తీన్మార్ మల్లన్నకు టీఆర్ఎస్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఇంకోసారి తిడితేనా....
posted on Aug 25, 2021 @ 4:39PM
తీన్మార్ మల్లన్న. ఇప్పుడిది పేరు మాత్రమే కాదు. ఓ పవర్. కేసీఆర్‌ను, ఆయన ప్రభుత్వాన్ని నిత్యం చెడుగుడు ఆడుకునే మాస్ మల్లన్న. యూట్యూబ్ ఛానల్‌తో గులాబీ గ్యాంగ్‌ను ఆటాడుకోవడమే చింతపండు నవీన్ పని. ఆ పనిలో ఆయన తెగ బిజీగా ఉంటారు. ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యే.. ఇలా తరతమ భేదం లేకుండా రోజు ఉదయాన్నే అందరినీ ఓ రౌండ్ వాయించేస్తుంటారు. నిత్యం ప్రజల్లో తమను బద్నాం చేసే మల్లన్న నోటికి, యూట్యూబ్ ఛానెల్‌కి ఎలాగైనా తాళం వేయాలని చాలా రోజులుగా ఎదురుచూస్తోంది కేసీఆర్ సర్కారు. అయితే, సోషల్ మీడియా కావడంతో నవీన్‌ను ఏమీ చేయలేకపోతున్నారు. ఇటీవల ఓ యువతి ఫిర్యాదుతో ఒక్కసారిగా పోలీసులంతా కలిసి క్యూ-న్యూస్ ఛానెల్‌పై మూకుమ్మడి దాడి చేసి కంప్యూటర్లు, హార్డ్‌డిస్కులు స్వాధీనం చేసుకొని నానా హంగామా చేశారు. ఓ కేసు బుక్ చేసి వదిలేశారు. అంతే. అంతకుమించి ఏమీ చేయలేకపోయారు. మల్లన్నా..మజాకా...
రోజూ మల్లన్న నోటి నుంచి తిట్ల దండకం విని తట్టుకోలేక.. టీఆర్ఎస్ సోషల్‌మీడియా విభాగం ఈసారి నేరుగా రంగంలోకి దిగింది. సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. యూట్యూబ్ ఛానల్ అడ్డం పెట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ చింతపండు నవీన్‌కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై టీఆర్ఎస్ సోషల్‌మీడియా విభాగం మండిపడింది. ఈ మేరకు టీఆర్ఎస్ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్లు క్రిశాంక్, వై.సతీష్ రెడ్డి, దినేష్ చౌదరి, జగన్మోహన్ రావు సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తీన్మార్ మల్లన్నపై ఇప్పటికే చిలకలగూడ పీఎస్‌లో ఓ కేసు దర్యాప్తు జరుగుతోందని, దాంతో ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై ఆయన అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. యూట్యూబ్ ఛానెల్ అడ్డం పెట్టుకొని వార్తలు చదువుతున్నాడా.. తిడుతున్నాడా? అన్న అనుమానం వచ్చేలా ఆయన వీడియోలు ఉంటున్నాయని, కేసీఆర్‌పై పదే పదే అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు. జర్నలిజం అంటే బూతులు తిట్టడమేనా? అని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు.
ఇప్పటికైతే ఫిర్యాదుతో ఊరుకుంటున్నామని, ఆయన మళ్లీ కేసీఆర్‌ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే ఖబడ్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల సోషల్‌మీడియాలో సీఎంపై అనుచిత పోస్టులు పెడితే పోలీసులు అరెస్టులు చేశారని, తీన్మార్ మల్లన్న ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించారు టీఆర్ఎస్ నాయకులు. మరి, ఇలాంటి బెదిరింపులకు తీన్మార్ మల్లన్న భయపడతారా?