జూనియర్ ఫ్లెక్సీల తొలగింపు.. అసలు కారణం తెలుసా?
posted on Jan 19, 2024 @ 4:54PM
నందమూరి కుటుంబంలో విభేదాలు మరోసారి బయటపడ్డాయని గురువారం నుండి పలు డిజిటల్ మీడియా సైట్లు, కొన్ని యూట్యూబ్ చానెళ్లు, ఓ రెండు మూడు మెయిన్ స్ట్రీమ్ చానెళ్లు కూడా రచ్చ రచ్చ చేస్తున్నాయి. అది కూడా బాబాయ్ బాలయ్య, అబ్బాయ్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య సఖ్యత లేదని, బావ చంద్రబాబు నాయుడు, అల్లుడు లోకేష్ కోసం బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఎదగనీయకుండా ఏం చేయాలో అన్నీ చేస్తున్నారంటూ ఏవేవో పిచ్చి రాతలు రాసుకొస్తున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానెళ్లయితే ఎవరో దిక్కూ ముక్కూ లేని అనామకులతో విశ్లేషణలు జరిపించి మరీ వారి చేత పిచ్చి కూతలు కూయిస్తున్నారు. ఇన్నాళ్లూ లోలోపల జరుగుతున్న ఫైట్ ఇప్పుడు బహిర్గతమైపోయిందని రెండు మెయిన్ స్ట్రీమ్ న్యూస్ చానెళ్లు గురువారం మధ్యాహ్నం నుండి పదేపదే ఇదే విషయంపై నానా రచ్చ చేస్తున్నాయి. దీనంతటికీ కారణం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జరిగిన ఫ్లెక్సీల రగడ. జూనియర్ ఎన్టీఆర్ పేరిట ఇక్కడ వెలసిన ఫ్లెక్సీలను బాలకృష్ణ తీసేయమని ఆదేశించడం, బాలకృష్ణ అక్కడకి వెళ్ళగానే ఎన్టీఆర్ పేరిట ఉన్న ఫ్లెక్సీలను తొలగించడం హాట్ టాపిక్ అయింది.
దివంగత మహానేత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, పలువురు నేతలు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించేందుకు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చిన బాలకృష్ణ అక్కడ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను చూసి వాటిని అక్కడ నుండి తీయించేయమని ఆదేశించారు. అంతే పదే పది నిమిషాలలో జూనియర్ ఎన్టీఆర్ పేరిట ఉన్న ఫ్లెక్సీలను అక్కడ నుంచి తీయించేశారు. దీంతో వైసీపీ డిజిటల్ మీడియా గురువారం నుండి పండగ చేసుకుంటున్నది. ఎన్టీఆర్ కుటుంబంలో గొడవలు బహిర్గతం అయ్యాయని, టీడీపీ అధినేత చంద్రబాబు బాబాయ్ అబ్బాయి మధ్య చిచ్చు పెట్టారని, లోకేష్ కోసం ఎన్టీఆర్ ను ఎదగనీయడం లేదని ఇష్టారాజ్యంగా పోస్టులు పెడుతున్నది. ఇంకా చెప్పాలంటే బాలయ్య ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించమని ఆదేశించడం వైసీపీకి కోతికి కొబ్బరి చిప్పలాగా దొరికింది.
నిజానికి బాలకృష్ణ స్పందించే తీరుపై ఎవరూ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయరు. స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా వాటిని బాబాయ్ బాలయ్య తీయించేయడాన్ని స్వాగతిస్తారు. అయితే వైసీపీ అనుకూల మీడియా, వైసీసీ సోషల్ మీడియా పేజీలు రచ్చ చేస్తున్నట్లుగా ఇది ఎన్టీఆర్ కుటుంబంలో విబేధాలతో చేసిందో.. లోకేష్ కోసం చేసిందో కానే కాదు. ఇంకా వివరంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ మంచి కోసమే బాలకృష్ణ ఈ పని చేశారు. అబ్బాయి మంచి కోరే బాబాయ్ బాలయ్య ఎంతో బాధ్యతతో ఈ ఫ్లెక్సీలను తీయించేశారు. అక్కడ జరిగేది శుభకార్యమో, జాతరో కాదు. తెలుగు ప్రజల ఆరాధ్య దైవ్యం, అభిమాన నాయకుడు నందమూరి తారకరామారావు వర్ధంతి. ఎన్టీఆర్ కుటుంబం అక్కడకి వెళ్ళింది ఆ మహనీయుడికి నివాళులు ఆ పెద్దాయనను గుర్తు చేసుకొనేందుకు వెళ్లారు. అలాంటి చోట ఘనస్వాగతం అంటూ ఫ్లెక్సీలు పెట్టడం ఎంత మాత్రం సముచితం కాదు. బాధాతప్త హృదయంతో అక్కడకి వచ్చే వారికి స్వాగతాలు చెప్పడం ఎంత మాత్రం మంచిది కాదు. అందుకే బాలయ్య ఆ ఫ్లెక్సీలను తొలగించారు.
ఇప్పుడు ఈ ఫ్లెక్సీల వివాదానికి కారణమైన ఎన్టీఆర్ అభిమాని గతంలో కూడా ఇలాగే ఎన్టీఆర్ వర్ధంతికి భారీగా ఫ్లెక్సీలు పెట్టడంతో అప్పుడు కూడా వాటిని తొలగించారు. ఇలాంటి కార్యక్రమంలో ఇలాంటి పనులు వద్దని కూడా చెప్పారు. కానీ మళ్ళీ అదే పని చేశారు. దీంతో బాలయ్య అసహనం వ్యక్తం చేశారు. దీనినే వైసీపీ గోరంతను చేసి చూపి.. ఎన్టీఆర్ కుటుంబంలో విభేదాలు అంటూ రచ్చ చేయడానికి ప్రయత్నించింది. నిజానికి ఎన్టీఆర్ పై బాలయ్యకి ఉన్నది పుత్ర వాత్సల్యం. మరణించిన వారికి నివాళులు అర్పించేందుకు వచ్చిన వారికి స్వాగతాలు చెప్పడం శుభకరం కాదు. శుభప్రదం కాదు. అలాగే అలాంటి చోట ఫోటోలతో ఫ్లెక్సీలు అసలు మంగళకరం కానే కాదు. గతంలో చెప్పినా మళ్ళీ అదే పని చేశారంటే అది ఖచ్చితంగా కుటుంబం మధ్య చిచ్చు పెట్టేందుకేనని అనుమానించాల్సి వస్తున్నది. ఈ ఫ్లెక్సీల రచ్చ వెనక ఇన్ని కారణాలు ఉన్నాయి కనుకే తండ్రికి నివాళులు అర్పించేందుకు వచ్చిన బాలయ్య తన కుమారుడి పేరిట స్వాగతాలు కనిపించడం భావ్యంగా భావించలేదు. తండ్రి హరికృష్ణ తర్వాత బాబాయి బాలకృష్ణ తన బాధ్యతను సక్రమంగానే నిర్వర్తించారు. ఎన్టీఆర్ సోదరి సుహాసిని పక్కనే ఉండగానే బాలయ్య ఈ ఫ్లెక్సీలను తొలగించమన్నారంటే ఇది వివాదం కాదు బాధ్యతని ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుంది. ఏ సాకు దొరుకుతుందా బాలయ్యను, తెలుగుదేశం పార్టీనీ ఇరుకున పెడదామని చూసే వైసీపీకి తప్ప.