రామప్ప.. గొప్పతనం ఏంటో తెలుసాప్ప!
posted on Jul 26, 2021 @ 12:00PM
నీళ్లలో రాయి వేస్తే మునుగును. ఇది సైన్స్. కానీ, నీళ్లలో ఇటుక వేస్తే తేలేలా చేశారు. అలాంటి ఇటుకలతో గుడి గోపురాన్ని నిర్మించారు. సృష్టికి ప్రతిసృష్టి అంటే అదేనేమో..!
రాయిని కొడితే ఠంగుమని సౌండ్ వస్తుంది. కానీ, అక్కడ రాతిశిల్పాలను మీటితే సుస్వరాలు పలుకుతాయి. అదెలా సాధ్యమో...!
రాతి డిజైన్లలో దారం పట్టేంత సన్నని సందు. ఏ శిల్పి చేసిన అద్భుతమో...!
రాతి నంది. శివునికి ఎదురుగా రిలాక్స్డ్‌గా కూర్చొని ఉంటుంది. జీవకళ ఉట్టిపడుతుంటుంది. మనం ఏవైపు నుంచి చూసినా మనల్నే చూస్తున్నట్టు ఉంటుంది. అది శిల్పమా..? సజీవమా?
1819 జూన్ 16న 7.7-8.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఆలయం చెక్కు చెదరలేదు. శాండ్ బాక్స్ టెక్నాలజీతో పునాదులు వేయడమే ఇందుకు కారణం. ఔరా.. ఆ రోజుల్లోనే అంత టెక్నాలజీనా..!
ఆ రాతి శిల్పాలు.. మూడు రంగుల్లో హొయలు పోతుంటాయి. ఆ నాట్యకత్తెలు మంత్రముగ్థులను చేస్తాయి. వరుస ఏనుగులు ఆలయ బరువును మోస్తుంటాయి. ఇలాంటి ఎన్నో అద్బుతాల సమాహారమే రామప్ప దేవాలయం. అందుకే, యునెస్కో మెచ్చింది. ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది.
పునాదుల నిండా ఇసుకను నింపి ఓ భారీ కట్టడాన్ని నిర్మించాలనే ఆలోచనే అప్పట్టో సాహసమే. నిర్మాణంలో శాండ్ బాక్స్ టెక్నాలజీ వినియోగించారు. 3 మీటర్ల లోతు పునాది తవ్వి అందులో ఇసుక నింపారు. ఆ ఇసుకపై రాళ్లు పేర్చుకుంటూ.. 40 ఏళ్లు కష్టపడి.. భారీ ఆలయాన్ని నిర్మించారు. ఆ ఇసుక పునాదుల మీదే 800 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ ఆలయం చెక్కుచెదరకుండా ఉంది. కాకతీయ రాజు గణపతి దేవుడి కాలంలో ఆయన సైన్యాధిపతి రేచర్ల రుద్రుడు ఓ భవ్యమైన శివాలయాన్ని కట్టించాడు. క్రీ.శ 1213లో ఆలయ నిర్మాణం పూర్తయింది. ఆలయం రామలింగేశ్వరుడిదైనా.. ఆ మహత్తర దేవాలయాన్ని నిర్మించిన శిల్పి రామప్ప పేరుతో పేరుగాంచడం విశేషం.
కాకతీయుల ఆలయ నిర్మాణాలన్నీ నక్షత్ర శైలిలో ఉంటాయి. రామప్ప గుడి సైతం ఆ ఆకారంలోనే ఉంటుంది. రామప్ప గర్భాలయంలో ఎత్తయిన పీఠంపై పెద్ద శివలింగం దర్శనమిస్తుంది. గర్భగుడి, మహామండపంతో మూడువైపులా ప్రవేశానికి వీలు ఉంటుంది. గర్భాలయంలో విద్యుత్తు దీపాలు లేకున్నా శివలింగం స్పష్టంగా కనిపిస్తుంది. గర్భగుడి ముందున్న మహామండపానికి నాలుగు పెద్ద నల్లరాతి స్తంభాలుంటాయి. బయటి వెలుగు వాటి మీద పడి పరావర్తనం చెంది శివలింగంపై ప్రతిబింబించడం వల్ల లింగం తేజోవంతంగా కనిపిస్తుంది.
గర్భగుడికి అభిముఖంగా నంది విగ్రహం, కుడివైపున కామేశ్వర, ఎడమ వైపున కాటేశ్వరాలయాలు నిర్మించారు. వీటి నిర్మాణానికి ఎక్కువగా ఏనుగులనే వినియోగించారు. ఆలయ కుడ్యాలపై శివతాండవం, శివపార్వతుల కళ్యాణం, క్షీరసాగర మథనం, రామాయణ, మహాభారత, పురాణ ఇతిహాసాలు తెలిపే రమణీయమైన శిల్పాలు ఉన్నాయి. ఈ ఆలయం చుట్టూ వివిధ భంగిమలతో 12 మదనికలు, నాగిని, కోయస్త్రీ శిల్పాలు కనువిందు చేస్తాయి. నృత్య, యుద్ధ కళలను చెక్కారు. పేరిణి శివతాండవ నృత్యరూపకం ఈ గుడిలోని శిల్పాల నుంచి సేకరించినదే.
ఆలయంలో ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ వాడారు. ఆలయం లోపలి భాగాల్లో ఎర్ర ఇసుక రాతి (రెడ్ శాండ్ స్టోన్)ని ఉపయోగించారు. మరో ప్రత్యేకత ఏమిటంటే కట్టడంపైన బరువును తగ్గించేందుకు ఆలయ గోపుర నిర్మాణంలో నీటి మీద వేస్తే తేలియాడే ఇటుకలను వినియోగించారు. వీటిని ఏనుగు పేడ, తవుడు, కరక్కాయ, చెట్ల జిగురుతో తయారు చేసినట్లుగా చెబుతారు.
ఆలయంలో చాలాచోట్ల మూడు రంగుల రాళ్లను వినియోగించారు. కొన్నిచోట్ల ఎరుపు, తెలుపు మిశ్రమ రంగుల రాళ్లు కూడా కనిపిస్తాయి. ఆలయం లోపల, మహామండపం, కొన్ని శిల్పాలకు పూర్తిగా నల్లరాళ్లనే వాడగా ఆలయం వెలుపల ఎరుపు, తెలుపు రాళ్లను వినియోగించారు. కొన్నిచోట్ల ఈజిప్టు, పర్షియన్ వ్యక్తుల చిత్రాలు కొన్ని కనిపిస్తాయి. ఆ కాలంలోనే విదేశీయులతో సంబంధాలు ఉన్నట్లు వాటి ద్వారా తెలుస్తుంది. జైనులు, బౌద్ధుల శిల్పాలు సైతం కొన్ని ఉన్నాయి.
ఇలాంటి అనేక ప్రత్యేకతల సమాహారమే రామప్ప దేవాలయం. హైదరాబాద్‌కు జస్ట్ 200 కి.మీ. దూరమే. ఒక్క రోజులోనే వెళ్లి రావొచ్చు. ఈ సండే ప్లాన్ చేస్కోండి. మన కాకతీయుల ఘన చరిత్ర తెలుసుకోండి. రామప్ప ఆలయ వైభవాన్ని, విశిష్టతను కళ్లారా చూడండి.