవడం దారుణమైన విషయం. ఇది పూర్తిగా పక్షపాతపూరితం.. అంటూ మీడియా వర్గాలు మండిపడుతున్నాయి. యూపీ సర్కారు తీరును నిలదీస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రభుత్వాలు.. తమ పథకాలకు సంబంధించిన యాడ్స్ ను ఉత్తరాజి పేపర్లకు కూడా ఇస్తాయి. జాతీయ స్థాయిలో ప్రచారం చేసుకోవడానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాయి. అలానే, యోగీ సర్కార్ సైతం భారీ ఖర్చుతో పేపర్ ప్రకటనలు ఇచ్చింది. కానీ, ఆ ప్రకటనలు ఉత్తరాదికే పరిమితం చేసింది. దక్షిణాది ఇంగ్లీష్ పేపర్లలో కొన్నిటికి ఇచ్చి.. మరికొన్నిటికి యాడ్ ఇవ్వకపోవడం ముమ్మాటికీ తప్పే అంటున్నారు. దీనిపై ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు మీడియా ప్రముఖులు.