Read more!

జగన్ సర్కార్ పై చార్జిషీట్లు ఏవీ.. ఎక్కడ..?.. మోడీ ఆదేశించినా బేఖాతరేనా?

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ తీరేమిటో.. వైఖరేమిటో బీజేపీ అధిష్ఠానానికే బోధపడటం లేదు. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించినా కూడా ఏపీ బీజేపీ నేతలకు పట్టించుకోవడం లేదు. తాజాగా మోడీ విశాఖ పర్యటన సందర్బంగా ఏపీలో జగన్ సర్కార్ వైఫల్యాలు, తప్పిదాలు, అవినీతి, అప్పులపై వరుసగా చార్జిషీట్లు తయారు చేయాలని బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీని ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా చార్జిషీట్లను తయారు చేసి విడుదల చేయాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వంపై దూకుడుగా విమర్శలు చేయాలని కూడా మోడీ ఆదేశించారు. మోడీ ఈ ఆదేశాలు జారీ చేసి అప్పుడే మూడు వారాలు గడిచిపోయాయి. అయినా ఏపీ బీజేపీలో చలనం లేదు. ఏపీలో కూడా బలోపేతం కావాలన్న కార్యాచరణలో బీజేపీ అధిష్ఠానం అడుగులు వేస్తుంటే.. రాష్ట్ర బీజేపీ నాయకత్వం మాత్రం మోడీ ఆదేశాలను ఇసుమంతైనా ఖాతరు చేయడం లేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంపై పన్నెత్తి మాట కూడా అనేందుకు సిద్ధపడటం లేదు. విషయమేమిటంటే ఈ నెల 11న ప్రధాని మోడీ విశాఖ పర్యటనకు వచ్చారు.

ఆ సందర్భంగా పార్టీ రాష్ట్ర కోర్ కమిటీతో బేటీ అయ్యారు. ఆ సందర్భంగా రాష్ట్రంలో జగన్ సర్కార్ తీరు తెన్నుల గురించి ప్రధాని మోడీ వారి నుంచి సమాచారం కోరారు.   పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందీశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ మాధవ్ తదితర నేతలు రాష్ట్రంలో ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని ప్రధానికి వివరించారు. అవినీతి రాజ్యమేలుతోందని మోడీకి వివరించారు. దీంతో మోడీ ఆయా అంశాలపై చార్జిషీట్ తయారుచేసి, ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ వైఫల్యాలు, సమస్యలు, అవినీతి అంశాలపై చార్జిషీట్ రూపొందించాలని సూచించారు.

అదే సమయంలో సమస్యలపై స్థానికుల నుంచి సంతకాలు తీసుకోవాలని కూడా సూచించారు. ఇది జరిగి మూడు వారాలైంది. అయినా ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రాష్ట్ర నాయకత్వం ఇప్పటి వరకూ కోర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయకపోవడాన్ని బీజేపీ సీనియర్లు తప్పుపడుతున్నారు.   ఏపీ బీజే పీ నాయకత్వంలో ముఖ్యులు జగన్ అనుకూల వైఖరి అవలంబిస్తోందనడానికి ఇంత కన్నా నిదర్శనం ఏం కావాలని బీజేపీ సీనియర్లు అంటున్నారు.