కేసీఆర్ పై మంత్రి మల్లారెడ్డి హాట్ కామెంట్స్
posted on Mar 25, 2021 @ 7:09PM
సంచలన కామెంట్లతో రాజకీయ కాక పుట్టించే తెలంగాణ మంత్రి మల్లారెడ్డి.. మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి కావాలని కోరుకున్నారు. కేసీఆర్ ప్రధాని అయితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లే దేశాన్ని కూడా ప్రగతిపథంలోకి తీసుకెళ్తారని చెప్పారు. కేసీఆర్ ప్రధానమంత్రి అయితే ప్రజలకు సమస్యలే ఉండవని పేర్కొన్నారు. దేశ చరిత్ర మారిపోతుందని మల్లారెడ్డి జ్యోస్యం చెప్పారు.
అసెంబ్లీలో మాట్లాడిన మల్లారెడ్డి.. కేంద్ర సర్కార్ విధానాలపై విమర్శలు చేస్తూ ఈ కామెంట్లు చేశారు. కేంద్రప్రభుత్వం, రాష్ట్రంలోని ప్రతిపక్షాలపై ఆయన ఘాటు విమర్శలు చేశారు. 70 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌తో పాటు బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాలు ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. ప్రైవేటీకరణ పేరుతో కేంద్ర ప్రభుత్వం కార్మికులను రోడ్డున పడేస్తోందని మల్లారెడ్డి మండిపడ్డారు.
ఇటీవల రాష్ట్రంలో సీఎంగా మంత్రి కేటీఆర్ ప్రకటించాలని టీఆర్‌ఎస్ శ్రేణులతో పాటు కేబినెట్‌లోని మంత్రులు ముక్తకంఠంతో నినదించారు. ఈ నినాదంలో చేసిన వారిలో మల్లారెడ్డి ముందువరుసలో ఉన్నారు. ఇప్పుడు ఏకంగా సీఎం కేసీఆర్‌ను ప్రధానమంత్రిగా చూడాలని చెప్పడంతో ఆయన మాటలు చర్చగా మారాయి. తన వ్యాఖ్యల ద్వారా కేటీఆర్ ను సీఎం చేయాలని మంత్రి మల్లారెడ్డి చెప్పకనే చెప్పారని అంటున్నారు.