పోలింగ్ కు కొన్ని గంటల ముందు టీఆర్ఎస్ కు ఊహించని షాక్?
posted on Oct 27, 2021 @ 10:43AM
తెలంగాణ రాజకీయాల్లో కాక రాజేస్తున్న కరీంనగర్ జిల్లా హుజురుబాద్ ఉప ఎన్నిక ప్రచారం తుది దశకు చేరింది. ఎన్నికల సంఘం కొత్త ఆదేశాలతో మూడు రోజుల ముందే అంటే బుధవారం సాయంత్రమే గడువు ముగియనుంది. దీంతో ప్రధాన పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నాయి. మనీ, మందును విచ్చలవిడిగా పంపిణి చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికను సవాల్ గా తీసుకున్న అధికార పార్టీకి.. పోలింగ్ అతి దగ్గరలో ఉండగా ఉహించని షాక్ తగిలింది. తాజాగా వచ్చిన సమస్యతో పోలింగ్ రోజున తమకు తీరని నష్టం జరుగుతుందనే ఆందోళనలో గులాబీ లీడర్లు కనిపిస్తున్నారు.
అధికార పార్టీని అంతగా కలవరపడుతున్న అంశం కొవిడ్ వ్యాక్సినేషనే. కొవిడ్ టీకా తీసుకోనివారికి రేషన్ , పెన్షన్ ఇవ్వబోరని మంగళవారం పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుందంటూ డీఎంహెవ్ శ్రీనివాస రావు ప్రకటన చేసినట్లు వార్తలు వచ్చాయి. గంటల్లోనే ఈ ప్రచారం రాష్ట్రమంతా చేరింది. ఇదే ఇప్పుడు కారు పార్టీని
కలవరపెడుతోంది. టీకా తీసుకోనోళ్లకు ప్రభుత్వ పథకాలు బంద్ చేస్తామంటూ జరుగుతున్న ప్రచారం టీఆర్ఎస్కు కొత్త చిక్కులు తెచ్చేలా కనిపిస్తున్నది. వ్యాక్సిన్ ముఖ్యమే అయినప్పటికీ, పేదలు లబ్ధిపొందే స్కీంలను ఎలా ఆపుతారంటూ? పలువురి నుంచి విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద యుద్ధమే చేస్తున్నారు.
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తమ కొంప ముంచేలా ఉందని గ్రహించిన అధికార పార్టీ వెంటనే రంగంలోకి దిగింది. హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావుతో వివరణ ఇప్పించింది. టీకా తీసుకోనివాళ్ల రేషన్, పెన్షన్ ఇవ్వరంటూ జరుగుతున్న ప్రచారం ఫేక్ అని చెప్పించింది. అలాంటి నిర్ణయం ఏది తీసుకోలేదని స్పష్టం చేశారు శ్రీనివాసరావు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గ్రామాల్లోకి ఈ ప్రచారం వెళ్లిపోయింది. ఇదే అదనుగా బీజేపీ శ్రేణులు హుజురాబాద్ లో ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. దీంతో అక్కడి ఓటర్లలో ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించిందని తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలను ఆపేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తున్నారనే అభిప్రాయం జనాల్లో వ్యక్తమైంది.
ఇదిలా ఉండగానే గద్వాల కలెక్టర్ వల్లూరు క్రాంతి చేసిన ట్వీట్కూడా సంచలనం రేకిత్తిచ్చింది. కొవిడ్ టీకా తీసుకోని వాళ్లకు నవంబర్ నెలలో రేషన్, పెన్షన్ ఇవ్వబోమని ఆమె ట్వీట్ చేశారు. వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు ప్రతీ జిల్లాలో అంతర్గతంగా ఇలాంటి ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. తక్కువ వ్యాక్సినేషన్ అయిన గ్రామాల్లో ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నట్లు స్వయంగా అధికారులే చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయా గ్రామాల్లో రేషన్, పింఛన్ లబ్ధిదారుల లిస్టును కూడా తయారు చేసినట్లు క్షేత్రస్థాయి అధికారులు చెబుతున్నారు. దీంతో వ్యాక్సిన్ కోసం పథకాలు ఆపుతామని బెదిరిస్తున్న అధికారులు, రాబోయే రోజుల్లో ఓట్ల కోసం ఏదైనా చేస్తారేమోనని ప్రజలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.హుజురాబాద్ నియోజకవర్గంలోనూ అలాంటి పరిస్థితులే ఉన్నాయి. దీంతో ఇది ఎక్కడ తమను దెబ్బ కొడుతుందోనన్న ఆందోళనలో టీఆర్ఎస్ నేతలు ఉన్నారు.