తెలంగాణ అపోజిషన్…కేసీఆర్ ఉచిత పంపిణీల వ్యూహం ముందు ఓడిపోతోందా?
posted on Jun 27, 2017 @ 4:21PM
కేసీఆర్ నిస్సందేహంగా గొప్ప ఉద్యమకర్త. అరవై ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో తమ పాత్ర కూడా వుందని ఎందరు చెప్పుకున్నా …. కేసీఆరే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ హీరో! అందుకే, రాష్ట్రం ఏర్పాటు కాగానే ఇచ్చిన కాంగ్రెస్ ను కాదని టీఆర్ఎస్ ను ఎంచుకున్నారు టీ ఓటర్లు! అయితే, ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్ లోని మరో కోణం ఇప్పుడు బయటకొస్తోంది! ఆయన ఎంత మంచి ఉద్యమకారుడో, ఎంత మంచి వక్తో, అంతే మంచి రాజకీయ నేత కూడా! ఒక్కసారి అధికారం చేజిక్కగానే తనలోని పొలిటీషన్ని అదును చూసి బయటపెడుతున్నారు కేసీఆర్!
సీఎం అయ్యాక బంగారు తెలంగాణ నినాదం నెత్తికెత్తుకున్న కేసీఆర్ అందుకు తగ్గట్టే హడావిడి కూడా మొదలు పెట్టారు. జనం ఎలా భావిస్తున్నప్పటికీ ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం ఆయన పాలన హడావిడే అంటూ పెదవి విరుస్తోంది. మిషన్ కాకతీయ, మిషన్ భగరీథ మొదలు వివిధ ప్రాజెక్ట్ ల కోసం భూముల సేకరణ, ఆఖరుకు ధర్నా చౌక్ తరలింపు… ఇలా చాలా విషయాలపై కేసీఆర్ ను టార్గెట్ చేయాలని ప్రయత్నించారు టీ కాంగ్రెస్ వారు. ఇక టీ టీడీపీ, టీ బీజేపి ప్రయత్నాలనైతే పెద్దగా చెప్పుకోవాల్సింది కూడా లేదు. వారు ఎంత ప్రయత్నించినా… ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ వల్లే అవ్వనిది వారి వల్ల కూడా అవ్వటం లేదు. మొత్తానికి కేసీఆర్ మూడేళ్ల పాలనలో జనానికి మేలు చేసినా, చేయకపోయినా… విపక్షాలపై మాత్రం పై చేయి సాధించారు!
కేసీఆర్ ప్రస్తుతం కొనసాగిస్తోన్న వ్యూహం కుల వృత్తుల్ని ప్రొత్సహించటం! ఆయన చేస్తున్న పనుల్ని ఎలా విమర్శించాలో అర్థం కాక సతమతం అవుతున్నాయి తెలంగాణ విపక్షాలు! కురుమ కులస్థులకి ఆయన గొర్రెల్ని పంపిణీ చేస్తామని ప్రకటించి అమల్లో పెట్టేశారు కూడా! గొర్రెల్ని ఎందుకు పంపిణీ చేస్తున్నారని అడగలేక... అలాగని కేసీఆర్ చేస్తున్న పనిని మెచ్చుకోలేక ఉత్తమ్ కుమార్ టీమ్ సందిగ్ధంలో వుండిపోయింది. వివిధ కులాల వారికి కావాల్సింది ఉద్యోగాలు కానీ.. గొర్రెలు కాదని కొంత మంది నాయకులు విమర్శలు చేసినా అవ్వి పెద్దగా నిలవలేదు!
గొర్రెల పంపిణీ వర్కవుట్ కావటంతో టీఆర్ఎస్ గవర్నమెంట్ మరిన్ని కులాల్ని టార్గెట్ చేసింది! తాజాగా రజకులకి వాషింగ్ మెషిన్లు, డ్రయ్యర్లు, ఇస్త్రీ పెట్టెలు ఇవ్వాలని నిర్ణయించారు. నాయి బ్రాహ్మణులకి అత్యాధునిక సెలూన్ల నిర్వహణ కోసం ఆర్దిక సాయం కూడా అందజేస్తారట. ఇక విశ్వఖర్మ, వడ్రంగీ, కల్లుగీత, టైలరింగ్ వృత్తుల వారికి కూడా తమ తమ పనుల్లో ఉపయోగపడే యంత్రాల్ని, పరికరాల్ని ప్రభుత్వం ఇవ్వనుందని చెబుతున్నారు. ఇలా ఒక్కో కులాన్నీ వెదికి వెదికి సాయం చేయటంలో కేసీఆర్ ఆంతర్యం ఏంటి? వచ్చే ఎన్నికల్లో అన్ని కులాల వారు తమకు ఓటు వేసేలా చూసుకోవటమే!
రైతులకి వచ్చే యేడాది నుంచి ఉచిత ఎరువు అంటోన్న సీఎం దాదాపుగా సమాజంలోని అన్ని వర్గాల్ని ఎంచుకుని మరీ ఏదో ఒక ఉచిత సాయం చేసేస్తున్నారు. ఈ ఫ్రీ ఆఫర్స్ అన్నీ అసలు వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించే వ్యూహమే అంటున్నాయి ప్రతిపక్షాలు. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమ డిమాండ్స్ ఇంకా అలానే వున్నాయనీ… వాటి గురించి జనం సీరియస్ గా ఆలోచించకుండా చేయటమే కేసీఆర్ లక్ష్యమని నేతలంటున్నారు. అది నిజమే అయినా… కేసీఆర్ తెలివిగా ఎక్కుపెట్టిన కుల వృత్తుల ప్రొత్సాహమనే బాణం అంత ఈజీగా తిప్పకొట్టడం సాధ్యం కావటం లేదు అపొజీషన్ కి! అనేక కులాల వారు, వర్గాల వారు నేరుగా లబ్ధి పొందుతుండటంతో విమర్శలు చేయటం కష్టంగా మారింది. మరీ… ఉచిత పంపిణీల వ్యూహం గులాబీ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఎన్ని ఓట్లు తెస్తుందో చూడాలి!