రెబల్ స్టార్ కు రాజ్ నాథ్ సింగ్ నివాళి.. గోప్ప మానవతా వాది అని వ్యాఖ్య
posted on Sep 17, 2022 @ 10:06AM
రెబల్ స్టార్ కృష్ణం రాజుకు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ నివాళులర్పించారు. ఆయన సంస్మరణ సభకు హాజరైన రాజ్ నాథ్ సింగ్ కృష్ణం రాజు గొప్ప నటుడు మాత్రమే కాదు గొప్ప మానవతా వాది అని అన్నారు. క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన కృష్ణం రాజు సంస్మరణ సభలో ప్రసంగించిన ఆయన కృష్ణం రాజు మరణించారంటే నమ్మలేకపోతున్నానన్నారు. కృష్ణం రాజు కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందన్నారు. బాహుబలి సినిమా విడుదలకు ముందు ఆయన తనకు ఆ సినిమా చూపించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంటులో గోవధ నిషేధం బిల్లును కృష్ణం రాజే ప్రవేశ పెట్టారని గుర్తు చేసుకున్నారు.
సంతాప సభకు ముందు కృష్ణంరాజు ఇంటికి వెళ్లిన రాజ్ నాథ్ సింగ్ కృష్ణం రాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాగా కృష్ణం రాజుకు సినీ, రాజకీయ రంగాలలో పలువురు అభిమానులు ఉన్నారు. కృష్ణం రాజు రెండు పర్యాయాలు ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. సినిమాలలోనే కాదు.. రాజకీయాలలో కూడా ఆయన రారాజుగానే ఉన్నారని ఆయన అభిమానులు అంటుంటారు. అయితే సినిమాలలో ఎలా అయితే డ్యాన్సులకు స్టెప్పులు వేయడంలో ఆయన ఎలా ఇబ్బంది పడ్డారో.. అలాగే రాజకీయాలలో కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేయడంలోనూ అలాగే ఇబ్బందులు పడ్డారు. అందుకే ఆయనకు రాజకీయ రంగంలో రావాల్సినంత గుర్తింపు రాలేదని ఆయన అభిమానులు అంటుంటారు. తెలుగు సినీరంగం నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన హీరోలు, నిర్మాతలు చాలా మందే ఉన్నారు. అందులో కొందరు ఎంపీలు’ ఎమ్మెల్యేలు కూడా అయ్యారు. అయినా, అందులో మంత్రులై ఓ వెలుగు వెలిగిన వారు మాత్రం అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఆ కొద్ది మందిలో రెబల్ స్టార్’గా సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన కృష్ణంరాజు ఒకరు.నిజానికి కృష్ణం రాజు కంటే ముందు ఆయత తర్వాత కూడా కొంగర జగ్గయ్య మొదలు మోహన్ బాబు వరకు, నిర్మాత రామానాయుడు మొదలు మోహన్ బాబు వరకు, నటశేఖర కృష్ణ మొదలు సత్యనారాయణ వరకు మురళీ మోహన్ మొదలు మెగాస్టార్ చిరంజీవి వరకు, జమున, ఊర్వశి శారద మొదలు విజయశాంతి, జయప్రద వరకు ఇలా పార్లమెంట్ గడప తొక్కిన సినీ ప్రముఖులు చాలా మందే ఉన్నారు. అయితే కేంద్రలో మంత్రి పదవికి చేరుకుంది మాత్రం కృష్ణం రాజు, ఆయన తర్వాత చిరంజీవి. ఈ ఇద్దరిని మంత్రి పదవి వరించింది.
అయితే, రెబెల్ స్టార్ సినిమా జీవితం’ ఆయన నటించిన సినిమాలు, చేసిన పాత్రల విషయాన్ని పక్కన పెట్టి, రాజకీయ జీవితం విషయానికి వస్తే, కృష్ణం రాజు రాజకీయాల్లో ఎక్కడా స్థిరంగా నిలబడలేక పోయారు. సినిమాల్లో నవరసాలు, ముఖ్యంగా రౌద్ర రసాన్ని అద్భుత్వంగా పండించిన కృష్ణం రాజు, పాటలు స్టెప్పులు దగ్గర కొచ్చే సరికి తడబడి పోయేవారని, స్టెప్పులు సరిగా పడేవి కావని అంటారు. రాజకీయాల్లోనూ అంతే, ఆయన స్టెప్పులు సరిగా పడలేదు.నడక సరిగా సాగలేదు.
