తెరాస, కాంగ్రెస్ ఎంపీల జంప్? కేటీఆర్, రేవంత్ జోస్యం
posted on Oct 9, 2022 @ 1:27PM
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పేరు మార్పు, మునుగోడు ఉప ఎన్నిక, రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, భారత్ జోడో యాత్ర ... ఈ మూడు ప్రధాన రాజకీయ పరిణామాలు నేపధ్యంగా తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. రాజకీయ ఉష్ణోగ్రతలు రోజుకు పెరుగుతున్నాయి. తెరాస పేరు మార్పు వ్యవహారం అనుకున్నట్లుగా సాగడం లేదు. వినాయకుడి పెళ్ళికి వెయ్యి విఘ్నాలు అన్నట్లుగా, ఏవేవో విఘ్నాలు ఎదురవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. దీంతో మునుగోడు నుంచి బీఆర్ఎస్ పతాకంపై భారత యాత్రకు శ్రీకారం చుట్టాలనుకున్నతెరాస వ్యూహం బెడిసికొట్టినట్లే కనిపిస్తోంది. ఇక రాహుల్ గాంధీ యాత్ర విషయానికి వస్తే, ఈ నెల (అక్టోబర్) 24న రాష్ట్రంలో ప్రవేశిస్తోంది. రాహుల్ రాష్ట్రంలో ఉండగానే మునుగోడు ఉప ఎన్నిక జరుగుతుంది. సో .. రాహుల యాత్ర మునుగోడు ఫలితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో కొంత ఉత్కంఠ రేకిస్తోంది.
ఇదలా ఉంటే తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ రాహుల గాంధీ యాత్ర రాష్ట్రంలో ప్రవేశించడానికి ముందే, ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు ఆ పార్టీకి గుడ్ బై చెపుతారని సంచలన జోస్యం చెప్పారు. ఉన్న ముగ్గురు ఎంపీల్లో రేవంత్ రెడ్డిని తీసేస్తే మిగిలినది ఉత్తమ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట రెడ్డి. ఇద్దరూ పార్టీ మారుతున్నారని కేటీఆర్ చెప్పకనే చెప్పారు.
నిజానికి, కోమటి రెడ్డి వెంకట రెడ్డి సోదరుడు రాజగోపాల రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరినప్పటి నుంచి ఆయన (వెంకటరెడ్డి) కాంగ్రెస్ పార్టీలో ఎంతవరకు కొనసాగుతారు అనే విషయంలో అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అంతే కాకుండా, రాజగోపాల రెడ్డి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో కోమటి రెడ్డి వెంకట రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి తరపున ప్రచారంలో పాల్గొనడం లేదు.
ఈ నేపధ్యంలో ఆయన కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారనే ప్రచారం అయితే జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే, రాహుల్ గాంధీ యాత్రకు ముందే ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు పార్టీ మారతారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్, ఉత్తమ కుమార్ రెడ్డి పార్టీ నిబద్ధత, నిజాయతీ గురించి మాత్రమే గొప్పగా చెప్పుకొచ్చారు కానీ, కోమటిరెడ్డి వెంకట రెడ్డి పేరును మాత్రం తీసుకోలేదు. అలాగే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న మల్లికార్జున ఖర్గే, ‘గాంధీ భవన్’ లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఉత్తమ కుమార్ రెడ్డి హాజరయ్యారు. కానీ, కోమటి రెడ్డి రాలేదు. నిజానికి ఉత్తమకుమార్ రెడ్డి మనసులో ఏమున్నా, మునుగోడు ప్రచారంలో పాల్గొనడంతో పాటుగా, పార్టీ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. దీంతో, కేటీఆర్ జ్యోతిషం సగమే నిజమయ్యేలా ఉందని అంటున్నారు. ఇద్దరు కాకున్నా ఒకరు చేయి వదలడం ఖాయంగానే కనిపిస్తోందని అంటున్నారు.
అదలా ఉంటే మంత్రి కేటీఆర్ జ్యోతిష్యానికి కౌంటర్గా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజ్యసభలో తెరాస పక్షం బీజేపీలో విలీనం కాబోతోందని జోస్యం చెప్పారు. అదికూడా ప్రగతి భవన్ కేంద్రంగా నడిచే రాజకీయాలలో కీలకంగా వ్యవహరించే ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నిహిత బంధువు సంతోష కుమార్, సారధ్యంలో జరుగుతుందని, ఐదుగురు తెరాస ఎంపీలు బీజేపీలో చేరడం ఖాయమని పేర్కొనారు. రాజ్యసభలో తెరాసకు ఉన్న ఏడుగురు సభ్యుల్లో ఇప్పటికే నలుగురు సిద్ధంగా ఉన్నారని, ఇంకొకరు ముందుకొస్తే విలీనం తథ్యమన్నారు. బీజేపీలో విలీనానికి సిద్ధపడ్డవారి జాబితాలో కేకే, సురేశ్‌రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్‌ల పేర్లు లేవని రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
అయితే, మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ఎంపీల గురించి చెప్పిన జ్యోతిషంలానే, రేవంత్ రెడ్డి చెప్పిన తెరాస రాజ్యసభ ఎంపీల జంప్ జ్యోతిషం కూడా పూర్తిగా కొట్టివేయడం కుదరదని, రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అయితే, జ్యోతిషం నిజమయ్యే వరకు మాత్రం ఇప్పుడే ఎవరు ఎవరు జంప్ చేస్తున్నారన్న జ్యోతిషం చెప్పలేమని అంటున్నారు.