తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ వేరు వేరు కాదా?
posted on Sep 19, 2022 @ 1:23PM
తెలంగాణ రాజకీయాలు విచిత్ర మలుపులు తిరుగుతున్నాయి. ఏ ముహూర్తాన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జాతీయ రాజకీయాల జపం మొదలు పెట్టారో ఆ క్షణం నుంచీ తెరాస వరుస వైఫల్యాలతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో పడింది. గతంలో ఎప్పుడో రాష్ట్ర ఆవిర్బావం సమయంలో తెరాస అధినేత కేసీఆర్ టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేసేస్థానన్నారు.
ఇన్నేళ్లకు ఇప్పుడు ఆయనకు ఆ దారి తప్ప మరో దారి గోచరించని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికిప్పుడు విలీనం ప్రక్రియ పూర్తయిపోతుందని కాదు కానీ.. టీఆర్ఎస్ అడుగులు ఆ దారిలోనే పడుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక లిట్మస్ టెస్ట్ గా తీసుకుని కాంగ్రెస్, తెరాసల మైత్రి అడుగులు ఉంటాయని అంటున్నారు. ఎవరు ఔనన్నా కాదన్నా కేసీఆర్ జాతీయ రాజకీయాల ప్రస్థానం తప్పటడుగులతోనే ఆరంభమైంది. అయితే ఈ తప్పుటడుగులను వెనక్కు తీసుకోలేనంతగా కేసీఆర్ అడుగులు ముందుకు పడ్డాయి. బీజేపీ, తెరాస మధ్య వైరుధ్యాల స్థాయి దాటిపోయింది. ఇప్పుడు ఆ పార్టీల నేతలు విమర్శల పేర వ్యక్తిగత దూషణల స్ధాయికి దిగజారిపోయారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ కూడా తన విమర్శల తీవ్రతను పెంచేయడం.. అవి నేరుగా ప్రధాని మోడీ లక్ష్యంగా సాగడంతో.. ఇప్పుడిక వెనక్కు తగ్గే పరిస్థితి లేకుండా పోయింది.
మరో వైపు జాతీయ రాజకీయాల దిశగా ఆయనకు అడుగడుగునా ఇబ్బందులే ఎదురయ్యాయి. జాతీయ స్థాయిలో మోడీ వ్యతిరేక శక్తులను ఏకం చేయాలన్న కేసీఆర్ ప్రయత్నం ప్రతి దశలోనూ ప్రతికూల ఫలితమే ఇచ్చింది. కాంగ్రెసేతర, బీజేపీయేతర కూటమి ప్రయత్నం లగాయతు.. కొత్త పార్టీ ఏర్పాటు వరకూ ఆయనకు ఏ ప్రయత్నమూ కలిసి రాలేదు. ఈ మధ్యలో రైతులు, కొన్ని రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులతో వరుస భేటీలతో రాజకీయ వేడి రగల్చడానికి ప్రయత్నించినా పెద్దగా ఫలితం కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే అనివార్యంగా కేసీఆర్ తన జాతీయ రాజకీయ అజెండాలో నుంచి కాంగ్రెస్సేతర అనే పదాన్ని తొలగించేశారు. అంతే కాకుండా రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలలో యూపీయే భాగస్వామ్య పక్షాలను మించిన ఉత్సాహంతో కాంగ్రెస్ కు అండగా నిలిచారు. ముఖ్యంగా ఉప రాష్ట్రపతి ఎన్నికలో అల్వా అభ్యర్థిత్వాన్ని ఎవరూ కోరకుండానే బలపరచడమే కాకుండా ఆమె నామినేషన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి కేటీఆర్ పాల్గొనడమే కాకుండా కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీతో చనువుగా మెలిగారు.
అంతకు ముందే కాంగ్రెస్ లో తనకు ఉన్న పరిచయాల ఆధారంగా సోనియాతో భేటీకి సీఎం కేసీఆర్ ప్రయత్నించారన్న వార్తలూ వచ్చాయి. కాగా ఇప్పుడు కాంగ్రెస్ తో చెలిమి వినా వేరే ఆప్షన్ లేదన్న నిర్ణయానికి కేసీఆర్ వచ్చిన నేపథ్యంలో ఆయన ఆ పార్టీతో సయోధ్య యత్నాలను ముమ్మరం చేశారంటున్నారు. అవి ఫలించే దిశలోనే సాగుతున్నాయనడానికి ఇటీవల మూడు రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాలే నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలలో ఏ అంశంపైనా కాంగ్రెస్ తెరాసను కానీ తెరాస కాంగ్రెస్ ను కానీ విమర్శించలేదు. పైపెచ్చు పరస్పర ప్రశంసల పర్వానికి ఈ అసెంబ్లీ వేదికగా నిలిచింది.