ఏ పార్టీలోనూ స్థిరంగా నిలబడలేదు. అందుకే ఆయన రాజకీయ రంగంలో ఆశించిన పదవులను అందుకోలేక పోయారు. నిజానికి కృష్ణం రాజనే కాదు,సినిమా హీరోలు చాలా వరకు రాజకీయాల్లో అంతగా రాణించలేక పోవడానికి, నిలకడలేని తనం కూడా ఒక కారణమని విశ్లేషకులు అంటారు. కృష్ణం రాజు తర్వాత కేంద్ర మంత్రి స్థాయికి చేరిన హీరో చిరంజీవి విషయాన్నే తీసుకుంటే, ఆయనా అంతే... ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ఒక్క ఎన్నికల్లో ఓడి పోగానే, పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్ గంగలో కలిపేశారు. అఫ్కోర్స్, అలా కాంగ్రెస్’లో కలిపేశారు కాబట్టే మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఆయన మంత్రి అయ్యారు, అనుకోండి అది వేరే విషయం. అదలా ఉంటే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన మెగా స్టార్, ఆ పార్టీలోనూ నిలవలేదు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారం కోల్పోయిన తర్వాత, ఆ పార్టీని వదిలేశారు. కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నా మళ్ళీ అటుకేసి కన్నెత్తి అయినా చూడలేదు. వేషం మార్చి మళ్ళీ రంగుల ప్రపంచంలోకి వచ్చేశారు.
కృష్ణం రాజు కూడా అంతే, 1991 సార్వత్రిక ఎన్నికలకు ముందు, రాజకీయ అరంగేట్రం చేశారు. నరసాపురం లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేశారు.తెలుగు దేశం పార్టీ అభ్యర్ధి భూపతిరాజు విజయ్ కుమార్ రాజు చేతిలో ఓడిపోయారు. ఆతర్వాత బీజేపీ తీర్థం పుచ్చున్నారు.1998లో కాకినాడ లోక్ సభ స్థానం నుంచి పోటీచేసి సమీప తెలుగుదేశం అభ్యర్ధి తోట గోపాలకృష్ణపై 67,799 ఓట్ల భారీ అధిక్యంతో గెలుపొందారు.
అదే సమయంలో కేంద్రలో అటల్ బిహారీ వాజపేయి సారధ్యంలో, బీజేపీ సంకీర్ణ ప్రభుతం ఏర్పడింది. అయితే, సంవత్సరం తిరగకుండానే మళ్ళీ ఎన్నికలు రావడంతో, ఆయన 1999 ఎన్నికల్లో నరసాపురం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజుపై పోటీచేసి 1,65,948 ఓట్ల రికార్డు మెజారిటీతో విజయం సాధించారు. అంతే కాదు, కేంద్ర మంత్రి వర్గంలో స్థానం సంపాదించుకున్నారు. ఆ విధంగా తెలుగు సినిమా రంగం నుంచి కేంద్ర మంత్రి వర్గంలో స్థానం సంపాదించిన తొలి హీరోగా మరో రికార్డ్ సొంతం చేసుకున్నారు.2000 నుంచి 2004 వరకు అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. తొలుత కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా 200 సెప్టెంబర్ 30 నుంచి 2001 జులై 22వరకు సేవలందించారు.ఆతర్వాత 2001 జులై నుంచి 2002 జులై వరకు ఏడాది పాటు రక్షణ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2002 జులై1 నుంచి వినియోగదారుల వ్యవహరాలు, ప్రజాపంపిణీ శాఖ సహాయ మంత్రిగా, 2003 జనవరి 29 నుంచి 2004 మే 22 వరకు కేంద్ర గ్రామీణాభివద్ధి శాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. 2004లో తిరిగి నరసాపురం లోక్ సభ నుంచి ఏంపీగా పోటీచేసి.. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ కు చెందిన చేగొండి వెంకట హరిరామ జోగయ్య చేతిలో ఓటమి చెందారు.
ఆతర్వాత కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉన్న కృష్ణం రాజు, 2009 మార్చిలో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. రాజమండ్రి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమి చెందారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ విలీనం చేయడంతో తిరిగి ఆయన 2013లో అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షులు రాజ్ నాధ్ సింగ్ సమక్షంలో బీజేపీలో చేరారు.అయినా, ఆయన 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేయలేదు. గవర్నర్ పదవి ఆశించారు కానీ, అదీ దక్కలేదు. చివరకు, ఆ కోరిక తీరకుండానే, లోకాని విడచి వెళ్ళిపోయారు.