రాష్ట్ర విభజన గురించి నాకు ముందే తెలుసు: జేడీ శీలం
posted on May 4, 2014 @ 3:34PM
రాష్ట్ర విభజన వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్టానానికి కడదాకా అండగా నిలిచిన జేడీ శీలం సీమాంద్ర ప్రజల అభీష్టాన్ని మాత్రం ఎన్నడూ పట్టించుకోలేదు. కారణం కాంగ్రెస్ అధిష్టానం తనని పిలిచి కేంద్రమంత్రి పదవి కట్టబెట్టడమే. తనను ఓటేసి ఎన్నుకొన్న ప్రజల అభీష్టం కంటే మంత్రి పదవి, అదిచ్చిన కాంగ్రెస్ అధిష్టానమే తనకు ముఖ్యమని ఆయన ఋజువు చేసారు. నేటికీ ఆయన వంటి వారు కొంత మంది కాంగ్రెస్ పార్టీనే అంటి పెట్టుకొని ఉన్నారు. అటువంటి మరో కేంద్రమంత్రి చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ “రాష్ట్ర విభజన వల్ల నష్టం జరుగుతుందని ప్రజలు అపోహ పడుతున్నారని, వారి అపోహలు దూరం చేసి, మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే ఓటేయమని అడిగేందుకే ప్రజల మధ్యకు వెళుతున్నామని” తెలిపారు.
జేడీ శీలం ఆయనతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆ సందర్భంగా మీడియా వాళ్ళు “రాష్ట్ర విభజన అంతా మీ చేతుల మీదుగానే జరిగిందని ప్రతిపక్షాల వారు ఆరోపిస్తున్నారు. దానికి మీ సమాధానం ఏమిటి?” అని జేడీ శీలాన్ని ప్రశ్నించినపుడు, “ఈ ఆరోపణలను నేను ఒక కాంప్లిమెంటుగా భావిస్తున్నాను. నిజానికి రాష్ట్ర విభజన జరుగబోతోందని నాకు చాలా ముందే తెలుసు. గత ఏడాది జూన్ 17నే నేను ఆ మాట తెలంగాణా నేతలకి చెప్పాను. కానీ అప్పుడు ఎవరూ నామాట నమ్మలేదు,” అని జవాబిచ్చారు.
ఆయన ఈరోజు బయటపెట్టిన ఈ రహస్యం బహుశః సీమాంధ్ర కాంగ్రెస్ యంపీలు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు అందరికీ కూడా అప్పుడే తెలిసి ఉంటుందని భావించవచ్చును. కానీ అందరూ కూడా రాజీనామాల డ్రామాలు ఆడుతూ ఎలాగో రోజులు దొర్లించేయగలిగారు. ప్రజా ఉద్యమాలు జరుగుతున్నంత కాలం హైదరాబాదు, డిల్లీలో పిల్లుల్లా దాకొన్న అటువంటి నేతలే నేడు మళ్ళీ నిసిగ్గుగా తమకు, తమ పార్టీకి ఓటేయమని అడిగేందుకు ప్రజల ముందుకు వస్తున్నారు. సీమాంద్రా ప్రజలందరూ రాష్ట్ర విభజనకు బాధపడుతుంటే అది తనకు 'మంచి కాంప్లిమెంటు' ఒక మంత్రి గారు అంటుంటే, విభజన వల్ల నష్టం జరిగిందని ప్రజలు అపోహ పడుతుంటే వారికి జ్ఞానబిక్ష పెట్టేందుకే తాను తరలి వస్తున్నానని మరొక మంత్రిగారు శలవిస్తున్నారు.