పార్క్ హయత్ లో కమ్మనైన ప్రజాస్వామ్యం.. కలలోనూ కమ్మనైన కలవరింతే
posted on Jun 23, 2020 @ 3:53PM
హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్ లో బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ లతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ రహస్య భేటీ అయ్యారనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. 'పార్క్ హయత్ లో కమ్మనైన ప్రజాస్వామ్యం' అంటూ పరోక్షంగా కుల ప్రస్తావన తీసుకొస్తూ ట్వీట్ చేశారు.
"పార్క్ హయత్ లో కమ్మనైన ప్రజాస్వామ్యం. దుష్ట చతుష్టయంలో ముగ్గురు దొంగలు అడ్డంగా దొరికారు. ఫేస్ టైం లో మాట్లాడిన నాలుగో బిగ్ బాస్ ఎవరు? మరిన్ని వివరాలు అతి త్వరలో..." అంటూ విజయసాయి ట్వీట్ చేశారు.
అయితే, విజయసాయి ట్వీట్ కు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. కమలం అనే ధైర్యం విజయసాయికి లేదని ఎద్దేవా చేశారు.
"శకుని మామా! నీ అల్లుడు వైఎస్ జగన్ స్వామ్యంలో రాజారెడ్డి రాజ్యాంగం ప్రయోగించి తొలగించిన ఎస్ఈసీని చేర్చుకోవాలని కోర్టు ఆదేశించినా పట్టించుకోకుండా, ఇప్పుడాయన ఎవరితో కలిస్తే నీకేంటి?" అని బుద్ధా ప్రశ్నించారు.
"కలలోనూ కమ్మనైన కలవరింతే కానీ! కమలం అనే పదం పలకాలన్నా వణుకెందుకో? ఢిల్లీ బాస్ అనే దమ్ము లేదా?" అని బుద్ధా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.