ముందే కూస్తానంటున్న టీఆర్ఎస్ కోయిల
posted on May 6, 2014 @ 12:18PM
రాష్ట్ర విభజన మీద స్టే ఇవ్వాలని సీమాంధ్రులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లు సోమవారం నాడు విచారణకు వచ్చాయి. సుప్రీం కోర్టు ఈ కేసులను ఆగస్టు 20వ తేదీకి వాయిదా వేసింది. అలాగే ఈలోగా జూన్ 2న వున్న రాష్ట్రాల విభజన అపాయింటెడ్ డేట్‌ని మార్చాలని కోరినప్పటికీ సుప్రీంకోర్టు అంగీకరించలేదు. ఇదిలా వుంటే, మరోవైపు టీఆర్ఎస్ నాయకులు అపాయింటెడ్ డేట్‌ని జూన్ 2 నాడు కాకుండా ఎన్నికల ప్రక్రియ ముగిసే మర్నాటికి అంటే, మే 16వ తేదీకే మార్చాలని భావిస్తున్నారు. ఈ మేరకు టీఆర్ఎస్ నాయకులు సోమవారం నాడు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా, మంగళవారం నాడు రమ్మని కోర్టు ఆదేశించింది. మంగళవారం నాడు టీఆర్ఎస్ నేతలు హై కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించిన విచారణ మంగళవారమే జరుగనుంది. అపాయింటెడ్ డేట్‌ను హై కోర్టు జూన్ 2వ తేదీగానే వుంచుతుందా లేక మే 16వ తేదీకి మారుస్తుందా అనేది చూడాలి.