మల్లాడి రాజీనామాపై పుదుచ్చేరి ప్రభుత్వం మౌనం?
posted on Nov 1, 2012 @ 6:04PM
కేంద్రపాలిత ప్రాంతమైన యానాం అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యుడు మల్లాడి కృష్ణారావు చేసిన రాజీనామాపై ఇంకా పుదుచ్చేరి రాష్ట్రఅసెంబ్లీ నేతలు ఒక నిర్ణయానికి రాలేదు. పైగా దీని గురించి మౌనంగా ఉన్నారు. తన రాజీనామా ఆమోదించరని ముందుగా తెలిసే కృష్ణారావు రాజీనామా చేశారని రాజకీయపరిశీలకులు భావిస్తున్నారు. యానాం అభివృద్ధి విషయంలో మల్లాడి కృష్ణారావు ఎప్పుడూ సీరియస్‌గా ఉంటారని అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఎంతో చిన్నదైన ఈ ప్రాంతం నేడు అభివృద్ధిలో తూర్పుగోదావరి జిల్లాలోని కీలకనగరాలతో పోటీపడుతోంది. దీనికి కారణం మల్లాడి చేసిన కృషి మాత్రమే.
అంతకు ముందు ఉన్న నేతలందరూ నామమాత్రంగా పని చేస్తే మల్లాడి మాత్రం సీరియస్‌గా వచ్చే ప్రతీ నిధిని యానాం తీరుతెన్నులు మార్చేలా ఊపయోగించారు. తాను టూరిజం మంత్రిగా ఉన్నప్పుడు కృష్ణారావు రేవు ఒడ్డున తమిళనాడులోని కన్యాకుమారి తరహాలోనూ విగ్రహాలు పెట్టించటం వంటి పనులు చేశారు. రాజమండ్రి పుష్కరఘాట్‌లో ఆకర్షిస్తున్న శివంబాత్‌ను కూడా యానాంలో ఆయన నిర్మించారు. ఇంత సీరియస్‌గా అభివృద్ధి గురించి కృషి చేస్తున్న తనకు ప్రభుత్వసహకారం లోపించిందని కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రాజీనామా చేశానన్నారు. అయితే ప్రభుత్వం మౌనం వహించటం మాత్రం యానాం ప్రజల్లో టెన్షన్ పెంచుతోంది.