ములుగు మునిసిపాలిటీగా ప్రకటించినందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కేటీఆర్ కు కృతజ్ణతలు తెలిపారు. అలాగే దళిత బంధు పథకంలో ఖమ్మం జిల్లాను చేర్చినందుకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వానికి, కేసీఆర్ కు కృతజ్ణతలు తెలిపారు. అలాగే కేసీఆర్ తన ప్రసంగంలో భట్టి విజ్ణతను పొగిడారు. నిన్న మొన్నటి దాకా ఉప్పూ నిప్పూలా ఉన్న రెండు పార్టీల మధ్యా ఇంతటి సయోధ్య ఏమిటా అన్న సందేహాలు జనబాహుల్యంలో తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ జోడో యాత్ర ప్రారంభం అయితే అయ్యింది కానీ.. అంతకు ముందే తెలంగాణలో కాంగ్రెస్, తెరాస జోడీ యాత్రకు అంకురార్పణ జరిగిందని పరిశీలకులు అంటున్నారు. కేసీఆర్ జాతీయ రాజీయాల అడుగులు తడబడటంతోనే రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్, తెరాస చేతులు కలిపెందుకు అడుగులు పడ్డాయని పరిశీలకులు అంటున్నారు. జాతీయ స్థాయిలో బీజీపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకమయ్యేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో, తెలంగాణలోనూ బీజేపీ వ్యతిరేక పార్టీలు, ఒక్కటై జట్టు కట్టేందుకు సిద్దమవుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక మాటున, బీజేపీ వ్యతిరేకత వంకన ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పటికే, తెరాసతో జట్టుకట్టాయి. ప్రగతి భవన్ పంచన చేరాయి.
అయితే అదేమంత పెద్ద విషయం కాదు. ఉండీ లేనట్టు ఉన్న వామపక్షాలు ఎక్కడ ఉన్నా ఒకటే.. కానీ ఆ రెండూ తెరస పంచన చేరడం, తెరాస నాయకత్వం కాంగ్రెస్ పార్టీతోనూ జట్టుకట్టేందుకు సిద్దంగా ఉందన్న సంకేతాలివ్వడమేనని అంటున్నాయి. జాతీయ నేతలతో భేటీ పేర కేసీఆర్ హస్తిన యాత్రలు కూడా కాంగ్రెస్ తో చెలిమి యత్నాలలో భాగమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదలా ఉంటె ఇంతకాలం, తెరాస, బీజేపీ తోడూ దొంగలని ప్రచారం చేయడంలో అందె వేసిన చేయి అయిన అద్దంకి దయాకర్ స్వయంగా ఒక మీడియా తో మాట్లాడుతూ కాంగ్రెస్ తో జట్టు కట్టేందుకు కేసీఆర్ తహతహలాడుతున్నారని చెప్పారు. అయితే, కాంగ్రెస్ తో కలిసేందుకు కేసీఆర్ సిద్దంగా ఉన్నా, తెరాసతో చేయి కలిపేందుకు కాంగ్రెస్ రెడీగా లేదని ఆయన అన్నప్పటికీ.. అది కేవలం ఫేస్ సేవింగ్ కోసమే అని పరిశీలకులు అంటున్నారు.
ఎందుకంటే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజకీయ ఎత్తుగడలలో సిద్ధహస్తుడు అయిన దిగ్విజయ్ సింగ్.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు అంగీకరిస్తే తెరాసని కాంగ్రెస్’లో విలీనం చేస్తానని అప్పట్లో కేసీఆర్ ఇచ్చిన మాటను గుర్తు చేస్తూ అయిపోయింది ఏదో అయిపోయింది, ఇక ఇప్పుడైనా, బీజేపీ వ్యతిరేక పోరాటంలో కాంగ్రెస్ తో కలిసి రావాలని కేసీఆర్ కు ఒక బహిరంగ ఆహ్వానం ఇచ్చారు. అలాగే తెరాస ఎమ్మెల్యే బొల్లం యల్లయ్య యాదవ్ దేశంలో రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక శక్తులు అన్నీ ఏకం కావలసిన అవసరం ఉందని, ముఖ్యమత్రి కేసీఆర్ అదే ప్రయత్నంలో ఉన్నారని చెప్పారు.
అంతేకాదు, కేసీఆర్ నచ్చిన అనచక పోయినా, దేశ ప్రయోజనాల దృష్ట్యా, కాంగ్రెస్ పార్టీ తెరాసతో చేతులు కలపాలని డిమాండ్ లాంటి సూచన చేశారు. మొత్తానికి, జరుగుతున్న పరిణామాలను గమనిస్తే కాంగ్రెస్ తో చేతులు కలిపేందుకు తెరాస, తెరాసతో జట్టు కట్టేందుకు కాంగ్రెస్ సుముఖంగానే ఉన్నాయనీ, అందుకోసం తెరచాటు యత్నాలు ప్రారంభించేశాయనీ పరిశీలకులు అంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికలకు ముందో, తరువాతో కాంగ్రెస్, తెరాసల మధ్య పొత్తు పొడుపు ఖాయమేనని విశ్లేషణలు చేస్తున్నారు.