కరోనాకు చికిత్స మధ్యలోనే బయటకు వచ్చిన ట్రంప్... వెల్లువెత్తుతున్న విమర్శలు
posted on Oct 5, 2020 @ 9:57AM
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. కరోనా సోకిన వ్యక్తి చికిత్స పూర్తైన తరువాత కూడా కొద్ది రోజులు ఐసోలేషన్ లో ఉండాలని నిపుణులు సూచిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కరోనా వైరస్ సోకి, ప్రస్తుతం వాల్టర్ రీడ్ సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చికిత్స మధ్యలోనే.. కొవిడ్-19 ప్రొటోకాల్ నిబంధనలను ఉల్లంఘిస్తూ బయటకు వచ్చి తీవ్ర విమర్శల పాలయ్యారు. బులెట్ ప్రూఫ్ కారులో మాస్క్ ధరించి రోడ్డుపై తిరిగేస్తూ.. తన మద్దతుదారులకు అభివాదం చేస్తూ కనిపించారు.
కాసేపు అలా బయట తిరిగిన ఆయన తిరిగి మళ్ళీ ఆసుపత్రిలోకి వెళ్లిపోయారు. అయితే కరోనా నెగటివ్ రాకుండానే ఆయన ఇలాంటి చర్యలకు పాల్పడడాన్ని వైద్య నిపుణులు తప్పు పడుతున్నారు. శరీరంలో ఉన్న కరోనా వైరస్ అనుక్షణం బయటకు వ్యాపిస్తూనే ఉంటుందని, ఈ కారణంతోనే రోగులను ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారని.. అయితే చికిత్స సమయంలో సాక్షాత్తు అధ్యక్షుడు ఇలా చేయడం సరికాదని అంటున్నారు.
ఇది ఇలా ఉండగా బయటకు రావడానికి ముందు, ట్రంప్ తన ట్విట్టర్ ఖాతాలో మరో వీడియోను పోస్ట్ చేస్తూ.... "కొవిడ్ గురించి నేను చాలా తెలుసుకున్నాను. నిజంగా స్కూలుకు వెళ్లినట్టుగా ఉంది" అని వ్యాఖ్యానించారు. దీంతో ట్రంప్ సోషల్ మీడియా స్టంట్ ను ప్రారంభించారని ఇప్పుడు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ట్రంప్ కాన్వాయ్ లో ఉన్న ప్రతి ఒక్కరినీ 14 రోజుల పాటు తప్పనిసరి క్వారంటైన్ కు పంపనున్నామని జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ చీఫ్ జేమ్స్ ఫిలిప్స్ తెలిపారు.
ట్రంప్ తాజా నిర్వాకం కారణంగా కాన్వాయ్, సీక్రెట్ సర్వీస్ ఏజంట్లు, సెక్యూరిటీలోని ఎవరైనా అనారోగ్యానికి గురై చనిపోతే దానికి ఎవరు బాధ్యులని.. అంతేకాకుండా తన రాజకీయ అవసరాలకు ఉద్యోగులను బలిపెట్టడం ఏంటని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.