బస్సు చార్జీలు పెరుగుతున్నయ్? కిలోమీటర్ కు ఎంతో తెలుసా...
posted on Dec 1, 2021 @ 2:29PM
డీజిల్ ధరల పెరుగుదల రవాణా రంగంపై తీవ్రంగా పడింది. ఆర్టీసీకి గండంగా మారింది. డీజిల్ ధరలు భారీగా పెరిగిపోవడంతో ఆ మేరకు సంస్థ నష్టాలు మూటగట్టుకుంది. కొవిడ్ తో కోలుకోలేని దెబ్బ తగలగా.. మూలిగే నక్కపై తాడి పండు పడ్డ చందంగా డీజిల్ ధరలు ఆర్టీసీకి మరింత భారంగా మారాయి. దీంతో బస్సు చార్జీలను పెంచాలని డిసైడ్ అయింది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. పల్లె వెలుగులో కిలోమీటర్ కు 25 పైసలు, ఎక్స్ ప్రెస్ తో పాటు ఇతర సర్వీసుల్లో 30 పైసల చొప్పున పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. నష్టాల్లో ఉన్న సంస్థను కాపాడుకునేందుకు చార్జీల పెంపునకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది టీఎస్ ఆర్టీసీ.
డీజిల్ పెరిగినప్పుడు మాత్రమే ఆర్టీసీ టిక్కెట్ ధరలు పెంచామని చెప్పారు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్. 2019 డిసెంబర్ 1న కిలోమీటర్ కు 20 పైసల చార్జీలు పెంచామన్నారు. ఛార్జీలు పెంచినా ఆ లాభాలు ఆర్టీసీకి రాలేదని, కోవిడ్ వల్ల నష్టపోయామని సజ్జనార్ వెల్లడించారు. గతంలో 68.29 పైసలు లీటర్ డీజిల్ ధర ఉంటే.. ప్రస్తుతం 87 రూపాయలుగా ఉందన్నారు. డిజిల్ వల్ల సంస్థకు 480 కోట్ల నష్టం వాటిల్లుతుందని తెలిపారు. ఆర్టీసీకి ఈ సంవత్సరం 1440 కోట్ల రూపాయలు నష్టాలు వచ్చాయన్నారు సజ్జనార్. కోవిడ్ వల్ల రవాణా రంగానికి కోలుకోలేని దెబ్బ తగిలిందని, 251 మంది ఉద్యోగులు కోవిడ్ వల్ల చనిపోయారని చెప్పారు. సంస్థకు రోజుకు 14 కోట్ల ఆదాయం వస్తోందన్నారు. ఇప్పుడు డీజిల్ ధరలు పెరగడం వల్ల ప్రయాణికులు ఆర్టీసీని ఆశ్రయిస్తున్నారని, ఛార్జీలు పెంచితే ఆర్టీసీ గాడిలో పడుతుందని ఆశిస్తున్నామని సజ్జనార్ చెప్పారు.
నెల రోజుల క్రితం ఛార్జీల పెంపు ప్రతిపాదనలు ముఖ్యమంత్రికి అందించామని ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఇంకా కొత్త బస్సులు కొనాల్సి ఉందన్నారు. తొందరగా ఛార్జీల పెంపునకు అనుమతి ఇచ్చేలా ముఖ్యమంత్రి చొరవ చూపాలన్నారు బాజిరెడ్డి. నష్టాన్ని పూరించే దశలో తాము లేమని, కానీ ఛార్జీల పెంపు వల్ల కొంత ఆదాయం పెరుగుతుందని చెప్పారు. ఆర్టీసీకి ప్రధాన ఆదాయం టిక్కెట్లేనని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిందన్నారు. మహారాష్ట్రలో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారని చెప్పారు. ఆర్టీసీకి పునర్ వైభవం తీసుకువచ్చే ప్రయత్నం చైర్మన్, ఎండీ చేస్తున్నారని మంత్రి వెల్లడించారు. ఆర్టీసీ ఛార్జీల పెంపు పై ఎండి నిర్వహించిన సర్వేలో 4.3 శాతం మంది మాత్రమే ఛార్జీల పెంపు పై విముఖత చూపారన్నారు. ఆర్టీసీ ఆస్తులు అమ్మం, అలాంటి తప్పుడు ప్రచారం చేయొద్దని కోరారు. కొత్త ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేస్తామన్నారు పువ్వాడ అజయ్ కుమార్.