ఇంటికి కిలో బంగారం ఇచ్చినా మునుగోడులో టీఆర్ఎస్ గెలవదు.. కోమటిరెడ్డి
posted on Aug 26, 2022 @ 10:40AM
మునుగోడు ఉప ఎన్నిక కేసీఆర్ పతనానికి నాంది అని బీజేపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అన్నారు. శుక్రవారం (ఆగస్టు26) విలేకరులతో మాట్లాడిన ఆయన కేసీఆర్ మునుగోడులో ఇంటికి కిలో బంగారం పంచినా టీఆర్ఎస్ ను గెలిపించలేరని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వెనకేసిన అవినీతి సొమ్ముతో మునుగోడు ఓటర్లను కొనే ప్రయత్నం చేస్తున్నారనీ, అయితే మునుగోడు ప్రజలు ప్రలోభాలకు లొంగరనీ వారు చైతన్యం కలిగిన వారనీ పేర్కొన్నారు.
కేసీఆర్ గిమ్మిక్కులకు పడిపోయి మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ కు ఓట్లేస్తారనుకోవడం భ్రమేనని అన్నారు. కేసీఆర్ లో ఓటమి భయం మొదలైందని, అందుకు మునుగోడు సభలో కేసీఆర్ మాటలే తార్కానమని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
తెలంగాణలో కుటుంబ పాలనను తరిమికొట్టేందుకు మునుగోడు ఉప ఎన్నిక శ్రీకారం చుట్టిందన్నారు. మునుగోడు తీర్పుపైనే తెలంగాణ భవిష్యత్ ఆధారపడి ఉందన్నారు. మునుగోడు సభలో కేసీఆర్ ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేశారన్నారు. రైతులకు వ్యవసాయ మీట్లర్లు పెడతారని కేసీఆర్ భయపెడుతున్నారనీ, అసలు నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ అధికారంలోకి వచ్చిన కేసీఆర్ చేసిందేమిటని విమర్శించారు.
గజ్వేల్, సిరిసిల్లకే కేసీఆర్ పాలన పరిమితమైందని, అసెంబ్లీ సాక్షిగా తాను మునుగోడుకు నిధులు మంజూరు చేయాలని అడిగినా కేసీఆర్ స్పందించలేదని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే పదవిలో ఉండి కూడా ప్రజల కోసం పని చేయలేకపోతున్నాననే బాధతోనే రాజీనామా చేశానని అన్నారు. టీఆర్ఎస్ ను గద్దె దింపడం టీఆర్ఎస్ తోనే సాధ్యమౌతుందని, అందుకే తాను బీజేపీలో చేరానని వివరణ ఇచ్చారు.