శ్రీవారి ప్రసాదాలను సామాన్యులకు మరింత చేరువయ్యేలా చేస్తున్న టిటిడి...

 

తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్న కొలువుదీరిన పవిత్ర పుణ్య క్షేత్రం. నిత్యం దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు శ్రీనివాసుని దర్శనానికి తిరుమలకు వస్తూ ఉంటారు. వెంకన్నకు మొక్కులు చెల్లించుకుని స్వామి వారి దివ్య ప్రసాదాన్ని స్వీకరిస్తారు. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి ప్రసాదాలను సామాన్యులకు మరింత చేరువ చేయాలని నిర్ణయించింది టిటిడి. సిఫార్సు లేఖలపై మాత్రమే ఇచ్చే పెద్దలడ్డు, వడలను సామాన్య భక్తులకు కూడా అందుబాటులోకి తీసుకొస్తోంది టీటీడీ. నిత్య కల్యాణం, పచ్చతోరణం తిరుమల తిరుపతిలో ఇలా ప్రతి రోజూ జనసందోహమే. ఇక ప్రత్యేక పర్వదినాల్లో కొండకు వచ్చే భక్తుల సంఖ్య కోట్లల్లోనే ఉంటుంది.

ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి వెంకన్నను దర్శించుకోవటం ఒకెత్తయితే స్వామి వారి ప్రసాదాలను దక్కించుకోవడం మరో ఎత్తు. సామాన్య భక్తులకు ఇచ్చే లడ్డూ ప్రసాదంతో పాటు ఇంకా తెలియని ఎన్నో రకాల ప్రసాదాలను శ్రీవారికి రోజు వారీగా సేవలను బట్టి నివేదిస్తారు అర్చకులు. రోజూ రకరకాల పిండి వంటలు నైవేద్యంగా సమర్పిస్తారు, తర్వాత వాటిలో కొన్నింటిని మాత్రమే భక్తులకు అందుబాటులో ఉంచుతోంది టీటీడీ. పూర్వం కేవలం మట్టి కుండలలో మాత్రమే శ్రీనివాసుడి ప్రసాదాలు వండేవారు. కాలక్రమంలో వాటి స్థానంలో ఇత్తడి గంగాళాలు వచ్చాయి, తిరుమల శ్రీవారి ఆలయంలో విమాన ప్రదక్షిణ ఆవరణకు ఎదురుగా ఉన్నదే స్వామి వారి ప్రధాన వంటశాల. విమాన ప్రదక్షిణలో స్వామి వారి గర్భాలయానికి సరిగ్గా ఆగ్నేయ మూలకు శాస్త్రోక్తంగా మూడడుగుల రాతి అధిష్టానంపై అరవై ఒక్క అడుగుల పొడవు, ముప్పై అడుగుల వెడల్పుతో విశాలమైన ఎత్తైన రాతి స్తంభాలతో వంటశాలను నిర్మించారు.

అత్యంత ప్రాచీనకాలం నుంచి ఇదొక్కటే వంటశాల, శ్రీవారికి నివేదించే అన్న ప్రసాదాలు, పిండి వంటకాలు ఇలా అన్నీ ఈ వంటశాలలోనే తయారు చేసేవారు. భక్తుల సంఖ్య పెరిగిపోతుండటంతో విమాన ప్రదక్షిణంలోని ప్రాచీన వంటశాలను ప్రస్తుతం ప్రధానంగా ఉన్న ప్రసాదాలకు కూడా వాడుతున్నారు. ఇక పిండి వంటలైన లడ్డూ, వడ, అప్పం, దోసె, పోలి, సుఖియా, మురుకు, జిలేబి తదితర వాటి తయారీకి వెండి వాకిలి బయట సంపంగి ప్రదక్షిణంలో ఉత్తరం వైపు ఉన్న మండపాలను వంటశాలగా మార్చి వాడుతున్నారు. శ్రీవారి ప్రసాదాలు ప్రధానంగా చెప్పుకునేది లడ్డు ఇందులో రెండు రకాల లడ్డూలున్నాయి. అందరికీ అందుబాటులో ఉండే నూట డెబ్బై ఐదు గ్రాముల లడ్డూ ఒకటి కాగా మరొకటి కల్యాణం లడ్డు ఇది వీఐపీలకు మాత్రమే ఇస్తారు.

ఇక ఈ పెద్ద లడ్డూ ధర ఒకటే రెండు వందలు, వడ వంద రూపాయలు శ్రీ వారి సేవలలో దర్శించుకునే భక్తులతో పాటు సిఫార్సు లేఖలపై వచ్చే వారికి మాత్రమే వీటిని ఇస్తుంది టీటీడీ. అయితే ఈ పద్ధతిలో మార్పులు చేయాలని నిర్ణయించింది టీటీడీ. పెద్ద లడ్డూ, వడలు ఉత్పత్తి పెంచి సామాన్య భక్తులకు కూడా వీటిని అందుబాటులోకి తేవాలని డిసైడ్ అయ్యింది. ప్రస్తుతం ఆలయం లోపల తూర్పు వైపున ఉన్న భగపడి అరలో పెద్దలడ్డూ, వడలు ఇస్తుంటారు. త్వరలో ఆలయం బయట పెద్దలడ్డూ వడలు విక్రయించాలని భావిస్తోంది టీటీడీ. భక్తుల రద్దీని బట్టి కల్యాణం లడ్డూలు వడలను తయారు చేయిస్తామంటున్నారు అధికారులు. లడ్డూల ఉత్పత్తి పెంచటానికి బోర్డును విస్తరించనుంది టీటీడీ. ఇప్పుడున్న ప్రాంతాన్ని మరింత పెంచుతాం అంటున్నారు అధికారులు.

Teluguone gnews banner