బీజేపీ కార్పొరేటర్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి.. జెండా ఆవిష్కరణలో రచ్చ రచ్చ
posted on Aug 15, 2021 @ 1:42PM
స్వాతంత్ర దినోత్సవ వేడుక రాజకీయ రగడకు వేదికైంది. హైదరాబాద్ లోని మల్కాజ్ గిరిలో రచ్చరచ్చైంది. జెండా ఆవిష్కరణ సందర్భంగా స్థానిక బీజేపీ కార్పొరేటర్, టీఆర్ఎస్ ఎమ్మెల్సే మధ్య జరిగిన గొడవతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. ఇరు వర్గాలు దాడులకు దిగాయి. ఈ ఘటనతో బీజేపీ కార్పొరేటర్ కు గాయాలు కావడంతో రాజకీయ వివాదం మరింత ముదిరింది.
మల్కాజిగిరి జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ సందర్భంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మల్కాజిగిరి బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్ జాతీయ జెండా ఎగరవేసిన సందర్భంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘర్షణలో కార్పొరేటర్ శ్రావణ్ తీవ్రంగా గాయపడ్డారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. బీజేపీ కార్పొరేటర్ ను అంతు చూస్తానంటూ ఎమ్మెల్యే మైనంపల్లి బెదిరిస్తున్న విజువల్స్ వైరల్ గా మారాయి. మైనంపల్లి రెచ్చగొట్టడం వల్లే టీఆర్ఎస్ కార్యకర్తలు కార్పొరేటర్ పై దాడి చేశారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలంటూ మల్కాజిగిరి చౌరస్తాలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు. ఈ ఘర్షణపై ఎమ్మెల్యే మైనంపల్లి పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.అటు బీజేపీ నేతలు కూడా ఫిర్యాదు చేశారు.
టీఆర్ఎస్ నాయకుల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మల్కాజ్‌గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, మాజీ ఎంపీ విజయశాంతి, మాజీమంత్రి విజయరామరావు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు పరామర్శించారు. ఎమ్మెల్యే మైనంపల్లి నీచమైన వ్యక్తి అని, గూండాయిజం దాడులతో రాజకీయం చేస్తుండని బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ లో చేరదామని వస్తే మేం తరిమికొట్టామని, అలాంటి వ్యక్తిని కేసీఆర్ పార్టీలో చేర్చుకోవడం సిగ్గుచేటన్నారు. మైనంపల్లి అక్రమాలను బయటపెట్టి రౌడీయిజాన్ని తొక్కిపడేస్తామని హెచ్చరించారు.
దాడి జరుగుతున్న సమయంలో చోద్యం చూస్తున్న పోలీసుల్ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే డీజీపీ స్పందించి మైనంపల్లి సహా టీఆర్ఎస్ గుండాలపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలన్నారు. లేనిపక్షంలో బీజేపీ సత్తా చూపుతామన్నారు. గాయపడిన కార్పొరేటర్ శ్రవణ్ మాట్లాడుతూ తనకు ప్రాణ హాని ఉందని రక్షణ కలిపించాలని కోరారు. టీఆర్ఎస్ నాయకులు విచక్షణ రహితంగా బూతులు తిడుతూ తన పై దాడి చేసారని చెప్పారు. నిందితులని అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.