కేసీఆర్ కి అమావాస్యే అడ్డొచ్చిందా?
posted on Mar 2, 2014 @ 2:16PM
తెలంగాణ వచ్చేస్తోంది కాబట్టి.. తెలంగాణా రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) భవితవ్యం గురించి చర్చించేందుకు శనివారం జరగాల్సిన టీఆర్ఎస్ కీలక సమావేశం వాయిదా పడింది. ఆ రోజు అమవాస్య కారణంగా పొలిట్ బ్యూరో సమావేశాన్ని 3వ తేదీన నిర్వహిస్తామని టీఆర్ ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు స్వయంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో దోస్తీ కట్టాలా.. లేక కమలంతో కదం కలపాలా అనే విషయం తేల్చుకోడానికి టీఆర్ఎస్ ఓ భారీ సమావేశం నిర్వహించాలనుకుంది. దానికి శనివారాన్ని ముందు ముహూర్తంగా నిర్ణయించుకున్నారు. ఆరోజు పార్టీ పొలిట్ బ్యూరో, పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేచర్ పార్టీ, రాష్ట్ర కార్యవర్గం కలిసి శనివారం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం అవుతాయని ఆ పార్టీ ఇంతకుముందు ప్రకటించింది.
కానీ, మధ్యలో ఏమైందో గానీ.. కాంగ్రెస్ పార్టీకి, కేసీఆర్ కు మధ్య సంబంధాలు ఒక దశలో కాస్త చెడాయి. దాంతో విలీనం లేదా పొత్తు అనే విషయాన్ని శనివారమే తేల్చేస్తామని ముందు చెప్పినా.. తర్వాత మళ్లీ బీజేపీతో దోస్తీ కడితే ఎలాగుంటుందని కేసీఆర్ ఆలోచించారు. అంతే, వెంటనే కమలనాథులను సంప్రదించేందుకు వీలుగా తమ కీలక సమావేశాన్ని వాయిదా వేశారు. కానీ ఈ విషయాలన్నింటినీ బయటకు చెప్పేస్తే ఎందుకొచ్చిన తలొనొప్పి అని.. అమావాస్య వంక పెట్టారని వినికిడి.
కాంగ్రెస్ లో టీఆర్ఎస్ విలీనం గురించి కేసీఆర్ సంకేతాలు ఇచ్చారని, తుది నిర్ణయం మాత్రం తీసుకోవాల్సి ఉందని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ చెప్పగా, కాంగ్రెస్ తో విలీనం కంటే పొత్తే మేలని టీఆర్ఎస్ నాయకులు బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. కేంద్ర మంత్రి జైరాం రమేష్ తో పాటు ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి కూడా కేసీఆర్ పై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో టీఆర్ ఎస్ పయనం ఎటు అన్న విషయం సోమవారం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది!