Read more!

బండి సంజయ్ పాదయాత్రకు కోర్టు అనుమతి.. బట్ కండీషన్స్ అప్లై

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు  తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే పాదయాత్రకు పలు షరతులు విధించింది. సోమవారం (నవంబర్ 28) నుంచి బండి సంజయ్ తన ప్రజాసంకల్ప యాత్ర ఐదో విడత ప్రారంభించాల్సి ఉన్న సంగతి విదితమే. అయితే ఆఖరి నిముషంలో పోలీసులు యాత్రకు అనుమతి నిరాకరించారు.

పోలీసుల ఆంక్షలను ధిక్కరించి యాత్రకు బయలు దేరిన బండి సంజయ్ కు హౌస్ అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో    బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. భైంసాలో సున్నితమైన పరిస్థితుల దృష్ట్యా అనుమతి నిరాకరిస్తున్నామని పోలీసులు కోర్టుకు తెలిపారు. బహిరంగసభతో పాటు యాత్రకు కూడా భద్రత ఇవ్వలేమన్నారు.

అయితే కోర్టు బండి సంజయ్ పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది.  భైంసా పట్టణానికి 3 కిలోమీటలర్ల దూరంలో సభ నిర్వహించాలని పేర్కొంది. అలాగే  భైంసా పట్టణంలోకి పాదయాత్ర ప్రవేశించరాదని షరతు విధించింది. అలాగే 500 మందితో మాత్రమే పాదయాత్ర చేయాలని, సభకు మాత్రం 3 వేల మందికి అనుమతి ఉందని పేర్కొంది.

సభను మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించాలని స్పష్టం చేసింది. హైకోర్టులో బీజేపీ తరఫున రామచంద్రరావు, ప్రభుత్వం తరఫున ఏజీ ఏజీ బిఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. బండి సంజయ్ విడతల వారీగా నిర్వహిస్తున్న ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఇప్పటి వరకూ నాలుగు విడతలుగా 21 జిల్లాలలో 1178 కిలోమీటర్లను కవర్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఐదో విడత పాదయాత్ర కోర్టు అనుమతితో మంగళవారం (నవంబర్ 29) నుంచి ప్రారంభం కానుంది.