తిరుమల వెళ్తున్నారా... ఆ ఒక్కటి లేకపోతే దర్శనం నాస్తి
posted on Sep 24, 2021 @ 8:47PM
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ పాలకమండలి ఓ కొత్త నిబంధన విధించింది. ఆ నిబంధన కొంతవరకు రిలీఫ్ ఇస్తుండగా.. మరోవైపు కఠినమైన నిబంధనగా మారింది. కొద్దిరోజుల క్రితం వరకు శ్రీవారి దర్శనాన్ని చిత్తూరు జిల్లా భక్తులకే పరిమితం చేయగా.. తాజాగా సర్వదర్శనం కోటాను గణనీయంగా పెంచింది. కోవిడ్ వ్యాప్తి, థర్డ్ వేవ్ భయాందోళనల నేపథ్యంలో వేంకటేశ్వరుడి దర్శనాన్ని కేవలం చిత్తూరు వాసులకే పరిమితం చేయడంతో వివిధ దూర ప్రాంతాల నుంచి తిరుపతికి వెళ్లిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. స్వామివారి మీద ఎంతో భక్తితో ఎన్నో కష్ట-నష్టాలకోర్చి వచ్చిన పలువురు భక్తులైతే తమకు దర్శనం దక్కనందుకు బాధపడుతూ బస్టాండ్ పక్కన క్యూ లైన్లలో, రోడ్ల మీద ఏడుస్తూ కనిపించారు. ఆ దృశ్యాలతో డ్యూటీ పోలీసులు, టీటీడీ సిబ్బంది సైతం ఎంతో సానుభూతి కనబరచారు. అలాంటి పరిస్థితుల్లో తాజాగా సర్వదర్శనం కోటా పెంచుతూ టీటీడీ తీసుకున్న నిర్ణయం ఎంతో ఉపశమనం కలిగించేదే అయినా.. దర్శనానికి వచ్చే భక్తులకు విధించిన తాజా నిబంధన మాత్రం వారికి మరో అగ్నిపరీక్షలా మారింది.
కోవిడ్ థర్డ్ వేవ్ ను అరికట్టే క్రమంలో రెండు దఫాల వ్యాక్సిన్ తీసుకున్నట్టు ధ్రువీకరించే సర్టిఫికెట్ గానీ లేదా కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ గానీ తమవెంట తప్పకుండా ఉంచుకోవాలంటూ టీటీడీ తాజా నిబంధన విధించింది. దీంతో ఆన్ లైన్ మీద అవగాహన ఉన్న భక్తులు కోవిన్ డాట్ కామ్, ఆరోగ్యసేతు లాంటి యాప్ ద్వారా సర్టిఫికెట్లను డౌన్ లోడ్ చేసుకొని ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కానీ ఆన్ లైన్ మీద అవగాహన లేని, ఈ సమాచారంతో అప్ డేట్ కాని లక్షలాది మంది సామాన్య భక్తుల పరిస్థితే అగమ్య గోచరంగా మారింది. కాబట్టి తిరుమల వెళ్లేవారు తప్పకుండా వీలైనంత ముందస్తుగా ప్రిపేర్ కావాలని లేకపోతే అక్కడికి వెళ్లాక ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు.
కొద్దిరోజులుగా కేవలం 2 వేల మందికి, అది కూడా చిత్తూరు జిల్లావాసులకే పరిమితం చేశాక.. 3, 4 రోజుల క్రితమే దర్శనానికి భక్తుల సంఖ్యను పెంచడంతో తిరుమలకు మళ్లీ తాకిడి పెరిగింది. తాజాగా (శుక్రవారం) భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తిరుపతి శ్రీనివాసం వద్దకు చేరుకున్నారు. ఫలితంగా క్యూలైన్ రోడ్డుపైకి వచ్చింది. ఒకదశలో భక్తులను అదుపు చేయలేక టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది చేతులెత్తేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి బస్టాండు వరకు క్యూలైన్ ఏర్పాటు చేశారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు రోడ్డుపైనే కూర్చొని ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ కారణంగా కోవిడ్ వ్యాప్తిపై ఆందోళన చెందుతున్న అధికారులు ఈ విధంగా రెండు దఫాల వ్యాక్సిన్ తీసుకున్నట్టు సర్టిఫికెట్ గానీ, కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ గానీ తప్పకుండా తమవెంట ఉంచుకోవాలన్న నిబంధన విధించారు. ఈ విధానం అక్టోబర్ ఫస్టు నుండి అమల్లోకి వస్తుంది. 12 సంవత్సరాల లోపు వున్న పిల్లలను నిబంధన నుంచి సడలించారు. అయితే వారికి ఆధార్ కార్డును మాత్రం తప్పనిసరి చేశారు. 12 నుండి 18 సంవత్సరాలు ఉన్నవారికి దర్శనం తేదీ నుండి 72 గంటల ముందు జారీ అయిన కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి. 18 సంవత్సరాలు పైబడ్డ వారికి రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న సర్టిఫికేట్, లేదా కరోనా నెగిటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి. ఈ విధానం రూ.300 ప్రత్యేక ప్రవేశ టికెట్లు కలిగిన భక్తులకు అలాగే ఆన్‌లైన్ సర్వ దర్శనం టోకెన్లు కలిగిన వారికి, వర్చువల్ దర్శనం టికెట్లు కలిగిన వారికి కూడా వర్తిస్తాయి. ఈ నెలాఖరు వరకు మాత్రమే పాత పద్ధతిలో అంటే కేవలం ఆధార్ కార్డు పద్ధతిలో దర్శనం అనుమతిస్తారు. ఆ తరువాత కొత్త రూల్స్ వర్తిస్తాయి.